
సాక్షి, అమరావతి: ‘‘పేదలకు, కార్మికులకు ఒక రూపాయికే టిఫిన్..రూ.5కే భోజనం సరఫరా నిమిత్తం ‘అన్న ఎన్టీఆర్ క్యాంటిన్లు’ నిర్మిస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు ఆ ఊసే ఎత్తకుండా.. 2019 ఎన్నికలు సమీపిస్తుండడంతో..హడావుడిగా ఆ పథకాన్ని అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు విమర్శల పాలవుతున్నాయి. ఇందుకోసం నిరుపేదలను నిరాశ్రయులను చేసి అన్న ఎన్టీఆర్ క్యాంటిన్ల నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు బాహటంగా వినపడుతున్నాయి.
గతంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలాలు, నివాసం ఉంటున్న స్థలాలను ఖాళీ చేయించి క్యాంటిన్లు నిర్మించే ప్రయత్నాల్లో అధికారులున్నారు. ప్రభుత్వ స్థలాలు లభించకపోవడంతో ప్రైవేట్ స్థలాల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపల్ అధికారులకు స్థలాల అన్వేషణ బాధ్యతలను అప్పగించింది. గతంలో నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించిన స్థలాలు, వారు నివాసం ఉంటున్న స్థలాలను రాత్రికి రాత్రి ఖాళీ చేయిస్తున్నారు. పోలీస్ యంత్రాంగంతో వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
రూ.400 కోట్లు కేటాయించినా ...
గత ఏడాది 203 క్యాంటిన్లు ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు ఆ మేరకు బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు.స్థలాలు లభించకపోవడంతో, నాలుగు క్యాంటిన్ల నిర్మాణాలే పూర్తయ్యాయి. ఈ ఏడాది మరో రూ.200 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. అయితే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో నిర్దేశించిన కొలతల్లో వీటిని నిర్మించాలనే నిబంధన పెద్ద ప్రతిబంధకంగా మారింది.
కోర్టుకెళ్లమన్నారు..
ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను సాధించేందుకు విశాఖపట్నం జిల్లా భీమిలి మున్సిపల్ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. చిట్టివలస జ్యూట్‌మిల్లు యాజమాన్యానికి చెందిన స్థలంలో అక్కడి అధికారులు అన్న క్యాంటిన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆ మిల్లు కార్మికులు నిర్మాణ పనులు నిలిపివేయాలని పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. అయితే వివాదాన్ని పరిష్కరించకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఆ జూట్‌మిల్లు కార్మిక సంఘం నాయకులకు పోలీసులు సూచించారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం లేకుండాపోయింది. ఇదే అదునుగా చేసుకుని అధికారులు అన్న క్యాంటిన్ నిర్మాణ పనుల్లో వేగం పెంచారు.
ప్రకాశంలోనూ దందా..
కందుకూరు పట్టణంలోని పాతచేపల మార్కెట్ సెంటరులో 50 ఏళ్లకుపైగా 20 కుటుంబాలు నివాసం ఉంటూ చిన్నచిన్న బంకులు పెట్టుకుని చిరువ్యాపారాలతో జీవనం సాగిస్తున్నారు. అయితేరాత్రికి రాత్రి పొక్లెయిన్ల సహాయంతో వాటిని తొలగించి చిరు వ్యాపారులను నిరాశ్రయులను చేశారు. ఇప్పుడు ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి పోలీస్ కాపలా ఉంచారు.
వక్ఫ్‌భూములను సైతం..
గుంటూరు నగరంలోని మంగళదాస్ నగర్‌లో వక్ప్‌భూముల్లో నివాసం ఉంటున్న కొందరి నిరుపేదల జాబితాలను అక్కడి మున్సిపల్ అధికారులు సేకరించారు. వారిని అక్కడి నుంచి తొలగించి అన్న క్యాంటిన్ నిర్మాణం చేపట్టే యత్నంలో ఉన్నారని ఉద్యోగ వర్గాల కథనం.