ఆధారం లేకుంటే అంతే మరి! | Sakshi
Sakshi News home page

ఆధారం లేకుంటే అంతే మరి!

Published Sat, Mar 16 2019 12:28 PM

police department keep surveillance on moving election funds - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : సార్వత్రిక ఎన్నికలకు నగరా మోగిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో డబ్బే కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులతోపాటు పోలీసులు గట్టి నిఘా పెట్టారు. భారీగా నగదు చేతులు మారే అవకాశం ఉన్నందున నగదు తరలింపును అడ్డుకోవడంపై అధికార యంత్రాంగం పూ ర్తిగా దృష్టి సారించింది. నియోజకవర్గాల వారీగా తనిఖీలు ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చే సింది.

పోలీసులతోపాటు రెవెన్యూ అధికారులు విస్తృతంగా తనీఖీలు చేపడుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. జిల్లాల్లో ఇప్పటికే కొంత నగదుతోపాటు బంగారం, గంజాయి, మద్యం తరలింపులను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు కూడా ఇబ్బందులు ఎదువరయ్యే అవకాశాలే లేకపోలేదు. 

ఆధారాలు తప్పనిసరి...
ఎన్నికల సంఘం సామాన్యులకు కొంత వెసులుబాటు ఇచ్చింది. వివిధ అవసరాల కోసం ఒక వ్యక్తి రూ.50వేల వరకు తన వెంట తీసుకెళ్లవచ్చు. దీనికి ఎలాంటి ఆధారాలు అక్కర్లేదు. అయితే రూ.50వేల కంటే ఎక్కువ నగదు తరలించే సమయంలో మాత్రం కచ్చితంగా సంబంధిత ఆధారాలను తనిఖీలు జరిపే అధికారులకు చూపించాల్సి ఉంటుంది. లేకుంటే అవస్థలు తప్పవు. తనిఖీల సందర్భంలో సదరు వ్యక్తులు వాగ్వాదానికి దిగినా, అనుచితంగా ప్రవర్తించినా అవన్నీ సీసీ కెమెరాలు, అప్పటికీ పోలీసులు బాడీకి అమర్చకున్న బాడీ కెమెరాల్లో రికార్డు అవుతాయి. అయితే సరైన ఆధారాలు చూపిస్తే డబ్బుకు ఎలాంటి ఢోకా ఉండదు. ఆధారాలు లేకపోతేనే ఇబ్బంది.

 సీజ్‌ చేస్తే మాత్రం తిప్పలు తప్పవు..
నగదు పట్టుబడిన సమయంలో తగిన ఆధారాలు చూపకపోతే ఆ వ్యక్తులకు తిప్పలు తప్పవు. సదరు వ్యక్తులు ఏ అవసరం కోసం ఎక్కడి నుంచి ఎక్కడికి నగదు తరలిస్తున్నారో విషయాలు ఆధారాలతో సహా వివరించాలి. తగు ఆధారాలను చూపించాలి. ఆధారాలు సంతృప్తికరంగా ఉంటే చెక్‌పోస్టుల వద్దే వదిలేస్తారు. లేదంటే డబ్బుతోసహా సంబంధిత వ్యక్తిని తహసీల్దార్‌ వద్ద హాజరుపరుస్తారు. పోలీసులు సీజ్‌ చేసిన నగదును తొలుత ట్రెజ రీలో డిపాజిట్‌ చేసి, ఐటీ అధికారులకు సంబంధిత ఫైల్‌ను అప్పగిస్తారు.

వారు మ రోసారి ఆధారాలు ఆడుగుతారు. వారికి గాని సక్రమమైన ఆధారాలు చూపకపోతే వారు తిరిగి ఆ ఫైల్‌ను పోలీసులకు పంపుతారు. ఐటీ అధికారుల క్లియరెన్స్‌ సరి. లేదంటే మాత్రం పోలీసులు కేసు ఫైల్‌ చేసి, చార్జిషీట్‌ నమోదుచేస్తారు. కాగా పన్ను కింద ముప్పై శాతం చెల్లించుకుని మిగిలిన మొత్తాన్ని కొన్ని కేసుల్లో తిరిగి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 

నేతల వాహనాల కదలికలపై నిఘా..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల, రాజకీయ పార్టీల నాయకుల కదలికలపై పోలీసు శాఖ డేగ కన్ను వేయనుంది. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల తరఫున క్రియాశీలకంగా వ్యవహరించే నాయకులు, వారి వాహనాలపై గట్టి నిఘా వేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలు ముగిసేవరకు పోలీసులకు సెలవులు ఇవ్వరాదని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, మఫ్టీ అవతారంలో జిల్లాలోని పలు చోట్ల గట్టి నిఘా పెట్టినట్లు భోగట్టా.  

Advertisement
Advertisement