కర్రెగుట్టల్లో కాల్పులు..! | Fire exchange in Karreguttalu | Sakshi
Sakshi News home page

పోలీసులు – నక్సల్స్ మధ్య భీకర పోరు

Oct 31 2025 12:56 PM | Updated on Oct 31 2025 1:17 PM

Fire exchange in Karreguttalu

రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో మరోమారు తుపాకీ గర్జించింది. 288 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉండే ఈ గుట్టలు తెలంగాణ ప్రాంతంలో 90 కిలోమీటర్ల పొడవునా ఉన్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఇక్కడ భద్రత బలగాలు తొలుత ‘బచావో కర్రెగుట్టలు’.. ఆ తర్వాత ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’ పేరుతో నక్సల్స్ ఏరివేతకు 24 వేల మంది పోలీసులను మోహరించాయి. డ్రోన్లతో గుట్టలను జల్లెడ పట్టాయి. అయితే.. ఆరుగురు పీఎల్‌జీ సభ్యుల(వీరిలో ముగ్గురు మహిళలు) ఎన్‌కౌంటర్ మినహా.. పెద్దగా పురోగతిని సాధించలేకపోయాయి. 

ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి..
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఛత్తీస్‌గఢ్‌లోని కేంద్ర బలగాలు దేశ సరిహద్దులకు వెళ్లాయి. దీంతో.. ఉన్నఫళంగా ఆపరేషన్ కర్రెగుట్టలకు బ్రేక్ పడింది. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ బలగాలు సైతం అబూజ్‌మఢ్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేశాయి. కర్రెగుట్టల్లో 30కి పైగా భారీ కొండలు ఉండగా.. అప్పట్లో భద్రతాబలగాలు నీలం కొండ(సరాయ్‌), దోబే కొండలు, ఆలుబాకల్లో మూడు బేస్‌ క్యాంపులను ఏర్పాటు చేశాయి. వెయ్యి మంది మావోయిస్టులు తలదాచుకున్న ఓ కలుగును గుర్తించాయి. అంతకు మించితే.. పెద్దగా పురోగతి సాధించింది లేదు.

శుక్రవారం ఉదయం భద్రతాబలగాల బేస్ క్యాంపులపై మావోయిస్టులు మెరుపు దాడులు చేసినట్లు సమాచారం. ‘‘కేంద్ర బలగాలు కొత్త క్యాంపును ఏర్పాటు చేసే క్రమంలో కర్రెగుట్టల్లోకి వెళ్లాయి. ఆ సమయంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. దానికి ప్రతిగా భద్రతాబలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. సుమారు గంట పాటు కాల్పులు కొనసాగాయి. ఇరువైపులా ప్రాణనష్టం జరిగిన దాఖలాలు కనిపించడం లేదు’’ అని ఓ అధికారి ‘సాక్షి డిజిటల్‌’కు వివరించారు. 

ఇంకా 400 మంది మావోయిస్టులు? 
తాజా ఘటనతో కర్రెగుట్టల్లో ఇంకా 400 మంది దాకా మావోయిస్టులు తలదాచుకుని ఉంటారని కేంద్ర బలగాలు భావిస్తున్నాయి. గతంలో జరిగిన ఎన్‌కౌంటర్ల సందర్భంలోనూ పీఎల్‌జీ దళ కమాండర్లు మృతిచెందారని, ఇప్పుడు కూడా హిడ్మా నేతృత్వంలోని పీఎల్‌జీ ఒకటో బెటాలియన్ దళానికి చెందిన మావోయిస్టులు కర్రెగుట్టల్లోని కొండల్లో తలదాచుకుని ఉంటారని అభిప్రాయపడుతున్నాయి. తాజా ఘటనతో పోలీసులు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. అయితే.. మోంథా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో కర్రెగుట్టల్లో నడక కష్టంగా మారిందని, బురద, ఊబులతో ప్రమాదం పొంచి ఉందని బలగాలు భావిస్తున్నాయి. కూంబింగ్ మార్గాల్లో విష సర్పాలు కనిపిస్తున్నట్లు చెబుతున్నాయి. దాంతో.. డ్రోన్ల సాయంతో కూంబింగ్‌కు సన్నాహాలు చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement