ఈ ఎనిమిది రోజులు అత్యంత కీలకం 

Officials Take Care On People Of Krishna District Over Coronavirus Spreading - Sakshi

ఇంటింటా ర్యాపిడ్‌ సర్వే చేస్తున్న సిబ్బంది 

హౌస్‌ సర్జన్ల పర్యవేక్షణలో క్వారంటైన్లు 

హాట్‌స్పాట్‌లలో మరింత అప్రమత్తం 

కిలోమీటరు మేర రాకపోకలు నిలిపివేత 

వైరస్‌ ప్రభావిత ప్రాంతాల్లో నోటీసులు అంటిస్తున్న వైద్య సిబ్బంది 

ఇంటి వద్దకే నిత్యావసరాల అందజేతకు చర్యలు  

సాక్షి, కృష్ణా: కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో జిల్లాలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఈ ఎనిమిది రోజులు అత్యంత కీలకం కావడంతో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూడాలని సూచిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన బాధితుల ప్రాంతాల్లో ఎవరినీ బయటకు రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. బారికేడ్లతో రాకపోకలు నిలిపివేస్తున్నారు. డ్రోన్‌లతో రసాయన ద్రావణాలను పిచికారీ చేయిస్తున్నారు. వైద్య బృందాలు ఇంటింటికీ తిరిగి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నాయి.    

హాట్‌స్పాట్‌.. అంతా అలర్ట్‌ 
జిల్లాలో సోమవారం సాయంత్రానికి మొత్తం 29 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క విజయవాడ నగరంలో అత్యధికంగా 17 పాజిటివ్‌ కేసులు రావడం.. ముఖ్యంగా భవానీపురం, ఓల్డ్‌ రాజరాజేశ్వరీపేటలో ఈ ప్రభావం అధికంగా ఉండడంతో ఆ ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు. బాధితుల నివాస ప్రాంతాల నుంచి కిలోమీటరు మేర ఎలాంటి రాకపోకలకు వీల్లేకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోని వారు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా.. ఇతరులెవరూ ఆ ప్రాంతానికి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను ఇళ్లకే అందిస్తున్నారు. సంబంధిత పరిధి వరకు సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని డ్రోన్లతో స్ప్రే చేయిస్తున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు మరింత మెరుగుపరుస్తున్నారు. అలాగే కరోనా బాధితులున్న ప్రాంతాలను నిషేధిత ఏరియాలుగా పేర్కొంటూ వైద్యసిబ్బంది నోటీసులు అంటిస్తున్నారు.   

హోం క్వారంటైన్లపై డేగ కన్ను..  
విదేశాల నుంచి జిల్లాలకు మొత్తం 2,443 మంది వచ్చారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూడటంలో భాగంగా వీరిని గుర్తించి జిల్లా యంత్రాంగం ఇళ్లకే వారిని పరిమితం చేసింది. వారికి కావల్సిన సరుకులు అందజేసింది. వీరిలో 993 మందికి ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఇది కొంత ఉపశమనం కలిగించే విషయం. వీరంతా 28 రోజుల పాటు గృహ నిర్బంధాన్ని పాటించారు.

వీరు కాకుండా మిగిలిన 1,450 మంది గృహ నిర్బంధంలోనే ఉన్నారు. అయితే వీరేవరూ నిబంధనలను అతిక్రమించకుండా ఇంటి వద్దే ఉంటున్నారా? లేదా? అని ప్రతిరోజూ హోం క్వారంటైన్లలో ఉన్నవారి వివరాలపై ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఆరా తీస్తున్నారు. వీరు కాకుండా ప్రత్యేక బృందాలు కూడా వీరి కదలికలపై నిఘా ఉంచాయి. ఎప్పటికప్పుడు వీరి సమాచారాన్ని ఉన్నతాధికారులకు ఆ బృంద సభ్యులు చేరవేస్తున్నారు.  

జిల్లాలో నియోజకవర్గ కేంద్రానికి ఒక్కటి చొప్పున 100 పడకల బెడ్లతో 16 క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. విజయవాడలో అదనంగా మరో మూడు క్వారంటైన్లను అందుబాటులో ఉంచారు. జిల్లాలో విజయవాడ, పెనమలూరు, జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు, మచిలీపట్నం ప్రాంతాల్లో 29 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం.. ఆ వెంటనే వారందరినీ ఐసోలేషన్‌కు తరలించడం జరిగింది.

తర్వాత అప్రమత్తమైన అధికారులు పాజిటివ్‌ సోకిన బాధితుడికి కలిసిన కుటుంబ సభ్యులు, సన్నిహితులను 798 మందిని గుర్తించి వారందరినీ వివిధ క్వారంటైన్లకు తరలించారు. ప్రస్తుతం వారందరికీ అక్కడే వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆ క్వారంటైన్లను ఇకపై 100 మంది హౌస్‌ సర్జన్లు పర్యవేక్షించబోతున్నారు. ఇప్పటి వరకు కరోనా బాధితులను తరలించడానికి మూడు అంబులెన్సులు ఉండేవి. ఇప్పుడు మరో మూడు అంబులెన్సులను కూడా బాధితులకు సేలందించేందుకు సిద్ధం చేశారు.   

కఠినంగా కర్ఫ్యూ
సాక్షి, మచిలీపట్నం: జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలవుతోంది. కరోనా పాజిటివ్‌గా నమోదైన వ్యక్తి మృతి చెందినట్టుగా ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో పాజిటివ్‌ కేసు వెలుగు చూసిన చిలకలపూడి చుట్టుపక్కల రెడ్‌ జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో కర్ఫ్యూ ఆరురోజుల పాటు కొనసాగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. నగరంలో ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మిగిలిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను కఠినతరం చేశారు. ఈ ప్రాంతంలో ఆరు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.  

మంత్రి పేర్ని నాని పర్యవేక్షణ.. 
హాట్‌స్పాట్‌ ప్రాంతంలో కర్ఫ్యూ అమలు తీరును రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు, ఆర్డీఓ ఖాజావలి, డీఎస్పీ మహబూబ్‌ భాషాలు పర్యవేక్షించారు. మంత్రి నాని స్వయంగా హాట్‌స్పాట్‌ ప్రాంతంలో పర్యటించి ప్రజల్లో ధైర్యం నింపారు. చిలకలపూడి, సర్కార్‌తోట, నవీన్‌మిట్టల్‌కాలనీల్లో పోలీస్‌ వాహనంలో పర్యటించి ప్రజలతో నేరుగా మాట్లాడారు. ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బందిని సర్వే జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

రెడ్‌ జోన్‌ పరిధిలో 8 వేల ఇళ్లున్నాయని, రానున్న ఆరు రోజులు ఏ ఒక్కరూ ఇళ్లు విడిచి బయటకు రావద్దని, మీకు కావాల్సిన కూరగాయలు, పాలు ఉదయం ఆరు నుంచి తొమ్మిది, సాయంత్రం ఐదు నుంచి ఏడుగంటల మధ్యలో మీ ఇళ్ల వద్దకే పంపిస్తామన్నారు. పోలీస్, రెవెన్యూ, ఆరోగ్య, మున్సిపల్, రవాణా, ఆరీ్టసీ, ఎక్సైజ్, తదితర శాఖల సిబ్బందితో పాటు పాత్రికేయులు కూడా మిలటరీ సైనికుల్లా అవిశ్రాంతంగా కరోనా మహమ్మారిపై పోరాడుతున్నారంటూ కొనియాడారు.  

ఉదారత చాటుకోవాలి 
సూర్యారావుపేట: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరివిగా విరాళలు అందించేందుకు దాతలు ముందుకు రావాలని కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛంద సేవ సంస్థలు, దాతలు తమ దాతృత్వాన్ని చాటుకోవాలని కోరారు. ప్రజా భాగస్వామ్యంతోనే ఏ కార్యక్రమమైనా విజయవంతం కాగలదన్నారు.

ఇప్పటికే పలువురు దాతలు ముందుకు వచ్చి మేము సైతం అంటూ ఆర్థిక సహాయాన్ని అందించారని, వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. దాతలు నగదు, వస్తువు, నిత్యావసర సరుకుల రూపేణా విరాళాలు అందించవచ్చన్నారు. ఈ విరాళాలను చీఫ్‌ మినిస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌ (సీఎంఆర్‌ఎఫ్‌ ఏపీ), కలెక్టర్‌ పేరు మీద చెక్‌ లేదా డిమాండ్‌ డ్రాఫ్ట్‌ రూపంలో అందించవచ్చని వివరించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top