రుణమాఫీ అందరికీ కాదు.. కొందరికే అని తేలిపోయింది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రుణమాఫీ అందరికీ కాదు.. కొందరికే అని తేలిపోయింది. ముఖ్యమంత్రి రకరకాల కొర్రీలు పెట్టి చాంతాడంత జాబితాను కుదించి.. అయిష్టంగా కొంతమంది పేర్లతో తుది జాబితాను విడుదల చేశారు. ‘తాంబూలాలు ఇచ్చాం.. తన్నుకు చావండి’ అన్నట్లుగా వెబ్‌సైట్‌లో వివరాలు పెట్టి రైతులను పరుగులు పెట్టిస్తున్నారు. రుణమాఫీ మాటెలా ఉన్నా.. రైతులు మాత్రం సీఎం చంద్రబాబు పెట్టిన అగ్నిపరీక్షలో పాస్ అయ్యామా? లేదా? అని తెలుసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు.
ఆదివారం సెలవు కావటం.. ఉన్న వెబ్‌సైట్‌లు ఓపెన్ కాకపోవటంతో అనేకమంది వెనుదిరిగి వెళ్లి.. తిరిగి సోమవారం నెట్ సెంటర్లకు చేరుకున్నారు. అందులో కొందరి పేర్లు ఉన్నా అర్థం కాక జుట్టు పీక్కుంటూ వెళ్తే.. మరికొందరు జాబితాలో పేర్లు గల్లంతవ్వటంతో ఆగ్రహంతో సీఎంకు శాపనార్థాలు పెడుతూ వెళ్లటం కనిపించింది. మరి కొన్నిచోట్ల అస్సలు వెబ్‌సైట్ ఇంకా ఓపెన్ కాకపోవటం గమనార్హం. వైఎస్సార్‌సీపీ మహాధర్నా నేపథ్యంలో హడావుడిగా రుణమాఫీ చేసే తేదీని చంద్రబాబు ప్రకటించిన విషయమే తెలిసిందే. అలాంటిది ఒకరోజు ఆలస్యంగా జాబితాను ప్రకటించినా ఫలితం లేకపోయింది. నెట్‌లు పనిచేయకపోవడం, కొందరి పేర్లే ఉండటంతో రైతులు ఉసూరుమన్నారు.
రూ.50 వేలకు.. మాటమార్చారు
వైఎస్సార్‌సీపీ మహాధర్నాకు ముందు రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావుడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రుణమాఫీపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు మొదటి విడతలో రూ.50వేల లోపు ఉన్న రైతులను ఒకేసారి రుణ విముక్తులను చేస్తామని ప్రకటించారు. సీఎం ప్రకటనతో జిల్లాలో టీడీపీ నేతలు బాణాసంచా కాల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు. రుణమాఫీ నుంచి రైతులను విముక్తులను చేశారని ఆర్భాటం చేశారు. తీరా అమల్లోకి వచ్చేసరికి చంద్రబాబు చెప్పే మాటలన్నీ నీటి మూటలేనని మరోసారి తేలిపోయింది. రూ.50వేల లోపు రుణాలు తీసుకున్న రైతులకు ఒక్కొక్కొరికి ఒక్కో విధంగా నిధులు జమచేసినట్లు సమాచారం. ‘నెల్లూరుకు చెందిన పెంచలయ్య కు 3.70 ఎకరాల పొలం ఉంది.
అందులో వరి సాగుచేస్తున్నారు. పంటపై రూ.40, 538 రుణం తీసుకున్నారు. సీఎం ప్రకటించినట్లు రూ.50వేల లోపు ఉన్న రైతు కావటంతో ఇతని రుణం ఒకేసారి మాఫీ కావాలి. అయితే సోమవారం వెబ్‌సైట్‌లో చూసుకుంటే.. ఇతని బ్యాంక్ అకౌంట్‌లో రూ.8,107 జమచేసినట్లు చూపించి ఉన్నా రు. అదేవిధంగా సైదాపురం మండలానికి చెందిన అద్దేపల్లి వెంకటేశ్వర్లు తనకున్న 2.97 ఎకరాలపై వడ్డీతో కలిపి రూ.50వేలు కో-ఆపరేటివ్ బ్యాంక్ లో అప్పు ఉంది. అయితే ఇతనికి 20శాతం చొప్పున రూ.10వేలు జమచేసినట్లు చెప్పారు. అదే మండలానికి చెందిన మువ్వా సురేష్‌బాబు 2.40 ఎకరాలపై అసలు వడ్డీ కలుపుకొని రూ.48,629 అప్పు ఉంది. అయితే ఇతనికి రూ.9,725 జమ చేసినట్లు వెబ్‌సైట్‌లో చూపుతోంది. ఇదిలాఉండగా ప్రభుత్వం ఒకే పంటకు ఒక్కో రకంగా మార్కెట్ ధర నిర్ణయించి రైతులను అయోమయానికి గురిచేస్తోంది. మిరప సాగు చేస్తున్న రైతుల్లో ఒకరికి ఎకరానికి రూ.24వేలు, మరొకరికి రూ.15 వేలు, ఇంకొకరికి రూ.9వేలు ఖర్చు అవుతుందని అంచనా వేసి ఉండటం కనిపించింది.
అర్హులు 40శాతం మందే...
ప్రభుత్వం ప్రకటించిన జాబితాను పరిశీ లిస్తే రుణమాఫీకి అర్హులు కేవలం 40శాతం మందేనని తేలిపోయింది. జిల్లాలో మొత్తం 5,67,158 మంది రైతులు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. వారిలో 73,253 మంది రైతులు అనుబంధ రుణాలు తీసుకున్నారని అర్హుల జాబితా నుంచి తొలగించారు. మిగిలిన 4,93,906 మంది రైతుల జాబితాను బ్యాంకర్లు ప్రభుత్వానికి పంపారు. అయితే అందులో రకరకాల కొర్రీలుపెట్టి 3.40 లక్షల మందికి కుదించారు. చివరకు అందులో నుంచి 1,53,906 మంది రైతుల పేర్లను పక్కనపెట్టారు.
మిగిలిన వారిలో నుంచి 40శాతం మంది రైతులను రుణమాఫీకి అర్హుల జాబితాలో చేర్చినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. బ్యాంకర్లు చెపుతున్న లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా 85వేల నుంచి 1.20 లక్షల మంది వరకు ఉండే అవకాశం ఉంది.డీసీసీబీ పరిధిలో మొత్తం 46,073 మంది రైతుల్లో 19,919 మందికి సంబంధించి రూ.62.61 కోట్లు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో మొదటి విడత కింద 16శాతం లెక్కన రూ.26.18 కోట్లు విడుదల చేసినట్లు బ్యాంకర్లు వెల్లడించా రు. వెబ్‌సైట్‌ల సమస్య కారణం అర్హుల పేర్లు నేడో, రేపో అన్ని బ్యాంక్‌ల వద్ద నోటీసు బోర్డులో పెట్టనున్నట్లు తెలిపారు.