పైడికొండల దీక్ష భగ్నం

Police Stops Pydikondala Manikyala Rao Protest West Godavari - Sakshi

క్షీణించిన మాణిక్యాలరావు ఆరోగ్యం

బలవంతంగా పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలింపు

పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ..  మాజీ మంత్రి, ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు  చేస్తున్న దీక్షను పోలీసులు మంగళవారం రాత్రి భగ్నం చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా పోలీసు వాహనంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఉదయం ఉత్సాహంగా యోగాసనాలు వేసి ఉల్లాసంగా కనిపించిన ఆయన సాయంత్రానికి నీరసపడ్డారు. సోమవారం దీక్షలో కూర్చునే సమయంలో 71 కిలోల బరువు ఉన్న ఆయన మంగళవారం సాయంత్రం 69 కిలోలకు తగ్గారు. మంగళవారం సాయంత్రం నుంచి ఆయన ఆరోగ్యంలో మార్పులు వచ్చాయి. ఒక్కసారిగా బీపీ, బరువు తగ్గడంతో వేగంగా డీహైడ్రేషన్‌ వచ్చే సూచనలు ఉన్నాయని ఆయనకు పరీక్షలు జరిపిన డాక్టర్‌ ప్రసాదరావు చెప్పారు. ఈ పరిస్థితిలో సెలైన్లు ఎక్కించాలని, లేకుంటే ప్రమాదమని వెల్లడించారు. 

ఆందోళన అనవసరం
తన ఆరోగ్యం గురించి ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని  ఎమ్మెల్యే  మాణిక్యాలరావు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం వైద్య పరీక్షల అనంతరం  ఆయన మాట్లాడారు. అభివృద్ధి విషయంలో  దొంగ లెక్కలు చెప్పిన విధంగానే ప్రభుత్వం తన వైద్యపరీక్షల రిపోర్టులను తప్పుగా ప్రకటిస్తోందని విమర్శించారు.  మంగళవారం ఉదయం పరీక్షలలో షుగర్‌స్థాయి 70కి పడిపోయిందని అన్నారని, అలా పడిపోవడానికి అవకాశం లేదు.. సరిగా పరీక్షలు చేయండని అడిగితే తర్వాత షుగర్‌ లెవెల్‌ 128 ఉందని పేర్కొన్నారని విమర్శించారు. రక్తపరీక్షల ఫలితాలనూ తప్పుగా చూపిస్తున్నారని మాణిక్యాలరావు ఆరోపించారు. ప్రభుత్వం నుంచి ఏదైనా స్పష్టమైన హామీ రావాలని, అది వచ్చే వరకు దీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు.  దీక్షను భగ్నం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఏదైనా జరిగితే ప్రజలు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతోసహా బంగాళాఖాతంలో కలిపేస్తారని పేర్కొన్నారు. సీఎం ఆరోగ్యం బాగుండాలంటే నా ఆరోగ్యాన్ని పరిరక్షించాలని అన్నారు.

హేళన తగదు
తన దీక్షను కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి హేళన చేసి మాట్లాడుతున్నారని, సీఎం  చేసిన తప్పుకు తాను ఢిల్లీ వెళ్లి ఎందుకు దీక్ష చేయాలని ప్రశ్నించారు.  నీరసంతో కొంత సేపు వేదికపై మాణిక్యాలరావు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం వైద్యులు డాక్టర్‌ ప్రసాదరావు, పట్టణ సీఐ సుభాష్, రూరల్‌ సీఐ శ్రీనివాసు తదితరుల పర్యవేక్షణలో మాణిక్యాలరావుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
మాణిక్యాలరావుకు సంఘీభావంగా బీజేపీ నాయకులు ఈతకోట తాతాజీ, నరిశే సోమేశ్వరరావు, పేరిచర్ల మురళీకృష్ణంరాజు, అయినం బాలకృష్ణ, పోతుల అన్నవరం, మహిళా నాయకులు కందుల విజయ తదితరులు   వేదికపై కూర్చున్నారు.

మొహరించిన పోలీసులు
మాణిక్యాలరావు దీక్షను భగ్నం చేసేందుకు కొవ్వూరు సబ్‌ డివిజన్‌ పరిధిలోని 60 మంది  పోలీసులు మాణిక్యాలరావు క్యాంపు కార్యాలయం చుట్టూ ఉదయం నుంచే  మోహరించారు.   పట్ణణ, రూరల్‌ సీఐలు, ఎస్సైల ఆధ్వర్యంలో శిబిరం వద్దకు వెళ్లే దారులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. జిల్లావ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తాడేపల్లిగూడెం చేరుకున్నా.. వారిని వారించి మాణిక్యాలరావు దీక్షను మంగళవారం రాత్రి బల వంతంగా భగ్నం చేశారు. అంబులెన్సు సిద్ధం చేసి నా.. అందులో ఎక్కించడం కష్టమై.. పోలీసు వాహనంలో ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

ఇక ప్రజా ఉద్యమమే
మాణిక్యాలరావు దీక్షను భగ్నం చేయడంతో  ప్రజా ఉద్యమం చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.  బుధవారం మున్సిపాలిటీ కేంద్రాలలో ధర్నా, తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామన్నా రు. అలాగే బుధవారం తాడేపల్లిగూడెం పట్టణ బంద్‌కు పిలుపు నిచ్చారు.  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈతకోట తాతాజీ మాట్లాడుతూ బంద్‌కు అందరూ సహకరించాలని కోరారు.  టీడీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నరిశే సోమేశ్వరరావు, కర్రి ప్రభాకర బాలాజీ, యాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top