జాలి లేని దేవుడు! 

Parents Died In Ananthapur - Sakshi

రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రుల మృతి 

అనాథలుగా మారిన ముగ్గురు చిన్నారులు

సాక్షి, కంబదూరు: కంబదూరు మండలం జెక్కిరెడ్డిపల్లికి చెందిన ప్రేమనాథ్‌కు పదేళ్ల క్రితం కామాక్షితో వివాహమైంది. అన్యోన్య దాంపత్యానికి చిరునామాగా మారిన వీరు తమకున్న కొద్దిపాటి సంపాదనతోనే సంతోషంగా జీవిస్తూ వచ్చారు. వ్యవసాయ పనులతో కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో పల్లవికి తొమ్మిదేళ్లు, సృజనకు ఏడేళ్లు, కుమారుడు చరణ్‌కు నాలుగేళ్లు.  

30 రోజుల క్రితం ఇల్లాలి మృతి 
సంసారం సాఫీగా సాగిపోతున్న తరుణంలో కామాక్షి (30) అనారోగ్యం బారిన పడింది. అంతుచిక్కని వ్యాధి బారి నుంచి భార్యను కాపాడుకునేందుకు ప్రేమనాథ్‌ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. పేదరికం కారణంగా ఖరీదైన వైద్యాన్ని చేయించలేకపోయాడు. చివరకు పరిస్థితి విషమించి నెల రోజుల క్రితం కామాక్షి మృత్యువాతపడింది.  

మనోవేదనతో కుమిలిపోయి..  
భార్య మృతి ప్రేమనాథ్‌ను మరింత కుంగదీసింది. కేవలం పేదరికం కారణంగానే తన భార్యకు ఖరీదైన వైద్యం అందించలేక పోయానంటూ లోలోన కుమిలిపోతూ వచ్చేవాడు. ఒంటరిగా ముగ్గురు పిల్లలను ఎలా పెంచి పెద్దచేయాలని కలత చెందేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం తన ఇంటిలోనే ప్రేమనాథ్‌ (36) కళ్లు తిరిగి కిందపడ్డాడు. విషయాన్ని చూసిన చిన్నారులు భయంతో కేకలు వేశారు. ‘నాన్న లే నాన్నా’ అంటూ రోదించారు. ‘నాన్నకేమైంది అక్కా’ అంటూ సృజన, చరణ్‌ అడుగుతుంటే పల్లవి నోట మాటరాలేదు.

చిన్నారుల రోదనలు విన్న చుట్టుపక్కల వారు అప్రమత్తమై అక్కడకు చేరకున్నారు. పరిస్థితి గమనించి వెంటనే ప్రేమనాథ్‌ను కంబదూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికే కనిపించకుండా పోయిన తల్లి రూపాన్ని తలుచుకుంటున్న ఆ చిన్నారులు... తాజాగా నిర్జీవంగా పడి ఉన్న తండ్రి మృతదేహాన్ని చూసి ఎందుకో నాన్న నిద్రనుంచి ఇంకా లేవడం లేదంటూ అమాయకంగా అడుగుతుంటే గ్రామస్తులు కంటతడి పెట్టడం మినహా మరేమీ చేయలేకపోయారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top