అశనిపాతం

Onion Prices Decreases Farmers Problems In YSR Kadapa - Sakshi

కడప అగ్రికల్చర్‌/పెండ్లిమర్రి: రాష్ట్రవ్యాప్తంగా వానలు సరిగా కురవలేదని మార్కెట్‌కు ఉల్లిగడ్డల కొరత ఉంటుందని ఆలోచించిన జిల్లా రైతులు బోరుబావుల ఉల్లి పంట సాగు చేశారు. పంట చేతికందే సమయంలో మార్కెట్‌లో ధరలు పెరగకపోగా రోజు రోజుకు పతనమవుతూ వస్తున్నాయి. దీంతో రైతన్నల  ఆశలు అడియాసలయ్యాయి.  పంట సాగు సమయంలో క్వింటాలు రూ.3 వేల నుంచి రూ.4 వేల ధర పలికింది. రైతులు ఎకరం సాగుకు రూ.75 వేల నుంచి రూ.లక్ష దాకా పెట్టుబడి పెట్టారు. తీరా పంట చేతికొచ్చే సరికి క్వింటా రూ.500  కంటే మించి పలకలేదు. ఎకరానికి దిగుబడి కూడా 10–20 క్వింటాళ్ల కంటే మించి రాలేదు. ఈ దిగుబడికి వ్యాపారులు పెట్టిన ధరకు ఎకరానికి రూ.50వేల నుంచి రూ.55 వేల కంటే మించి రాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన  పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఉల్లిగడ్డలను డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు మార్కెటింగ్‌శాఖ తరలించి ఆదుకోవాల్సి ఉన్నప్పటికి ఆ పని చేయలేదని రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఏ మాత్రం పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా ఉంటా యని రైతులు భావించారు. నిన్న... మొన్నటి వరకు  కిలో రూ.20–25లతో కొనుగోలు చేసిన వ్యాపారులు, నేడు మార్కెట్‌లో ఉల్లిగడ్డలకు డిమాండ్‌ తగ్గిందని సాకు చూపుతూ   కిలో రూ.5లకు కొనుగోలు చేస్తుండడం రైతులకు ఆశనిపాతం అయింది. ఉల్లిగడ్డలకు మద్దతు ధరలు కరువవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎగుమతులను ప్రోత్సభించడంలేదని రైతు సంఘాలు నిప్పులు చేరుగుతున్నాయి. నాలుగు సంవత్సరాలుగా అతి వృష్టి, అనావృష్టి, విద్యుత్‌ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని, ఈ  ఏడాది వర్షాలు సరిగా కురవ లేదని, పంట అధికంగా సాగుకాదని తెలిసి బోరుబావుల నుంచి వచ్చే అరకొర నీటితో పంట సాగు చేశామని రైతులు చెబుతున్నారు. ధరలు వెక్కిరిస్తున్నాయని మదన పడుతున్నారు.

4,345 ఎకరాల్లో ఉల్లి సాగు
జిల్లాలోని ఉద్యానశాఖ 1,2 పరిధిలోని కడప, చింతకొమ్మదిన్నె, సిద్ధవటం, పెండ్లిమర్రి, మైదుకూరు, దువ్వూరు, బి మఠం, ఖాజీపేట, వేంపల్లె, ముద్దనూరు, వీరపునాయునిపల్లె, పులివెందుల, తొండూరు, వేముల మండలాల్లో ఉల్లి పంటను 4,345 ఎకరాల్లో సాగు చేశారు. సాధారణంగా గడ్డలు బాగా ఊరితే మంచి దిగుబడి 50 నుంచి 80 క్వింటాళ్లు వస్తుందని, అయితే ఈ ఏడాది తీవ్ర వర్షాభావానికి, ఎండలు అధికం కావడం, తెగుళ్లు, పురుగులు పట్టి పీడించడంతో ఎకరానికి 10 నుంచి 20 క్వింటాళ్ల కంటే మించి దిగుబడి రాలేదని అంటున్నారు.ఇప్పుడు సాగైన 4,345 ఎకరాల ఉల్లి పంట నుంచి ఇప్పటి దిగుబడి ప్రకారం చూస్తే మార్కెట్‌కు 43,450 నుంచి 86,900 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంటసాగు నుంచి నూర్పిడి వరకు కంటికి రెప్పలా చూసుకున్నా ధరలు మాత్రం వెక్కిరిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని ప్రతి ఏటా ఆందోళనలు, రాస్తారోకోలు, కలెక్టరేట్‌ వద్ద ధర్నాలు చేసినా పాలకులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.

పెట్టుబడి కూడా రాని పరిస్థితి
ఉల్లిపంట ఎకరం సాగుకు విత్తనాలు, ఎరువులు, నారు నాట్లు, కలుపుతీత, మందుల పిచికారీ, నూర్పిళ్లకుగాను మొత్తం రూ.80 నుంచి రూ.లక్ష పెట్టుబడి అయిందని రైతులు చెబుతున్నారు. మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా లేవని వ్యాపారులు అంటున్నారు. దీంతో పంటను నిల్వ చేసుకునేందుకు వీలులేక నష్టానికే  అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 10–20 క్వింటాళ్ల దిగుబడి ఉన్నా క్వింటా ధర రూ.500 పలుకుతుంటే పెట్టుబడి కూడా తీరే పరిస్థితులు కనిపించలేదంటున్నారు. వ్యాపారులు రైతుల వద్ద కిలో రూ.5లకు కోనుగోలు చేసి మార్కెట్‌లో రూ.20–25లకు విక్రయిస్తున్నారు.   దళారీ, వ్యాపారి ఆదాయం అర్జిస్తున్నా  రైతు మాత్రం అప్పులను మూటగట్టుకుంటున్నారు. కోటి ఆశలతో ఉల్లి పంట సాగుచేసిన అన్నదాతకు కష్టాలు మొదలయ్యాయి.  పెట్టుబడులు తడిసిమోపెడవుతున్నా ధరలు చూస్తే పాతాళంలో ఉన్నాయని రైతులు లబోదిబో అంటున్నారు.

మంచి ఆదాయం వస్తుందనుకున్నా..
మార్కెట్లో ఉల్లి ధరలు బాగుంటాయని పంటసాగు చేశాను. ఎకరం పొలంలో ఉల్లి సాగు చేశాను. మంచి ధరలు ఉంటాయి.. కష్టాలు తీరుతాయని అనుకుంటే అది మమ్ములనే చుట్టుకుంది. ఎంత లేదన్నా ఖర్చులన్నీ పోను రూ.లక్ష నుంచి రూ.1.50 లక్ష వస్తుందని ఆశించా...ఆ ఆశలు తీరలేదు.    – నారాయణరెడ్డి, ఉల్లి రైతు, నల్లయ్యగారిపల్లె, పెండ్లిమర్రి మండలం

గిట్టుబాటు ధరలు కల్పించాలి
నాలుగు సంవత్సరాలుగా ఉల్లిసాగుచేసి నష్టాలను చవిచూశాం. ఈసారైనా మంచి ఆదాయం వస్తుందని ఆశించాం. తీరా పంట చేతికి వచ్చాక ధరలు నట్టేముంచాయి. ప్రభుత్వం గిట్టుబాటు ధర  కల్పించాలి. ధరల స్థిరీకరణ పథకం ఏమైందో రైతులకు ప్రభుత్వం చెప్పాలి. ఉల్లి ఎగుమతి అయితేనే ఆశించిన ధరలు వస్తాయి. లేకపోతే పెట్టుబడులు రావు. ఇలాగైతే నష్టపోవాల్సి వస్తుంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఉల్లి పంటను ధరలున్న ప్రాంతాలకు ఎగుమతి చేసే విధంగా ప్రభుత్వానికి విన్నవించాలి. అలా చేస్తేనే  గట్టెక్కగలుగుతారు.
–భాస్కరరెడ్డి, వైఎస్సార్‌ సీపీ, రైతు సంఘం మండల అధ్యక్షుడు, వీఎన్‌పల్లె

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top