‘పింఛన్’ మాయ | 'Pension' Maya | Sakshi
Sakshi News home page

‘పింఛన్’ మాయ

Jun 11 2014 3:24 AM | Updated on Aug 10 2018 8:08 PM

‘పింఛన్’ మాయ - Sakshi

‘పింఛన్’ మాయ

చంద్రబాబు అధికారంలోకి రావడంతో తమకు వస్తున్న పింఛన్ మొత్తం భారీగా పెరుగుతుందని ఆశించిన లబ్ధిదారులకు నిరాశే మిగిలింది.

అక్టోబర్ నుంచి పింఛన్ల పెంపు అంటూ మెలిక
లబ్ధిదారులఆశలపై నీళ్లు
చంద్రబాబు తీరుతో సర్వత్రా తీవ్ర నిరసన
 

చంద్రబాబు అధికారంలోకి రావడంతో తమకు వస్తున్న పింఛన్ మొత్తం భారీగా పెరుగుతుందని  ఆశించిన లబ్ధిదారులకు నిరాశే మిగిలింది. పింఛన్లను పెంచుతూ ఆయన రెండో సంతకం చేసినప్పటికీ అక్టోబర్ నుంచి అమలు చేస్తామని మెలిక పెట్టారు. ఇప్పటికే రుణమాఫీపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో పింఛన్ల పెంపు హామీ ఐదు నెలల తర్వాతైనా అమలు చేస్తారా..అని వికలాంగులు, వృద్ధులు, వితంతువులతో పాటు చేనేత, కల్లుగీత కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
 
ఉదయగిరి: టీడీపీ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతవులు పింఛన్‌ను రూ.200 నుంచి వెయ్యి రూపాయలకు, వికలాంగుల పింఛన్‌ను రూ.500 నుంచి రూ.1,500కు పెంచుతానని చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల్లో విజయం ఆయననే వరించడంతో ఇక తమ పింఛన్ భారీగా పెరుగుతుందని లబ్ధిదారులు ఆశించారు. చంద్రబాబు మాత్రం తన నైజాన్ని చాటుకుంటూ ఐదు నెలల తర్వాత అనే మెలిక పెట్టారు. జిల్లాలో మొత్తం 2,62,023 మంది సామాజిక పింఛన్లు తీసుకుంటున్నారు. వీరిలో వృద్ధులు 1,24,670 మంది, వితంతువులు 90 వేల మంది, వికలాంగులు 31 వేల మంది ఉన్నారు. అభయహస్తం, చేనేత, కల్లుగీత కార్మిక పింఛన్‌ను 14 వేల మందికి పైగా అందుకుంటున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో నెలకు రూ.75 పింఛన్ ఇచ్చే వారు. అది కూడా గ్రామంలో కొద్దిమందికి మాత్రమే. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులు, వితంతవుల పింఛన్‌ను రూ.200కు, వికలాంగుల పింఛన్‌ను  రూ.500కి పెంచారు. అభాగ్యులకు ఇది పెద్ద ఆసరాగా నిలిచింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.700, వికలాంగులకు రూ.వెయ్యి ఇస్తానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు మాత్రం తాను రూ.వెయ్యి, రూ.1,500 ఇస్తానని హామీ ఇచ్చారు.

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పింఛన్ల పెంపునకు సంబంధించి రెండో సంతకం చేస్తానని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. బాబు అధికారంలోకి రావడంతో పింఛన్ పెరుగుతుందని లబ్ధిదారులు ఆశించారు. ఆయన మాత్రం రెండో సంతకం చేసినప్పటికీ అమలు మాత్రం ఐదు నెలల తర్వాత అని ప్రకటించి వారి ఆశలపై నీళ్లు చల్లారు. తొలి సంతకంతోనే రైతుల రుణమాఫీ చేస్తానని ప్రకటించిన ఆయన కమిటీలు, నివేదికల పేరుతో మభ్యపెడుతున్నారు. ఈ క్రమంలో పెంచిన పింఛన్ మొత్తాన్ని ఐదు నెలల తర్వాతైనా ఇస్తారా..లేక అప్పుడు కూడా మళ్లీ కమిటీల పేరుతో కాలయాపన చేస్తారా..అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement