మాట నిలుపుకోమంటే లాఠీ ఝుళిపింపు | Sakshi
Sakshi News home page

మాట నిలుపుకోమంటే లాఠీ ఝుళిపింపు

Published Sun, Jul 5 2015 2:11 AM

police lover cheating in korumilli

 కోరుమిల్లి (కపిలేశ్వరపురం):ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని నిలదీయడమే ఆ ఆడపడుచుల తప్పైంది. ఆడపడుచులే తన గెలుపు కారకులన్న చంద్రబాబు ఏలుబడిలోనే వారిపై పోలీసు లాఠీ తాండవమాడింది. శనివారం కోరుమిల్లి ఇసుక ర్యాంపు అందుకు వేదికగా మారింది. ర్యాంపుల ఆదాయంలో 25 శాతం డ్వాక్రా మహిళలకు అందజేస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీని హామీ నెరవేర్చాలన్నందుకు అధికార పార్టీ నియోజకవర్గ నాయకులు ప్రణాళిక ప్రకారమే పోలీసులతో దౌర్జన్యం చేయించారని బాధిత మహిళలు ఆరోపించారు.
 
 ర్యాంపుల నిర్వహణను డ్వాక్రా మహిళలకు అప్పగిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఆర్థికంగా ఎదుగుతామని గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు ఆశలు పెట్టుకున్నారు. తీరా శాండ్‌బోర్డు కమిటీ ఎంపిక జరిగిన తీరుతో ర్యాంపు అధికార పార్టీ నాయకుల చేతుల్లోకి ర్యాంపు వెళుతోందని గ్రహించిన మహిళలు ర్యాంపులో కూలీలకు పని కల్పించాలని, డ్వాక్రా సంఘాలకు పావలా వాటా జమ చేయాలని గత నెల 10 నుంచి ర్యాంపు వద్ద ధర్నాకు దిగారు. అప్పటి నుంచీ సీఐటీయూ ఆధ్వర్యంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు సంఘీభావం తెలిపి బాసటగా నిలిచారు.
 
 శనివారం ఉదయం యథావిధిగా మహిళలు ర్యాంపు బాట వద్దకు చేరుకున్నారు. మండపేట సీఐ పుల్లారావు ఆధ్వర్యంలో పోలీసులు గోదారి గట్టుపై ఉన్న జేసీబీని ర్యాంపులోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. మహిళలు అడ్డుకోబోగా పోలీసులు నిలువరించారు. ఎంతకీ మహిళలు వెనక్కి తగ్గకపోవడంతో సీఐటీయూ నాయకురాలు కృష్ణవేణిని మఫ్టీలో ఉన్న పోలీసు దుర్భాషలాడారు. దీంతో మహిళలు పోలీసుల వలయాన్ని ఛేదించుకునే ప్రయత్నం చేయగా లాఠీలతో చెల్లాచెదురు చే శారు. గట్టుపై ఉన్న మహిళలను ఈడ్చుకుంటూ వెళ్లి వాహనాలపై ఎక్కించారు. పలువురు మహిళలు బురదలో కూరుకుపోగా మరి కొందరు పోలీసుల పిడిగుద్దులకు, లాఠీలకు గాయాల పాలయ్యారు. ఓ మహిళ స్పృహ తప్పగా తోటివారు సపర్యలు చేశారు.
 
  సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కృష్ణవేణిలను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనంలో ఎక్కించారు. సుమారు 25 మందిని ఆలమూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. చిన కోరుమిల్లికి చెందిన తోలేటి  చినబేబిని పొట్టలో గుద్ది, మెడవిరిచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. దీంతో ఆమె కపిలేశ్వరపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. అదే ప్రాంతానికి చెందిన గంగుమళ్ల ఆదినారాయణ అనే 75 ఏళ్ల వృద్ధుడి చేతికి గాయమైంది. చీకట్ల పార్వతి, తొట్టెప్పు లక్ష్మి, తొట్టెపు బూరియ్య, ఆకుల లక్ష్మి తదితర 10 మందికి గాయాలయ్యాయి. అనంతరం గ్రామానికి చెందిన మరికొందరు మహిళలు ర్యాంపు వద్దకు చేరుకుని ఆందోళనకు ఉపక్రమించారు. పోలీసులు వారిని పెద్ద వంతెన, ప్రధాన రహదారి వీధుల మీదుగా తరుముకుంటూ వెళ్లారు. దీంతో మహిళలు చేసేది లేక చిన కోరుమిల్లిలో సమావేశమయ్యారు.
 
 కాసుల కోసం ఎంతకైనా దిగజారుతున్నారు
 కాగా వైఎస్సార్ సీపీ నేతలు గ్రామానికి వచ్చి మహిళల ఉద్యమానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.  జక్కంపూడి విజయలక్ష్మిఇసుక ర్యాంపులను గుప్పెట్లో పెట్టుకుని కాసులు సంపాదించేందుకు అధికార పార్టీ నేతలు ఎంతకైనా దిగజారుతున్నారని, అందుకు కోరుమిల్లి ఘటనే ఉదాహరణ అని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను వీధుల్లో పరిగెత్తిస్తుంటే గ్రామ సర్పంచ్ శిఖండిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళలను అదుపు చేసేందుకు అంతమంది పోలీసులు అవసరమా అని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, నియోజకవర్గ ప్రముఖుడు వేగుళ్ల లీలాకృష్ణ పోలీసుల దురాగతాన్ని ఖండించారు. గ్రామస్తులకు తామంతా అండగా ఉంటామన్నారు. దూలం వెంకన్నబాబు, సిరిపురపు శ్రీనివాస్, శీలం గోవిందు, సీహెచ్ సూరిబాబు, నక్కా సింహాచలం, తదితరులు ఉన్నారు.
 
 గ్రామస్తులకు ఎమ్మెల్యే తోట పరామర్శ
 ఇసుక ర్యాంపు వద్ద లాఠీచార్జి ఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు శనివారం రాత్రి కోరుమిల్లి గ్రామస్తులను పరామర్శించారు. గ్రామస్తులపై కేసులు లేకుండా చూస్తానన్నారు. ఇలాంటి సంఘటనల పట్ల సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement