టీచర్ల సర్దుబాటు లీలలు!

Pairavies In Teachers Transfers anantapur - Sakshi

పైరవీలకు పెద్దపీట

నిబంధనలకు పాతరేసిన విద్యాశాఖ

విద్యార్థుల కోసం కాదు టీచర్ల సౌలభ్యమే

చేతులు మారిన లక్షలాది రూపాయలు

చోద్యం చూస్తున్న ఉపాధ్యాయ సంఘాలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: సబ్జెక్టు టీచర్లు లేని ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు, ముఖ్యంగా పదోతరగతి విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘సర్దుబాటు’కు పూనుకుంది. అయితే విద్యాశాఖ అధికారులు పైరవీలకు పెద్దపీట వేస్తూ సర్దుబాటుకు కొత్తభాష్యం చెబుతున్నారు.  విద్యార్థుల అవసరాలు కాకుండా టీచర్ల సౌలభ్యం కోసం సర్దుబాటు చేస్తుండడం చర్చనీయాంశమవుతోంది.

రొళ్ల మండలం రత్నగిరి జెడ్పీహెచ్‌ఎస్‌లో 6–10 తరగతుల విద్యార్థులు 300 మంది ఉన్నారు. తెలుగు పండిట్‌ టీచర్లు ఇద్దరు పని చేస్తున్నారు. వీరిలో ఒకరిని ధర్మవరం మండలం గొట్లూరు జెడ్పీహెచ్‌ఎస్‌కు సర్దుబాటు చేశారు. గొట్లూరు స్కూల్‌లో 200 మంది విద్యార్థులున్నారు. ఇక్కడే ఇదివరకే ఒక టీచరు కూడా పని చేస్తున్నారు. అయినా మరో టీచరును సర్దుబాటు చేశారు.  
గుడిబండ మండలం కుమ్మరనాగేపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఫిజికల్‌ సైన్స్‌ టీచరును ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు జెడ్పీహెచ్‌ఎస్‌కు సర్దుబాటు చేశారు. నిబంధనల ప్రకారం మండల పరిధిలో సరఫ్లస్‌ (మిగులు) టీచర్లకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అక్కడ లేకపోతే పొరుగు మండలాలు, అక్కడా లేకపోతే పొరుగు డివిజన్‌ నుంచి తీసుకోవచ్చు. అయితే ముదిగుబ్బ మండలంలో ఓ యూపీ స్కూల్‌లో పీఎస్‌ టీచరు సరఫ్లస్‌గా ఉన్నారు. ఆ టీచరును కాదని ఎక్కడో గుడిబండ మండలం నుంచి తీసుకురావడం విశేషం. టీచర్ల సర్దుబాటులో జరుగుతున్న పైరవీలకు ఈ ఉదంతాలు నిదర్శనం.   

నిబంధనలకు నీళ్లు..
జిల్లాలో టీచర్ల సర్దుబాటుకు విద్యాశాఖ పూనుకుంది. ఈ ప్రక్రియ జూన్‌ 30లోగా పూర్తి చేయాలని విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ అధికారులు నేటికీ ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నారు. ‘అయిన వారికి ఆకులో కానివారికి కంచంలో’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు : ఉపాధ్యాయుల రేషియో మేరకు ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయులను తక్కువ టీచర్లు ఉండి ఎక్కువ విద్యార్థులుండే  పాఠశాలలకు సర్దుబాటు చేస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న చోటే జీతాలు తీసుకుంటూ మరోచోట పని చేయాల్సి ఉంటుంది. సర్దుబాటు ఆయా మండలాల పరిధిలోనే మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలి. ఈ నిబంధనలు ఏవీ పట్టించుకోలేదు. విద్యార్థుల కోసం కాకుండా ఉపాధ్యాయుల సౌలభ్యం కోసమే చాలామందిని డెప్యూటేషన్‌పై నియమించారు. అయితే చాలామంది టీచర్లు పైరవీలు చేశారు. అవసరమైన చోటుకు కాకుండా...వారికి అనుకూలమైన ప్రాంతాలకు సర్దుబాటు చేయించుకున్నారు. విద్యాశాఖ సిబ్బంది అడ్డుగోలుగా సర్దుబాటు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు ఒత్తిళ చేయించి కొందరు టీచర్లు తమకు అనుకూలమైన చోటుకు వెళ్లగా, ఇదే అదనుగా  కొందరు డీఈఓ కార్యాలయ సిబ్బంది ఆమ్యామ్యాలకు తెర తీశారు. అనుకూలమైన వారితో డబ్బు ఒప్పందం చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా రిలీవ్‌ ఉత్తర్వులు పంపుతున్నారు.  ప్రతి చిన్న విషయాన్ని డీఈఓ బ్లాగులో పెట్టే విద్యాశాఖ అధికారులు ఇంత భారీ ఎత్తున జరుగుతున్న సర్దుబాటు వివరాలను మాత్రం బ్లాగులో పెట్టకపోవడం విశేషం. ఈ వ్యవహారంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు నోరు మెదపకపోవడం విశేషం.

విద్యార్థుల సంక్షేమం పట్టని టీచర్లు
చాలామంది ఉపాధ్యాయులు విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచించడం లేదు. తాము నివాసాలు ఉంటున్న చోటుకు ఎంత దగ్గరికి వద్దామనే ఆలోచన తప్ప గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థుల భవిత్యం గురించి ఆలోచించడం లేదు. ఇలాంటి వారికి విద్యాశాఖ సిబ్బంది సపోర్ట్‌ చేస్తుండడం బాధాకరం. ఎంతసేపూ జిల్లా కేంద్రం, పట్టణాలు, మండల కేంద్రాలకు సమీపం, బస్సుల సదుపాయం అనుకూలంగా ఉన్నాయా...లేదా అనే టీచర్లు ఆలోచిస్తున్నారు. కొన్ని స్కూళ్లకు అవసరం లేకపోయినా కేవలం వారికి అనుకూలంగా ఉంటుందనే కారణంతో డీఈఓపై రాజకీయ నాయకులతో ఒత్తిళ్లు చేయించి మరీ ఆ స్కూళ్లలో చేరారు. దీనిని విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తిగా తప్పుపడుతున్నారు.   
డీఈఓ పూల్‌లో హిందీ టీచర్లు ఉన్నారు. అవసరం ఉన్న చోట్ల వీరిని వినియోగించుకోవచ్చు. వారిని కాదని ఎక్కడో దూరంగా ఉన్న ఎస్జీటీ స్థాయి టీచరును అనంతపురం సమీపంలోకి సర్దుబాటు చేశారు.  
తాడిపత్రి ప్రభుత్వ పాఠశాల నుంచి గణితం టీచరును కళ్యాణదుర్గం స్కూల్‌కు సర్దుబాటు చేశారు. అయితే తిరిగి తాడిపత్రి స్కూల్‌కు గుంతకల్లు నుంచి మరో టీచరును సర్దుబాటు చేయడం విశేషం.  
అమడగూరు మండలం జౌకులకొత్తపల్లి నుంచి రొళ్ల మండలం కాకి స్కూల్‌కు ఫిజికల్‌ సైన్స్‌ టీచరును సర్దుబాటు చేశారు. నవాబుపేట స్కూల్‌ నుంచి తిరిగి జౌకులకొత్తపల్లికి ఇంకో టీచరును సర్దుబాటు చేశారు.
ఒక్క కళ్యాణదుర్గం ప్రభుత్వ పాఠశాలకు దాదాపు తొమ్మిదిమంది టీచర్లను సర్దుబాటు చేశారు. రెండు సబ్జెక్టులకు ఇద్దరు చొప్పున, మరో సబ్జెక్టుకు ఏకంగా ముగ్గురు టీచర్లను నియమించారు.  
ఎన్‌పీ కుంట మండలం గౌకులపల్లి ప్రాథమిక పాఠశాలకు టీచర్ల అవసరం ఉంది. పక్కనే ఉన్న వెలిచెలిమల స్కూల్‌లో టీచర్లు సర్‌ఫ్లస్‌గా ఉన్నారు. ఇక్కడి నుంచి కాదని 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండెంవారి పల్లి నుంచి సర్దుబాటు చేశారు. ఆరోపణలు రావడంతో తేరుకున్న అధికారులు అవసరం లేకపోయినా వెలిచెలిమలలో సర్‌ఫ్లస్‌గా ఉన్న టీచర్లను ఎన్పీకుంట మెయిన్‌ స్కూల్‌కు సర్దుబాటు చేశారు. వాస్తవానికి మండెంవారిపల్లిలో యూపీ స్కూల్‌కు ఇక్కడ టీచర్లు అవసరం. కానీ అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top