ఉక్కు ఉద్యమంపై విరిగిన లాఠీ

Police lathicharge on student unions - Sakshi

విద్యార్థుల ‘కలెక్టరేట్‌ ముట్టడి’పై పోలీసుల లాఠీచార్జి

విద్యార్థికి తీవ్ర గాయాలు

ఉద్యమానికి మద్దతు తెలిపిన వైఎస్సార్‌సీపీ

సాక్షి కడప/సెవెన్‌రోడ్స్‌ : వైఎస్సార్‌ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ జాప్యానికి నిరసనగా విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం.. పోలీసుల లాఠీచార్జితో ఉద్రిక్తంగా మారింది. ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

అన్ని విద్యార్థి సంఘాల నాయకులు ప్లకార్డులు, జెండాలు పట్టుకుని ర్యాలీగా తరలివచ్చారు. సుమారు అరగంటపాటు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు ఒక్కసారిగా కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, సంఘాల నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో విద్యార్థి సంఘాల నేతలను అదుపు చేయడం కష్టతరంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.

విద్యార్థి నాయకుడికి తీవ్ర గాయాలు
విద్యార్థి నేతలందరినీ అరెస్టు చేసిన పోలీసులు.. విద్యార్థులను ఈడ్చి పడేశారు. లాఠీచార్జిలో వైవీయూకు చెందిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు నాయక్‌ తీవ్రంగా గాయపడ్డాడు. లేవలేని స్థితిలో ఉన్న అతన్ని వెంటనే కడప రిమ్స్‌ తరలించారు. తీవ్రంగా గాయపడి ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసుల లాఠీచార్జిని అధికార బీజేపీ, టీడీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలూ ఖండించాయి.

ఆందోళనలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ
ఉక్కు పరిశ్రమ కోసం కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాల ఆందోళనకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం వైఎస్సార్‌ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా అక్కడే ఉద్యమబాటలో ఉండగా.. కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మేయర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా ఆందోళనలో పాల్గొన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం జరిగే ప్రతి పోరాటానికి వైఎస్సార్‌ సీపీ మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు.

ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్నా ఇప్పటి వరకూ ఏర్పాటు చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, చంద్రబాబు ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రజలను మోసగించారని మండిపడ్డారు. నాలుగేళ్లుగా కేంద్రంతో కలిసి అధికారాన్ని పంచుకున్న టీడీపీ.. నేడు ఉక్కు పరిశ్రమ కోసమంటూ దొంగ ఆందోళనలు చేపడుతోందని ధ్వజమెత్తారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, వైఎస్సార్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నేడు విద్యా సంస్థల బంద్‌
ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులపై లాఠీచార్జిని నిరసిస్తూ శనివారం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌ పాటించాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top