ప్రాణాలైనా అర్పిస్తాం..భూములు వదలం

Police Use Lathi Charge on Farmers Anantapur - Sakshi

పొలాల ధ్వంసం దారుణం

అధికారులా..ఎమ్మెల్యే అనుచరులా?

తుంపర్తి, మోటుమర్ల రైతుల ఆగ్రహం

ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళనలో ఉద్రిక్తత

రైతులను బలవంతంగా అరెస్ట్‌ చేసిన పోలీసులు

‘ఏళ్ల తరబడి భూమిని నమ్ముకుని జీవిస్తున్నాం.. ఉన్నపళంగా భూములు లాక్కొని పేదల పొట్ట కొట్టాలని చూస్తున్నారు.. బడాబాబులను వదిలి మా భూములపై కన్నేశారు.. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ అన్నం పెట్టే భూములను వదులుకునేది లేదు’ అంటూ ధర్మవరం మండలం తుంపర్తి, మోటుమర్ల గ్రామాల రైతులు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ప్రతినిధుల్లా పని చేయాల్సిన అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యేకు అనుచరుల్లా మారి విధులు నిర్వర్తిస్తున్నారని ఆగ్రహించారు. బడాబాబుల భూములను వదిలి పేదల పొలాలపై పడతారా అంటూ మండిపడ్డారు. ఆర్డీఓ కార్యా లయం వద్ద అఖిలపక్ష ఆధ్వర్యంలో బాధిత రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.

అనంతపురం, ధర్మవరం టౌన్‌: అర్బన్‌ హౌసింగ్‌కు భూసేకరణ పేరుతో అరకొర పరిహారం ఇచ్చి భూములను స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ, పోలీస్‌ అధికారులు యత్నించిన నేఫథ్యంలో రెండవ రోజు గురువారం తుంపర్తి, మోటుమర్ల రైతులు అఖిలపక్ష నాయకులతో కలిసి ధర్మవరం ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేశారు. దిగివచ్చిన ఆర్డీఓ, తహసీల్దార్‌ మహబూబ్‌బాషా, తిప్పేనాయక్, ధర్మవరం డీఎస్పీ టీఎస్‌ వెంకటరమణ, కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మిలు ఆందోళనకారులతో ఆర్డీఓ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో చర్చలు జరిపారు. బాధిత రైతులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా భూసేకరణ చేస్తున్నారన్నారు. గ్రామసభలను బహిష్కరించామని, రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టలేదని, భూములు ఇచ్చేందుకు రైతులకు ఇష్టం లేకపోయినా బలవంతంగా భూములు ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన మామిడి తోటను చేతికందే దశలో ఎలా ధ్వంసం చేస్తారని నిలదీశారు. యుద్ధ ప్రాతిపదికన పంట పొలాలను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 

2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు ఎకరాకు మార్కెట్‌ విలువ ప్రకారం ఎకరాకు రూ.30 లక్షలు పరిహారం రావాల్సి ఉంటే రూ.5 లక్షలు ఎలా మంజూరు చేస్తారని రైతులు నిలదీశారు. బోరు బావుల కింద మామిడి చెట్లు, జామ చెట్లు, వరి, కాయ గూరలు సాగు చేస్తున్న రైతులను కనీసం విచారించకుండా ఏకపక్షంగా పోలీసుల అండతో కూలగొట్టడం ఎంత వరకు న్యాయమన్నారు. ఎమ్మెల్యే సూర్యనారాయణకు బినామీ భూములు చాలా ఉన్నాయని, వాటిని పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ధర్మవరం మండలంలో సొసైటీ భూములు, మాన్యం భూములు చాలా ఉన్నాయని వాటిని సేకరించుకోవాలన్నారు. అలా కాకుండా ఉద్దేశ్య పూర్వకంగా తుంపర్తి, మోటుమర్ల రైతుల్ని టార్గెట్‌ చేయడం దారుణమన్నారు. ఇందుకు ఆర్డీవో స్పందిస్తూ పరిహారం విషయంలో ఇంకా కొంత ఇచ్చేలా చర్యలు చేపడతామని, ఎస్సీ, ఎస్టీలకు రెండున్నర ఎకరాల భూమిని ఇస్తామని హామీ ఇచ్చినా బాధితులు శాంతించలేదు. మా భూములు మాకు ఇవ్వాలి లేదా ఎకరాకు రూ.30లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు.

కార్యక్రమంలో సీపీఎం అనుబంధ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి, సహాయ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న, బడా సుబ్బిరెడ్డి, హరి, కదిరప్ప, సీపీఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్, కార్యనిర్వాహక సభ్యులు పోలా రామాంజినేయులు,  సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జింకా చలపతి, సిద్దే రమణ, జనసేన శ్యాంకుమార్, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రంగన అశ్వర్థనారాయణ, ఐఎన్‌టీయూసీ నాయకుడు అమీర్‌బాషా, బీఎస్పీ శ్రీరాములు, నవతరం పార్టీ నేత శామ్యూల్‌ రైతులు పాల్గొన్నారు.  

చర్చలు విఫలం.. రైతుల అరెస్ట్‌
రెవెన్యూ అధికారులతో చర్చలు విఫలం కావడంతో బాధిత రైతులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట అఖిలపక్ష నాయకులతో కలసి ఆందోళన చేపట్టారు. పోలీసు, రెవెన్యూ అధికారులు, రైతులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు బాధిత రైతులను బలవంతంగా అరెస్ట్‌ చేసి వ్యానులో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో బాధిత రైతు వెంకటరమణ కుమార్తె తలను వ్యానుకు గుద్దుకుంటూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో పోలీసులు ఆమెను పక్కకు తీసుకెళ్లారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top