గుజరాత్ ‘అమూల్’ను అడ్డుకోండి | Our state of the loss of milk farmers | Sakshi
Sakshi News home page

గుజరాత్ ‘అమూల్’ను అడ్డుకోండి

Dec 27 2014 1:22 AM | Updated on Sep 2 2017 6:47 PM

గుజరాత్ ‘అమూల్’ను అడ్డుకోండి

గుజరాత్ ‘అమూల్’ను అడ్డుకోండి

రాష్ట్ర మార్కెట్లోకి వచ్చే నెలలో అడుగుపెట్టనున్న గుజరాత్ ‘అమూల్’ పాలపై విజయ డెయిరీ ఆందోళన చెందుతోంది.

  • ఆ పాలు రాష్ట్రానికొస్తే మన రైతులకు నష్టం
  • టీ సర్కారుకు విజయ డెయిరీ లేఖ
  • రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం
  • ‘నార్మాక్’కు నోటీసులు!
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మార్కెట్లోకి వచ్చే నెలలో అడుగుపెట్టనున్న గుజరాత్ ‘అమూల్’ పాలపై విజయ డెయిరీ ఆందోళన చెందుతోంది. సహకార స్ఫూర్తికి విరుద్ధంగా ఇక్కడి మార్కెట్‌లోకి వస్తున్న అమూల్‌ను అడ్డుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సర్కారుకు లేఖ రాయడంతో సంబంధిత యంత్రాంగం రంగంలోకి దిగి, చర్యలు చేపట్టింది.

    గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (జీసీఎంఎంఎఫ్).. ఆ రాష్ట్ర రైతుల నుంచి సేకరించిన పాలను తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తొలుత 50 వేల లీటర్లతో ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది లీటర్లకు విస్తరించాలనేది దాని లక్ష్యం. ఇందులో భాగంగా గుజరాత్ నుంచి తీసుకొచ్చిన పాలను ప్యాకింగ్ చేసేందుకు నల్లగొండ-రంగారెడ్డి మిల్క్ యూనియన్ (నార్మాక్)తో జీసీఎంఎంఎఫ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఉన్న నార్మాక్ యూనిట్‌లో అమూల్ పాలను ప్యాకింగ్ చేసి వినియోగదారులకు సరఫరా చేస్తారు.

    ఇలా అమూల్ పాలు రాష్ట్రానికి రావడం వల్ల తెలంగాణ రైతులకు నష్టం జరుగుతుందని విజయ డెయిరీ ఆందోళన వ్యక్తంచేస్తోంది. తెలంగాణ రైతుల నుంచే పాలు సేకరించి, సొంత యూని ట్ పెట్టుకొని వాటిని సరఫరా చేస్తే తమకు అభ్యంతరం లేదని.. అలాకాకుండా గుజరాత్ రైతుల నుంచి సేకరించిన పాలను ట్యాంకర్ల ద్వారా తరలించి ఇక్కడ ప్యాకింగ్ చేసి అమ్మడం సహకార నిబంధనలకు విరుద్ధమని డెయిరీ అధికారులు పేర్కొంటున్నారు.

    గుజరాత్ సహకార సంస్థ మన రాష్ట్ర సహకార విజయ డెయిరీకి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిపోయి ఇలా పోటీకి రావడం తగదంటున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రైతులకు పాల సేకరణ ప్రోత్సాహకం కింద లీటరుకు రూ.4 అదనంగా ఇచ్చి విజయ డెయిరీకి ప్రాణం పోశారు. ఈ నేపథ్యంలో గుజరాత్ పాలు రాష్ట్రంలోకి అడుగుపెడితే ప్రధానంగా విజయ డెయిరీపైనే ప్రభావం పడుతుందని అంటున్నారు. పైగా మన చిన్న, సన్నకారు రైతులు ఉత్పత్తి చేసే పాలకు గిరాకీ లేకుం డా పోతుందని సర్కారుకు రాసిన లేఖలో విజ య డెయిరీ పేర్కొంది.

    అలాగే నార్మాక్ యూని ట్‌తో అమూల్ ఒప్పందం అంగీకారం కాదని స్పష్టంచేసింది. హయత్‌నగర్‌లోని నార్మాక్ యూనిట్ సహా దాని కింద ఉన్న 72 ఎకరాలు మొత్తం విజయ డెయిరీకి చెందిన ఆస్తులేనని... అలాంటప్పుడు ప్రభుత్వ అనుమతి లేకుండా అమూల్ పాలను ఆ యూనిట్‌లో ఎలా ప్యాకింగ్ చేస్తారని ప్రశ్నించింది.

    విజయ డెయిరీ లేఖతో ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. లేఖలో ప్రస్తావించిన అంశాల ఆధారంగా నార్మాక్‌పై చర్యలు తీసుకోవాలని సహకారశాఖను ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆ శాఖ నార్మాక్‌కు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు అమూల్‌కు కూడా నోటీసులు ఇవ్వాలని సహకారశాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement