పట్టాలు ఇచ్చారు... లే అవుట్‌లు మరిచారు

Officers Negligence To Give Layouts For Poor People - Sakshi

ఇళ్ల స్థలాల సమస్య ఎప్పటికి పరిష్కారమయ్యేనో ?

15 సంవత్సరాలుగా  నిరీక్షిస్తున్న లబ్ధిదారులు 

సాక్షి, గూడూరు: అధికారుల నిర్లక్ష్యంతో పేదలు అవస్థలు పడుతున్నారు. చేనేత ఆధారిత గ్రామమైన కప్పలదొడ్డిలో అర్హులైన నేత కార్మికులు ఇళ్ల స్థలాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాదాపు 200 పైచిలుకు కుటుంబాలు నిలువ నీడ లేక అద్దె ఇళ్లల్లో బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. నివేశన స్థలాలను పంపిణీ చేయమని అనేక మార్లు గ్రామస్తులు ఆందోళనలకు దిగినా ప్రభుత్వాలు మాత్రం కనికరించడం లేదు. 

15 ఏళ్లుగా నిరీక్షణ...
గ్రామంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయమని గత 15 సంవత్సరాలుగా ప్రజలు కోరుతున్నారు. అయితే అప్పట్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం స్థలాన్ని సేకరించింది. గ్రామంలో హైస్కూల్‌ వెనుక భాగంలో 4.16 ఎకరాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే అప్పుడు ఎన్నికలు రావడం... లబ్ధిదారుల ఎంపిక పూర్తికాక పట్టాల పంపిణీ ఇవ్వలేదు.

2012లో పట్టాలు పంపిణీ
2009లో పెడన ఎమ్మెల్యేగా గెలిచిన జోగి రమేష్‌ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. వీరందరికీ 2012లో పట్టాల పంపిణీ చేశారు. అయితే ఆయన ముందస్తుగా రాజీనామా చేయడంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోయారు. దీంతో స్థలాల్లో తుమ్మ చెట్లు పెరిగి చిట్టడివిని తలపిస్తున్నాయి. 

ఇచ్చిన పట్టాలు రద్దు చేసిన టీడీపీ
అయితే 2012లో జోగి రమేష్‌ ఎమ్మెల్యేగా ఉండగా ఇచ్చిన పట్టాలను ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసింది. లబ్ధిదారుల జాబితాను మళ్లీ ఎంపిక చేయాలంటూ ఐదేళ్ల పాటు కాలయాపన చేసిన అప్పటి పాలకులు ఎన్నికలకు ఆరు నెలల ముందు హడావుడిగా పట్టాలు పంపిణీ చేశారు. ఎంపిక చేసిన 155 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఫొటో స్టాట్‌ కాపీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కానీ స్థలాలకు సంబంధించిన లే అవుట్‌ మాత్రం వేయలేదు. దీంతో  స్థలం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియని పరిస్థితి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top