ఆర్థిక మంత్రి ఇలాకాలో వైద్యం కోసం వెతలే..

Pathakottam Village Has No Government Hospital - Sakshi

కలగా మిగిలిన ఎన్నికల హామీలు

అభివృద్ధి చెందని కోటనందూరు పీహెచ్‌సీ

అత్యవసర పరిస్థితిలో ప్రజలు అవస్థలు

సాక్షి, కోటనందూరు (తూర్పు గోదావరి): పాలకుల మోసపూరిత హామీలతో ప్రజల కష్టాలు తీరడంలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ఎంతో ఆశపడి ప్రజలు ఓట్లు వేస్తే తీరా గద్దెనెక్కాక పాలకులు వంచిస్తున్నారు. ప్రజలకు కనీస అవసరమైన వైద్య సదుపాయాల కల్పనలో కోటనందూరు మండలంలో గత 30 ఏళ్లుగా పాలకులు అనుసరిస్తున్న తీరు ఇదే. టీడీపీ నేతలు 2003లో మళ్లీ ఏదిఏమైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆలోచనతో పాతకొట్టాంలో 10 పడకల ఆసుపత్రి, కోటనందూరు పీహెచ్‌సీని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధికి హడావుడిగా శిలాఫలకాలు వేశారు.

దురదృష్టం వెంటాడి అధికారం దక్కకపోవడంతో ఆ నిర్మాణం జరగలేదు. వేసిన శిలాఫలకాలు నేటికీ ప్రజలను వెక్కిరిస్తున్నాయి. మరలా  2014వ సంవత్సరంలో  ఎన్నికల ముందు అవే శిలాఫలకాల పనులను పూర్తి చేసి చూపిస్తామంటూ ఊదరకొట్టారు. అయితే ఐదేళ్లు గడచినా ఆ నాడు ఇచ్చిన ఏ హామీలు నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం వేసిన శిలాఫలకాలు ఇప్పటికీ ప్రజలను వెక్కిరిస్తున్నాయి. పాలకుల నిర్వాకంతో ఈ రోజుకీ ప్రభుత్వ వైద్యం కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికమంత్రి ఇలాకాలో ఉన్న ఈ దుస్థితిపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తంమవుతోంది.

గత 50 ఏళ్లుగా కోటనందూరు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం స్థాయి పెరగలేదు. 1964లో 6 పడకల ఆసుపత్రిగా ఏర్పడిన ఈ పీహెచ్‌సీ నేటికీ అదే స్థాయిలో కొనసాగుతోంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఈ ఆసుపత్రిలో కనీస వసతులైన మరుగుదొడ్డి, మంచినీరు, కూర్చోడానికి బల్లలు లేని పరిస్థితి ఉంది. అవసరం మేర వైద్య సిబ్బంది లేక రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. జిల్లాలో ప్రసవాల్లో మొదటి స్థానంలో ఉందని చెప్పుకునే ఈ ఆసుపత్రి ఆపరేషన్‌ థియేటర్‌లో నీటి సదుపాయం లేని దయనీయ పరిస్థితులు ఉన్నాయి.

సుమారు లక్ష మందికి వైద్య సేవలు అందించాల్సిన ఈ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని 2014లో  టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. ఐదేళ్లు గడిచినా ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. సరైన వసతులు, సౌకర్యాలు లేకపోవడంతో ఒకప్పుడు 500 ఉండే ఓపీ నేడు 100కు పడిపోయింది. 24 గంటలూ అందాల్సిన వైద్య సేవలు కొన్ని గం టలకు మాత్రమే పరిమితమయ్యాయి. 50 ఏళ్లగా ప్రభుత్వ వైద్య సేవల్లో ఎటువంటి మార్పు రాలేదు. ఉన్న పరిస్థితులు కూడా టీడీపీ హయాంలో దిగజారిపోయాయి. సగటు పేదవాడు ఏదైన వైద్యం చేయిం చుకోవాలంటే ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

వెక్కిరిస్తున్న శిలాఫలకం
మండలంలో పాతకొట్టాం గ్రామంలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రంపై ఎల్డీపేట, కొత్తకొట్టాం, పాతకొట్టాం, కేఒ అగ్రహారం, కేఎస్‌ కొత్తూరు, తిమ్మరాజుపేట, కేఈ చిన్నయ్యపాలెంతో పాటు విశాఖ జిల్లాలోని మరికొన్ని గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందుతాయి. ఈ గ్రామాలన్నింటికీ  పాతకొట్టాం కేంద్రంగా ఉండడంతో ఇక్కడ 10 పడకల ఆసుపత్రిని నిర్మించాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ ఆసుపత్రి లేని కారణంగా  సుమారు 40 వేల మందికి ప్రభుత్వ వైద్యం అందని పరిస్థితి నెలకొంది. వైద్యం అవసరమైనప్పుడు ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని ఈ ప్రాంతవాసులు చెబుతున్నారు. ప్రస్తుతం అరకొర వసతులున్న శిథిల భవనంలో ఆరోగ్య ఉపకేంద్రం ద్వారా మొక్కుబడిగా వైద్య సేవలు అందిస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి దయనీయం
కోటనందూరు పీహెచ్‌సీలో రోగులకు, సిబ్బందికి అవసరమైన కనీస వసతులు లేవు. రోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గత ఐదేళ్లగా ఆసుపత్రి నిర్వహణ అత్యంత దయనీయంగా మారింది. సిబ్బంది కొరతతో రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడంలేదు. ఈ ఆసుపత్రిలో కనీసం రక్త పరీక్ష చేసే పరిస్థితి లేదు. ఆసుపత్రి భవనం పూర్తిగా శిథిలమై ఎప్పుడు కూలిపోతుందో తెలియని దుస్థితిలో ఉంది. చాలా కాలంగా 30 పడకల ఆసుపత్రిగా మారుస్తామని చెప్పడమే కాని మారింది కనబడలేదు.      
 – డేవిడ్, కోటనందూరు

ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం
పాతకొట్టాంలో ప్రభుత్వ ఆసుపత్రి లేక ఎన్నో అవస్థలు పడుతున్నాం. ఏ రకమైన  వైద్యం కావాలన్నా ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించాల్సి వస్తోంది. ఇక్కడ వైద్య దొరకక దూర ప్రాంతాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం కావడంతో ప్రభుత్వ వైద్యం అందితే బాగుంటుంది.
– పంపనబోయిన సత్యవతి, తిమ్మరాజుపేట

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top