పొట్టి రవిపై పీడీ యాక్టు

PD Act On SV Ravindra Reddy Doing Illegal Activities In Tadipatri - Sakshi

జేసీ కోటలో ఆయనో అరాచకశక్తి. పెద్దాయన (మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి) అండ.. చిన్నాయన (మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి) సపోర్టు చూసుకొని పాతికేళ్లుగా తాడిపత్రిలో ఆయన చెప్పిందే వేదం. ఏకంగా తాడిపత్రికి ‘చిన్నబాస్‌’గా ఎదిగాడు. రూ.కోట్లకు పడగెత్తాడు. ఆయన ఎవరో కాదు.. టీడీపీ నాయకుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి. నియోజకవర్గంలో పొట్టిరవిగా చలామణి అవుతూ సెటిల్మెంట్స్‌ కింగ్‌గా పేరుగడించాడు. పాతికేళ్లుగా అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ అతడ్ని ‘టచ్‌’ చేయడానికే పోలీసులు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి. సమాజ భద్రతకు, ప్రశాంతతకు భంగం కలిగిస్తున్న పొట్టిరవిపై తాజాగా పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించడం జిల్లాలో సంచలనం కలిగిస్తోంది. 

సాక్షి, అనంతపురం : తాడిపత్రి మండలం దిగువపల్లికి చెందిన ఉపాధ్యాయుడు సంగటి వీరారెడ్డి కుమారుడు సంగటి రవీంద్రారెడ్డి. 2003లో జేసీ సోదరుల పంచన చేరాడు. అప్పటి నుంచి జేసీ సోదరుల నమ్మకాన్ని చూరగొన్న రవీంద్రారెడ్డి క్రమక్రమంగా వారికి నమ్మినబంటుగా మారాడు. అప్పటి నుంచి జేసీ సోదరులను అడ్డుపెట్టుకుని చేయని దందా అంటూ లేదు. తాడిపత్రిలో మీడియాను తన గుప్పిటో పెట్టుకుని హవా నడిపించాడు. స్వయంగా ఓ మీడియాను స్థాపించడమే కాకుండా మిగతా పత్రికల్లో తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే దాడులు చేయించడంతో పాటు తన సొంత మీడియాలో అసభ్యకరంగా రాతలు రాయించడం లాంటి బ్లాక్‌మెయిల్‌ కార్యకలాపాలకు పాల్పడేవాడు.

దీంతో పాతికేళ్లుగా తాడిపత్రిలో చీకటిరాజ్యం బాహ్య ప్రపంచానికి తెలియకుండా పోయింది. పెద్ద, చిన్న బాస్‌లతో పాటు పొట్టిరవి పేరు చొప్పుకొని అనేక మంది తాడిపత్రిలో పేకాట, మట్కా డాన్‌లుగా ఎదిగారు. గతేడాది పక్కా సమాచారంతో తాడిపత్రిలో ఓ ఇంటిపై కడప సీఐ హమీద్‌ఖాన్‌ దాడిచేసి నిందితులను పట్టుకునేందుకు యత్నించాడు. పోలీసులనే తిప్పికొట్టే పనిలో భాగంగా సీఐ హమీద్‌ఖాన్‌తో పాటు మరో కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో పాటు పోలీసులు వచ్చిన వాహనాన్ని తగలబెట్టించారు. తాడిపత్రిలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల విషయం స్థానిక పోలీసులకు తెలిసినప్పటికీ వారి జోలికెళ్లే సాహసం చేయలేకపోయారు. ప్రబోధానంద కేసులో ఏకంగా పోలీసుస్టేషన్‌పైకే దాడికి యత్నించిన ఘటనలో పొట్టి రవి కీలకంగా వ్యవహరించాడు.  

సహకార ఉద్యోగి హత్య కుట్ర భగ్నం 
తాడిపత్రిలో ఇటీవల సహకార సొసైటీ ఉద్యోగి హత్యకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆశ్చర్యకర విషయం తెలిసింది. హత్యకు యత్నించే ముందు దుండగులు ఎస్వీ రవీంద్రారెడ్డితో ఫోన్లో సంభాషించారు. తర్వాత తప్పించుకున్న విషయం కూడా తెలియపరిచినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఈ కేసులో పొట్టి రవి కూడా నిందితుడని తేలింది. దీంతో ఇటీవల ఆయన్ను అరెస్ట్‌ చేశారు. ఇలాంటి ఉదంతాలు అనేకం ఉన్నట్లు పోలీసువర్గాలు వెల్లడిస్తున్నాయి.  

ఎస్వీ రవీంద్రారెడ్డిపై పీడీ యాక్టు 
తాడిపత్రిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న రవీంద్రారెడ్డి అలియాస్‌ పొట్టి రవిపై పీడీ యాక్టు ప్రయోగించినట్లు పోలీసులు ప్రకటించారు. హత్యాయత్నం, దొమ్మి, మారణాయుధాలు కలిగి ఉండటం తదితర 11 కేసుల్లో ఎస్వీ రవీంద్రారెడ్డి నిందితుడుగా ఉన్నాడు. ఇతని నుంచి సమాజ ప్రశాంతతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పీడీ యాక్టుపై కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. 

రవీంద్రారెడ్డిపై నమోదైన కేసుల్లో కొన్ని.. 

  • 2003లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్న ఘటన(క్రైం నెంబర్‌155/03,332,160 ఐసిఎస్‌). 
  • 2004లో ( క్రైం నెంబర్‌ 43/04,147, 148,324,332,435,27 ) ఆయుధ చట్టం కింద కేసు. 
  • 2015లో అల్ట్రాటెక్‌ సిమెంటు పరిశ్రమలో సామగ్రిని ధ్వంసం చేసిన కేసులో హెడ్‌కానిస్టేబుల్‌ వన్నూర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు(క్రైం నెంబర్‌ 246/15) రూరల్‌ పీఎస్‌లో కేసు.  
  • 2017లో తాడిపత్రి మండలం పెద్దపొలమడ గ్రామ సమీపంలో శ్రీ ప్రభోదాశ్రమానికి చెందిన ఓ ట్యాంకర్‌ను దగ్ధం చేసిన కేసులో ఎస్వీ రవీంద్రారెడ్డి నిందితుడు. శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు రూరల్‌  పోలీస్‌స్టేషన్‌లో (క్రైంనెంబర్‌292/17) కేసు నమోదు. 
  • 2018లో వినాయక చవితి నిమజ్జనోత్సవం సందర్భొంగా చెలరేగిన ఘర్షణల్లో వద్దిపాటి దేవేంద్ర ఫిర్యాదు మేరకు (క్రైం నెంబర్‌ 210/18) కేసు. ఈ ఘటనలో ఎస్వీ రవీంద్రారెడ్డిపై నాలుగు కేసులు నమోదు చేశారు.(క్రైం నెంబర్‌ 210, 211, 212, 227) 
  • 2019లో వీరాపురం గ్రామానికి చెందిన అనీల్‌కుమార్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు(క్రైం నెంబర్‌ 182/19). 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top