గాలి వీస్తే కరెంటు కట్‌!

Power Line Wires Damage In Kurnool District - Sakshi

శిథిలావస్థకుచేరుతున్న విద్యుత్‌ లైన్లు

తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడంలో జాప్యం

జిల్లాలో మొత్తం 226 సబ్‌ స్టేషన్లు

మూడు దశాబ్దాల కిత్రం నిర్మించినవి 33

నామమాత్రంగా నిర్వహణ పనులు

పెరగనున్న బ్రేక్‌డౌన్స్, ట్రిప్పింగ్స్‌

గత ఏడాది  గాలి బీభత్సానికి వెయ్యికి పైగా విద్యుత్‌ స్తంభాలు నేలకూలి,  విద్యుత్‌ లైన్లు తెగిపోయి విద్యుత్‌ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. విద్యుత్‌ సరఫరా లేక వారం రోజుల పాటు ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి కూడా గాలి వీస్తే అదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా 226 విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఉండగా వీటిలో 33 సబ్‌స్టేషన్లు 30ఏళ్ల కిత్రం ఏర్పాటు చేసినవే. శిథిలావస్థకు చేరిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు. దీనికితోడు నిర్వహణ పనులు సైతం సరిగ్గా జరగడం లేదు. ఫలితంగా తరచూ విద్యుత్‌ సమస్యలు తలెత్తుతున్నాయి.

కర్నూలు(రాజ్‌విహార్‌):  విద్యుత్‌ సరఫరాలో ఎప్పుడుపడితే అప్పుడు అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు నెలవారి నిర్వహణ పనుల చేపట్టాలి. కానీ కర్నూలు నగరంలో తప్ప ఎక్కడా ఈ షెడ్యూల్‌ అనుసరించడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా కర్నూలుతోపాటు నంద్యాల, ఆదోని, డోన్‌ డివిజన్లలో ఉన్న విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు ఏర్పాటు చేసిన తీగల పాతబడిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్‌ వాడకం, ఓవర్‌ లోడు, ఎండల తాకిడికి తీగల క్రమంగా దెబ్బతింటున్నాయి. రెగ్యులర్‌గా నిర్వహణ పనులు చేపట్టి దెబ్బతిన్న తీగలను మార్చని పక్షంలో గాలి, వర్షాలకు బ్రేక్‌ డౌన్స్, ట్రిప్పింగ్స్‌ వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పొచ్చు.

తీగల్లో కొమ్మలు
విద్యుత్‌ తీగలతో చెట్ల కొమ్మలు సహజీవనం చేస్తున్నాయి. తీగల్లో కొమ్మలు ఉంటే గాలి వీచే సమయాల్లో షార్ట్‌ సర్క్యూట్‌ అయి బ్రేక్‌ డౌన్స్‌ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సమస్యను నివారించేందుకు గతంలో ప్రతి ఏటా వేసవి కాలంలోనే తీగల్లో ఉన్న చెట్ల కొమ్మలను కత్తిరించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేవారు.  ఇప్పుడు ఆ కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది.

30ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన సబ్‌స్టేషన్లు 33కి పైనే:కర్నూలు సర్కిల్‌ (జిల్లా)లో 33/11కేవీ సబ్‌స్టేషన్లు 226 ఉండగా వీటిలో 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన 33 ఉన్నాయి. ఇందులో కర్నూలు డివిజన్‌లో ఎనిమిది, డోన్‌ డివిజన్‌లో ఏడు, నంద్యాల డివిజన్‌లో పది, ఆదోనిలో తొమ్మిది ఉన్నాయి. నంద్యాల పవర్‌ హౌస్, బనగానపల్లె సబ్‌స్టేషన్లు 1955లో ఏర్పాటు చేసినవి కావడం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top