పసుపు..కుంకుమ.. ఎన్నడో జమ

Pasupu Kumkuma Scheme Delayed In YSR kadapa - Sakshi

ఇంకా జమ కాని రూ 64.29 కోట్లు

మహిళామణులకు తప్పని ఎదురుచూపులు

‘డ్వాక్రా రుణ మాఫీ’హామీకి ఐదేళ్ల సమయం...!

తమ అక్కచెల్లెల్లు సుఖ సంతోషాలతో ఉండాలని పసుపు.. కుంకుమను సమర్పిస్తారు. సోదరీమణుల సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న ‘పసుపు.. కుంకుమ’కు అర్ధాలే వేరుగా మారాయి. మొదట డ్వాక్రా రుణం ఎంత ఉన్నా మాఫీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక ఒక సంఘానికి రూ.లక్ష చొప్పున మాఫీ ఉంటుందన్నారు. తరువాత ఒక సభ్యురాలికి రూ.10 వేలు చొప్పున మూడు విడతలుగా చెల్లిస్తామన్నారు. దీనికి ‘పెట్టుబడి నిధి’అని పేరు పెట్టారు. డబ్బులు వాడుకొనే వీలులేని విధంగా ఆంక్షలు విధించారు. మూడు విడతల రుణ మాఫీ నాలుగు విడతలుగా మారింది. చివరి విడతకు ‘పసుపు..కుంకుమ’అని నామకరణం చేశారు. పేరు మార్చినా తీరు మాత్రం మారలేదు.. మహిళామణులకు ఇక్కట్లు తప్పలేదు. ఇదీ చంద్రన్న పసుపు.. కుంకుమ కథ

కడప రూరల్‌: అది 2014వ సంవత్సరం.. ఎన్నికల సమయం. ఎలాగైనా సరే గెలవాలని నారా చంద్రబాబునాయుడు ఊరూరా తిరుగుతున్నారు. లెక్కలేనన్ని హమీలను ప్రకటించారు. అందులో నిరుపేదలైన మహిళలకు సంబంధించిన ‘డ్వాక్రా రుణ మాఫీ’ముఖ్యమైంది. తాను సీఎం కాగానే ఎస్‌హెచ్‌జీ సభ్యులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు.

నమ్మి మోసపోయిన సభ్యులు..
ఎస్‌హెచ్‌జీ సభ్యులు దాదాపు 80 శాతానికిపైగానిరుపేదలు.. కూలీ పనులు చేసుకొని జీవించేవారే ఉన్నారు. తాము తీసుకున్న రుణాలకు క్రమం తప్పకుండా కంతులు చెల్లిస్తారు. అలాంటి వారిని ‘కంతులు ఏమాత్రం చెల్లించవద్దు.. చంద్రన్న ముఖ్యమంత్రి కాగానే రుణమంతా మాఫీ అవుతుందని టీడీపీ కార్యకర్తలు అడ్డగించారు. దీంతో చాలా మంది కంతులు కట్టలేదు. తరువాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. దీంతో తాము తీసుకున్న రుణమంతా మాఫీ అవుతుందని సభ్యులు సంతోషపడ్డారు. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. తప్పనిసరిగా కంతులు చెల్లించాలని బ్యాంకర్ల నుంచి పిలుపు వచ్చింది. ఈ పిలుపుతో సభ్యులంతా అవాక్కయ్యారు. ఉన్నఫలంగా కంతులు చెల్లించడానికి కష్టాలు పడ్డారు. చివరికి ముక్కు పుడకలు, కమ్మలు కదువకు పెట్టడం లేదా వాటిని తెగనమ్మి కంతులను చెల్లించడం జరిగింది. మరికొంతమంది అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఆర్ధికంగా చితికిపోయారు. ఇది నాడు జరిగి వ్యవహరం.

హమీ అమలుకు ఐదేళ్లు...
ముఖ్యమంత్రి చంద్రబాబు మాటమీద నిలబడలేదు. మొదట చెప్పిన విధంగా రుణమంతా మాఫీ చేయలేదు. ఒక సంఘానికి రూ ఒక లక్ష మాఫీ ఉంటుందన్నారు. అదీ అమలు చేయలేదు. తర్వాత ఒక సభ్యురాలికి ‘పెట్టుబడి నిధి’కింద రూ 10 వేలు సభ్యురాలి బ్యాంకుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ రూ 10 వేలను కూడా మూడు విడదలుగా చెల్లిస్తామన్నారు. ఆ ప్రకారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధలో జిల్లా వ్యాప్తంగా అర్హులైన 32 వేల సంఘాల్లోని 3,21,473 మంది సభ్యులకు 2015 జూలైలో ఒకరికి రూ.3 వేల చొప్పున మొత్తం రూ 96,44,19,000 లను చెల్లించారు. ఇది పెట్టుబడి నిధి అయినందున డబ్బులు తీసుకొనే వీలులేని విధంగా ఆంక్షలు విధించారు. అనంతరం రెండో విడతగా 2016 సెప్టెంబర్‌–అక్టోబర్‌లో ఒకరికి రూ 3 వేల చొప్పున అంతే మొత్తాన్ని చెల్లించారు.

ఇక మూడో విడత పూర్తిగా చెల్లించాలి. అయితే మూడో విడత కింద గడిచిన మార్చిలో ఒకరికి రూ 2 వేల చొప్పున మాత్రం చెల్లించారు. దీంతో రుణ మాఫీ నాలుగు విడతలకు చేరింది. కాగా నాలుగో విడతగా ఒకరికి రూ 2 వేల చొప్పున మొత్తం రూ 64.92 కోట్లు అవసరం. ఈ డబ్బును దసరా సందర్భంగా గడిచిన 17వ తేదీన సభ్యుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు రెండు బ్యాంకుల్లో మాత్రమే జమ అయినట్లు తెలుస్తోంది. అంటే ఆ మొత్తం సభ్యుల చేతికి అందాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. సాంకేతిక కారణాల వల్ల ఇంతవరకు మాఫీకి వర్తించని 2 వేల మంది సభ్యులకు ఒకరికి రూ 10 వేల చొప్పున రావాల్సి ఉంది. కాగా 2014 జూన్‌లో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించారు. 2018 ఏడాది చివరి దశకు చేరుకున్నప్పటికీ మాఫీ అమలు నత్తనడకన సాగాడం దారుణం.

ఈ నెలలోపు సభ్యుల ఖాతాల్లో జమ అవుతుంది..
ఎస్‌హెచ్‌జీ సభ్యులకు నాలుగో విడతగా చెల్లించాల్సిన రూ 64 కోట్లకు పైగా డబ్బులు ఈ నెలాఖరులోపు సభ్యుల ఖాతాల్లో జమ అవుతాయి. ఇంకా రుణ మాఫీ వర్తించని 2 వేల మందికి ఒకరికి రూ 10 వేల చొప్పున ఒకేసారి చెల్లిస్తాం. ఇందుకు సంబంధించి అన్ని చర్యలు చేపట్టాం. ఈ నిధులను సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి.
– రామచంద్రారెడ్డి, ప్రాజెక్ట్‌ డైరెక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top