
సాక్షి, గంగవరం: సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహంగా బయల్దేరిన వ్యక్తి తన కోరిక తీరకనే రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. ఈ విషాద సంఘటన బుధవారం మండలంలో పలమనేరు–చిత్తూరు బైపాస్ రహదారిలోని నడింపల్లె వద్ద చోటు చేసుకుంది. వివరాలు..తవణంపల్లె మండలం వెంగంపల్లె గ్రామానికి చెందిన గోవిందయ్య కుమారుడు మురళి(40) కొంత కాలంగా బెంగళూరులో కూలి పని చేస్తున్నాడు.
ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బెంగళూరు నుంచి స్వగ్రామానికి మోటార్ సైకిల్‌లో బయల్దేరాడు. మార్గమధ్యంలో నడింపల్లె బైపాస్ ఫ్లైఓవర్‌పై వెళ్తుండగా తమిళనాడు వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ ఓవర్‌టేక్ చేస్తూ మురళి బైక్‌ను వెనుక వైపు ఢీకొంది. కింద పడిన అతని తల మీదుగా లారీ వెనుక చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు. మురళి మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.