
కుటుంబానికి లక్షన్నరే రుణ మాఫీ
ఆంధ్రప్రదేశ్‌లో ఒక కుటుంబానికి లక్షన్నర రూపాయలు మాత్రమే రుణ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టంచేశారు.
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు స్పష్టీకరణ
ఒకే కుటుంబానికి వేర్వేరు బ్యాంకుల్లో ఉన్న రుణాల అనుసంధానం.. తర్వాతే రుణ మాఫీ
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఒక కుటుంబానికి లక్షన్నర రూపాయలు మాత్రమే రుణ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టంచేశారు. శనివారం తన క్యాంప్ కార్యాలయం లేక్‌వ్యూ అతిథి గృహం నుంచి 13 జిల్లాల కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కుటుంబంలో ఎంత రుణం ఉన్నా లక్షన్నర వరకే రద్దవుతుందని చెప్పారు. ఒకే కుటుంబానికి చెందిన వారికి రెండు, మూడు బ్యాంకుల్లో వేర్వేరు పేర్లతో రుణాలుంటే వాటన్నిం టినీ అనుసంధానం చేస్తామన్నారు. ఆ తరువాతే రుణ మాఫీ అమలు చేస్తామని తెలిపారు. జిల్లాల్లోని బ్యాంకర్లకు, రైతులకు రుణ మాఫీ గురించి వివరించాలని కలెక్టర్లకు చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు రాష్ట్రం లోని అన్ని స్థాయిల అధికారులు పట్టుదలతో పనిచేయాలని చెప్పారు. రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విభజన అనంతరం రాష్ట్రం రూ. 16వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఉందని తెలిపారు. ఈ లోటును పూడ్చేందుకు కేంద్రం సాయం చేస్తుందని వివరించారు. ప్రతి మంగళ, బుధవారాల్లో కలెక్టర్, ఇతర అధికారులు రోజుకు రెండు గ్రామాలను సందర్శించి ప్రజలకు ఆధునిక సేద్యపు పద్ధతులపై అవగాహన కల్పించాలని చెప్పారు.
వైద్య శాఖ అధికారులపై అసంతృప్తి
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆరోగ్య రంగంలో రాష్ట్రం పరిస్థితి దేశంలోనే దారుణంగా ఉందని చెప్పారు. అధికారులు ఆశించిన స్థాయిలో పనిచేయటంలేదని అన్నారు. ఆరు జిల్లాల్లో మలేరియా వ్యాపించిందని, నాలుగు జిల్లాల్లో డెంగ్యూ, గుంటూరులో చికెన్‌గున్యా వ్యాధులు విజృంభిస్తున్నాయని, వీటి నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇసుక తవ్వకాల్లో డ్వాక్రా సంఘాల సేవలు
రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన నూతన ఇసుక విధానం వెంటనే అమల్లోకి వస్తుందని సీఎం చెప్పారు. ఇసుక తవ్వకం, అమ్మకాలను ఏపీఎండీసీ నిర్వహిస్తుందని, ఇందులో డ్వాక్రా సంఘాల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. వీరి సేవలకు కొంత నగదు చెల్లిస్తామని, ఆదాయంలో 25 శాతం కూడా డ్వాక్రా సంఘాలకు ఇస్తామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు ప్రవేశపెడతామన్నారు.