తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం | A permanent solution to the problem of drinking water | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

Apr 13 2020 2:46 AM | Updated on Apr 13 2020 4:46 AM

A permanent solution to the problem of drinking water - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాగునీటి కష్టాలను శాశ్వతంగా తొలగించేలా వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని హైబ్రిడ్‌ యాన్యుటీ పద్ధ్దతిలో చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. 
► హైబ్రిడ్‌ యాన్యుటీ పద్ధ్దతి అంటే.. కాంట్రాక్టరుకు నిర్మాణ వ్యయంలో నామమాత్రం మొత్తాన్ని ఇప్పుడు చెల్లించి మిగిలింది సాధారణ బ్యాంకు వడ్డీతోగానీ అంతకంటే తక్కువ వడ్డీరేటుతో లెక్కకట్టి 10–12 ఏళ్ల పాటు చెల్లించడం. 
► రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడంతోపాటు పారిశ్రామిక అవసరాలకు కూడా అవసరమైన నీటిని అందించేందుకు వీలుగా భారీ వాటర్‌ గ్రిడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. 
► కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల అధిక వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఈ వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని ప్రభుత్వం తలపెట్టింది. అంతేకాక, ఫ్లోరైడ్‌ వంటి సమస్యను పరిష్కరించడంతోపాటు తీర ప్రాంతాల్లోని భూగర్భ జలాలు ఉప్పునీరు కాకుండా కాపాడినట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు.  

తొలుత ఆరు జిల్లాల్లో..
రోజూ ఒక మనిషికి పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో వంద లీటర్లు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో 150 లీటర్ల నీటిని అందించేలా ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం మేర కాంట్రాక్టర్లకు పనులు చేపట్టే సమయంలో, మిగిలిన 70 శాతం నిధులను 12 ఏళ్ల పాటు విడతల వారీగా చెల్లించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా తీవ్ర మంచినీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాలతో కలిపి మొత్తం ఆరు జిల్లాల్లో ప్రాజెక్టు పనులను చేపట్టనున్నారు.
 
ఏటా 90 టీఎంసీలు అవసరం
– వాటర్‌ గ్రిడ్‌లో భాగంగా ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. మొత్తం 30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతోపాటు ఎలాంటి మార్పులు లేకుండా వినియోగించుకునేలా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ ఏడాది పొడవునా నీటి సరఫరాకు 90 టీఎంసీల నీరు అవసరం కాగా నీటి వనరుల కోసం 52 రిజర్వాయర్లను గుర్తించారు.

రూ.12,308 కోట్లతో తొలిదశ
– శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో సురక్షిత నీరు లేకపోవడంవల్ల కిడ్నీ వ్యాధులు అత్యధికంగా నమోదవుతున్నాయన్న అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రాంతంలో వాటర్‌ గ్రిడ్‌ ద్వారా మంచినీటిని అందించనున్నారు. 
– జీవనది గోదావరి చెంతనే ప్రవహిస్తున్నా.. ఆక్వా సాగుతో సముద్రతీర ప్రాంతాల భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. దీంతో మంచినీటి కోసం తపిస్తున్న ఉభయగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలను కూడా వాటర్‌ గ్రిడ్‌ ద్వారా ఆదుకోనున్నారు. 
– ఇక.. ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతం, వైఎస్సార్‌ కడప జిల్లాలోని పులివెందుల ప్రాంతాల్లో ప్రతి ఏటా వందలాది గ్రామాల్లో మంచినీరు దొరకని పరిస్థితి. దీంతో ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తోంది. దీనికి శాశ్వతంగా చెక్‌ పెట్టాలని సర్కారు భావిస్తోంది.
– అలాగే, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో సున్నపు రాయి నిక్షేపాలు, ఫ్లోరైడ్‌ కారణంగా ఎన్నో ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న తాగునీటి కష్టాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. 
ఈ నేపథ్యంలో.. మంచినీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కరించేందుకు తొలి విడతలో ఈ ప్రాంతాలను వాటర్‌ గ్రిడ్‌లో ఎంపిక చేశారు. తొలి విడత పనులకు రూ.12,308 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

ఉద్దానంలో 100 శాతం ప్రభుత్వ నిధులతో..
– రాష్ట్రమంతటా వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టును హైబ్రీడ్‌ యాన్యుటీ విధానంలో చేపట్టాలని నిర్ణయించినా ఉద్దానం ప్రాంతంలో సురక్షిత నీరు అందుబాటులో లేక పెద్దఎత్తున నమోదవుతున్న కిడ్నీ జబ్బులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మాత్రం వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించినట్లు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులు తెలిపారు. 

మొదలైన టెండర్ల ప్రక్రియ 
తొలి విడత వాటర్‌గ్రిడ్‌ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా అధికారులు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను ప్రాథమికంగా మొదలు పెట్టారు. తొలి విడతలో ఆరు జిల్లాలో ఆరు ప్యాకేజీల వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులను హైబ్రీడ్‌ యాన్యుటీ విధానంలో చేపట్టడంపై ఆంధ్రప్రదేశ్‌ తాగునీటి సరఫరా కార్పొరేషన్‌ అధికారులు ఈఓఐ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్టŠట్‌) నోటిఫికేషన్‌ జారీచేశారు. కాంట్రాక్టర్లు తమ ఆసక్తిని తెలియజేసేందుకు ఏప్రిల్‌ 22వ తేదీ వరకు గడువు ఉంది.
 
16లోగా జ్యుడీషియల్‌ ప్రివ్యూకు వివరాలు
వాటర్‌ గ్రిడ్‌ పనులకు టెండర్లు నిర్వహించేందుకు తొలుత జ్యుడీషియల్‌ ప్రివ్యూకు ఈనెల 16లోగా వివరాలు పంపాలని నిర్ణయించారు. జ్యుడీషియల్‌ ప్రివ్యూ నుంచి అనుమతి రాగానే జూన్‌ మొదటి వారం కల్లా టెండర్లు నిర్వహించి ఆ తర్వాత పనులను ప్రారంభించేందుకు ఏపీ తాగునీటి సరఫరా కార్పొరేషన్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement