
పాలెం సంఘటనపై చర్యలేవీ: బాధితులు
పాలెం బస్సు ప్రమాదం జరిగి ఇంతకాలమైనా ఇప్పటివరకు ఎవ్వరి మీదా చర్యలు తీసుకోలేదని ప్రమాద బాధితులు మండిపడ్డారు.
పాలెం బస్సు ప్రమాదం జరిగి ఇంతకాలమైనా ఇప్పటివరకు ఎవ్వరి మీదా చర్యలు తీసుకోలేదని ప్రమాద బాధితులు మండిపడ్డారు. ఇలాంటి సంఘటన మరోటి మన రాష్ట్రంలో జరగకూడదని వారు కోరుకున్నారు. తామంతా జీవచ్ఛవాల్లా మిగిలిపోయామని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తోందని అన్నారు. వాళ్లిచ్చే లక్షతో తమ ఆవేదన తీరిపోదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని మండిపడ్డారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి, రవాణామంత్రికి చీమకుట్టినట్లయినా లేదని, బస్సు దగ్ధం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో బస్సు మాఫియా నడుస్తోందని, దాన్ని అడ్డుకునేందుకు అందరూ తమతో కలిసి రావాలని వారు అన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పాలెం బస్సు ప్రమాద బాధితులకు సంఘీభావంగా ఈనెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు చెప్పారు.