పోలీసుల చేతికి ‘మావోల ఆపరేషన్‌’ కీలక వీడియో!

 Police get Maoist operation video at araku - Sakshi

మన్యంలో డీజీపీ పర్యటనపై మల్లగుల్లాలు

సాక్షి, అమరావతి : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హత్య చేసిన మన్యంలో డీజీపీ పర్యటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే మావోల ముప్పు పొంచి ఉంటుందనే ఆందోళనలో పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ పర్యటనకు ఇంకా గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదని చెబుతున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన గ్రేహౌండ్స్‌తోపాటు నిఘా వర్గాలు మావోల కదలికలపై అంచనా వేస్తున్నట్టు సమాచారం. మావోయిస్టులకు సంబంధించిన తాజా సమాచారం సేకరించిన అనంతరం బుధవారం ఉదయం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి డీజీపీ మన్యం పర్యటనపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలో మావోయిస్టులు నిర్వహించిన ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో పోలీసులకు చిక్కినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ముందస్తు జాగ్రత్తగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గన్‌మెన్, డ్రైవర్, పార్టీ నాయకుల నుంచి సెల్‌ఫోన్‌ను మావోయిస్టులు ముందే తీసుకుని, వారిని దూరంగా ఉండాలంటూ గన్‌లతో కాపలా ఉన్నారు. అయితే ఘటన జరిగిన ప్రాంతంలో రోడ్డుపై బైక్‌పై వెళుతున్న వారిని మావోయిస్టులు అడ్డగించినట్టు చెబుతున్నారు. వారిలో ఒకరు మావోయిస్టుల కన్నుగప్పి సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించినట్టు తెలిసింది. అందులో మావోయిస్టులు దారి అడ్డగించడం, ఘటన తర్వాత పారిపోతున్న క్లిప్పింగ్‌ను పోలీసులు వ్యూహాత్మకంగానే మంగళవారం విడుదల చేసినట్టు తెలిసింది. ఇంకా కీలక ఆధారాలతో ఉన్న వీడియో పోలీసుల వద్ద ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేని పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చి చంపిన మావోయిస్టుల్లో కొందరిని వీడియో ద్వారా గుర్తించే ప్రయత్నం జరుగుతోంది.

స్తంభించిన మన్యం.. స్వచ్ఛందంగా బంద్‌
అరకు/పాడేరు: అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్‌ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమ హత్యకాండకు నిరసనగా సోమవారం మన్యంలో స్వచ్ఛందంగా బంద్‌ జరిగింది. అరకు పట్టణంలోని దుకాణాలు, షాపులు మూతపడ్డాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. బంద్‌ వల్ల అరకు పర్యాటక కేంద్రం బోసిపోయింది. పలు రాష్ట్రాలతోపాటు ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు స్థానికంగా రిజర్వ్‌ చేసుకున్న అతిథి గృహాలు, ప్రైవేట్‌ రిసార్ట్స్, టూరిజం, పలు లాడ్జీల గదులన్నింటినీ ఆన్‌లైన్‌లోనే రద్దు చేసుకున్నారు. దీంతో మూడ్రోజుల నుంచి అరకులోయ ప్రాంతంలోని అతిథి గృహాలన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఉన్న పర్యాటకులు కూడా భయంతో గదుల నుంచి బయటకు రాలేదు. పాడేరులో కిడారి, సోమకు ఐటీడీఏ అధికారులు, సిబ్బంది మంగళవారం సంతాపాన్ని తెలియజేశారు.
 
అరకు అంటే బెరుకు!
విశాఖపట్నం : అరకు ఈ పేరు వింటేనే పర్యాటకులు అక్కడి అందాలు చూడడానికి పరుగులు పెడతారు. ప్రకృతి సోయగాలు, అందాల లోయలు, మంచుకమ్మిన పర్వతాలు, మెలికలు తిరుగుతూ కనిపించే రహదారులు, జలజల జాలువారే జలపాతాలు.. ఇలా ఒకటేమిటి? ఎన్నో సౌందర్యాల సమాహారం విశాఖ మన్యం! అలాంటి రమణీయతలో అలరారే ఏజెన్సీ ఇప్పుడు పర్యాటక ప్రియులను భయపెడుతోంది. మూడు రోజుల క్రితం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపడంతో మన్యం వణుకుతోంది. ఇప్పుడు ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మావోయిస్టుల కోసం భారీ సంఖ్యలో పోలీసులు కూంబిగ్‌ చేపట్టారు. సాయుధ భద్రతా దళాలు అడవుల్లోనూ, మారుమూల పల్లెలు, గూడేల్లోనూ అణువణువునా జల్లెడ పడుతున్నాయి. ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో పర్యాటకులు విశాఖ ఏజెన్సీకి వెళ్లడానికి సాహసించలేక పోతున్నారు.

అరకులోని పద్మావతి గార్డెన్స్, డుంబ్రిగుడ మండలం చాపరాయి, అనంతగిరి మండలం బొర్రా గుహలు, టైడా, ఇంకా పలు జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అటు వైపు పర్యాటకులెవరూ తొంగి చూడడం లేదు. నిత్యం వేలాది మందితో కిక్కిరిసే బొర్రా గుహలు బోసిపోతూ కనిపిస్తున్నాయి. విశాఖ నుంచి పర్యాటకశాఖ నడిపే టూర్‌ ప్యాకేజీ బస్సులను కూడా సోమ, మంగళవారాలు రద్దు చేసింది. మరోవైపు అరకు పరిధిలో ఉన్న 180 పర్యాటకశాఖ గదులు ఆక్యుపెన్సీ 40 శాతం కంటే తక్కువకు పడిపోయింది. ఇక అనంతగిరిలోని పర్యాటక గదుల పరిస్థితి కూడా అదే. పక్షుల కిలకిలరావాలతో అలరించే టైడా జంగిల్‌బెల్స్‌ కూడా జనంలేక వెలవెలబోతోంది. విశాఖ మన్యంలో సామాన్య పరిస్థితులు నెలకొనడానికి మరికొన్నాళ్లు పట్టే అవకాశం ఉంది. ప్రయోగాత్మకంగా బుధవారం నుంచి పర్యాటక ప్యాకేజీ బస్సులను నడపనున్నట్టు పర్యాటకాభివృద్ధి సంస్థ డివిజనల్‌ మేనేజర్‌ ప్రసాదరెడ్డి మంగళవారం రాత్రి సాక్షి’కి చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top