డీసెట్‌.. డీలా!

Poor Response To Andhra Pradesh DEECET 2019 - Sakshi

ఏపీ డీసెట్‌కు తగ్గుతున్న ఆదరణ

టీచర్‌ పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

ఐదో తేదీ వరకూ దరఖాస్తు గడువు పొడిగింపు

ఎస్జీటీకి అర్హత ఉండటంతో బీఈడీకి పెరుగుతున్న దరఖాస్తులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎలిమెంటరీ టీచర్‌ శిక్షణ విద్యా కోర్సు (డీఎడ్‌)కు ఆదరణ తగ్గిపోతోందా? ఈ కోర్సు పట్ల విద్యార్థులకు ఆసక్తి తగ్గుతోందా? అంటే.. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. తాజాగా ప్రకటించిన డీసెట్‌–2019కి అభ్యర్థుల నుంచి పెద్దగా స్పందన లేదు. ఏప్రిల్‌ 22వ తేదీతో డీసెట్‌కు గడువు ముగియగా 17 వేల మందే దరఖాస్తు చేశారు. రాష్ట్రంలో 33 ప్రభుత్వ, 891 ప్రయివేటు డీఎడ్‌ కాలేజీల్లో 65,350 సీట్లున్నాయి. తక్కువ మంది దరఖాస్తు చేసుకోవడంతో అధికారులు డీసెట్‌ గడువును ఏప్రిల్‌ 28 వరకు పెంచినా వచ్చిన దరఖాస్తులు 18,544 మాత్రమే. దీంతో మళ్లీ మే ఐదో తేదీ వరకూ గడువు పొడిగించారు. ఇంత తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో కాలేజీల్లో సీట్లు ఎలా భర్తీచేయాలో అధికారులకు, కాలేజీల యాజమాన్యాలకు అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. టీచర్‌ పోస్టుల భర్తీపై ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణంగా భావిస్తున్నారు. ఏటా డీఎస్సీ అని ప్రకటించి కేవలం ఒకే ఒక్క నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది డీసెట్‌కు 56 వేల దరఖాస్తులొచ్చాయి.  

15, 16 తేదీల్లో ఆన్‌లైన్‌ పరీక్ష
డీసెట్‌ను ఆన్‌లైన్‌లో 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈసారి దరఖాస్తులు తక్కువ రావడంతో ఆన్‌లైన్‌ పరీక్షలు ఎలా నిర్వహించాలన్న సందిగ్ధంలో అధికారులున్నారు. మరోపక్క ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌సప్లిమెంటరీ పరీక్షలు, డీసెట్‌ ఒకేసారి జరుగుతుండటం కూడా దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. ఇంటర్‌ పరీక్షలు 14 నుంచి 22 వరకూ జరగనున్నాయి. అయితే డీసెట్‌ జరిగే 15, 16 తేదీల్లో ఇంటర్‌ పరీక్షల్లేకుండా రెండు రోజులు వాయిదా వేయాలని పాఠశాల విద్యాశాఖ.. ఇంటర్‌ బోర్డుకు లేఖ రాసింది. షెడ్యూల్‌ ప్రకారమే ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు అధికారులు స్పష్టంచేశారు. అయితే డీసెట్‌ను ఆన్‌లైన్లో నిర్వహిస్తున్నందున వాయిదా వేసే అవకాశం లేకుండాపోయిందని అధికారులంటున్నారు. మరోసారి ఇంటర్‌ బోర్డుకు లేఖ రాస్తామని కన్వీనర్‌ పార్వతి చెప్పారు. ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు రెండు రోజులు వాయిదా పడితే దరఖాస్తులు పెరిగే అవకాశముంది.

బీఈడీకి దరఖాస్తులు రెట్టింపు
ఇదిలా ఉండగా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు బీఈడీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 350 బీఈడీ కాలేజీలుండగా 45 వేల వరకు సీట్లున్నాయి. వీటికి గతంలో వచ్చిన దరఖాస్తులు ఎనిమిది వేలలోపే. పరీక్ష రాసి అర్హత సాధించాక కాలేజీల్లో చేరేవారి సంఖ్య ఐదు వేలకు మించేదికాదు. దీంతో రాష్ట్రంలోని ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు ఇతర రాష్ట్రాల్లో దళారీలను నియమించుకుని అక్కడి విద్యార్థులను చేర్చుకుని సీట్లు భర్తీచేసుకునేవి. అయితే బీఈడీ అభ్యర్థులకు కూడా స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకూ అనుమతిస్తూ జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిర్ణయం తీసుకుంది. దీంతో బీఈడీ చేసిన వారికి అవకాశాలు మెరుగయ్యాయి. ఈ నేపథ్యంలో ఎడ్‌సెట్‌కు దరఖాస్తులు పెరిగాయి. ఎడ్‌సెట్‌–2019కి ఇప్పటివరకు 22 వేలకు పైగా దరఖాస్తులొచ్చాయి. గతేడాదితో పోలిస్తే వీటిసంఖ్య మూడు రెట్లు అయినట్లు  అధికారులు చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top