
ఇకపై ‘టైగర్ రిజర్వ్’లో వాహనాలపై పన్ను
: నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యం (ఎన్‌ఎస్‌టీఆర్) లోకి రోడ్డు మార్గంలో ప్రవేశించే వాహనాలకు పర్యావరణ పన్ను విధించాలని అటవీ శాఖ నిర్ణయించింది.
హైదరాబాద్: నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యం (ఎన్‌ఎస్‌టీఆర్) లోకి రోడ్డు మార్గంలో ప్రవేశించే వాహనాలకు పర్యావరణ పన్ను విధించాలని అటవీ శాఖ నిర్ణయించింది. శ్రీశైలంలో భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాల నుంచి ఈ అభయారణ్యంలోని రోడ్డు మార్గం ద్వారానే వెళ్తుంటారు. వాహనాల్లో వెళ్లే వారు ప్లాస్టిక్ సీసాలు, పాలిథిన్ కవర్లు వేయడంవల్ల పర్యావరణానికి మరీ ముఖ్యంగా వన్యప్రాణులకు నష్టం వాటిల్లుతోంది.
పెద్ద సంఖ్యలో సిబ్బందిని పెట్టి ఈ చెత్తను తొలగించే మెకానిజం అటవీశాఖకు లేదు. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణకు మెరుగైన చర్యలు తీసుకునేందుకు వీలుగా పర్యావరణ పన్ను విధించాలని ఆ శాఖ నిర్ణయించింది. టైగర్ ఫౌండేషన్‌ను సొసైటీల చట్టం కింద రిజిష్టర్ చేసి ఈ మార్గంలో వెళ్లే భారీ వాహనాల నుంచి రూ.20, లైట్ వెహికల్స్ నుంచి రూ.10 చొప్పున పన్ను వసూలు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.