సత్యసాయి తాగునీటి పథకానికి నిధుల గ్రహణం పట్టుకుంది. పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సత్యసాయి తాగునీటి పథకానికి నిధుల గ్రహణం పట్టుకుంది. పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా 157 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. మరోవైపు తమకు వేతనాలు, ఎరియర్స్ చెల్లించాలంటూ కార్మికులు సమ్మెకు దిగారు. సత్యసాయి తాగునీటి పథకం ద్వారా జిల్లాలో 157 గ్రామాలకు తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ తాగునీటి పథకాల నిర్వహణ బాధ్యతను ఎల్‌అండ్‌టీ సంస్థకు కాంట్రాక్టు పద్ధతిలో అప్పగించారు. అయితే ఈ సంస్థకు ఏడాదికాలంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. కాగా నిధుల విడుదలకు ముడుపుల బాగోతం అడ్డు పడుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు.
మొత్తం ఎనిమిది పథకాల పరిధిలో 135 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పంపు ఆపరేటర్లు, హెల్పర్లు, లైన్‌మెన్లు, వాచ్‌మెన్లుగా పనిచేస్తున్న వీరి కాంట్రాక్టును ఏడాదికోమారు కాంట్రాక్టు సంస్థ రెన్యూవల్ చేస్తోంది. జిల్లాలో సత్యసాయి చారిటబుల్ ట్రస్టు ఎనిమిది తాగునీటి పథకాలను నిర్మించింది. ఈ పథకాల నిర్వహణ, మరమ్మతు పనుల కాంట్రాక్టును ఎల్‌అండ్‌టీ సంస్థ చాలాకాలంగా నిర్వహిస్తోంది. గ్రామీణ నీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూఎస్) విభాగం ద్వారా కాంట్రాక్టు సంస్థకు ప్రతి నెలా నిధులు విడుదల కావాల్సి ఉంటుంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అనంతపురం, మెదక్ జిల్లాల్లో సత్యసాయి తాగునీటి పథకాల ద్వారా గ్రామాలకు నీటి సరఫరా అవుతోంది. అయితే కాంట్రాక్టు సంస్థ ఎల్ అండ్ టీ సంస్థకు ఏడాదికాలంగా ఆర్‌డబ్ల్యూఎస్ నిధులు విడుదల చేయడం లేదు. దీంతో ఐదు జిల్లాల్లో సుమారు రూ.30 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయినట్లు ఎల్ అండ్ టీ వర్గాలు చెప్తున్నాయి. కేవలం మెదక్ జిల్లాలోనే తమకు రూ.4.15 కోట్లు పెండింగ్ బిల్లు రావాల్సి వుందని ఎల్ అండ్ టీ వర్గాలు వెల్లడించాయి. ఏడాదికాలంగా బిల్లులు రాకున్నా ఈ యేడాది జూలై వరకు వేతనాలు చెల్లించిన ఎల్ అండ్ టీ ఆగస్టు వేతనాలు చెల్లించలేమంటూ చేతులెత్తేసింది. మరోవైపు కార్మికులకు ఎరియర్స్ చెల్లిస్తామంటూ కాంట్రాక్టు సంస్థ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది.
నిలిచిన సరఫరా
అటు వేతనం రాక, ఇటు ఎరియర్స్ లేకపోవడంతో కార్మికులు ఈ నెల 16వ తేదీ నుంచి జిల్లాలో నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో సత్యసాయి పథకం ద్వారా నీరు సరఫరా అయ్యే 157 గ్రామాల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. తమకు కనీసం రూ.2 కోట్లు మంజూరు చేస్తే వేతనాలు చెల్లిస్తామని ఎల్ అండ్ టీ వర్గాలు చెప్తున్నాయి. ‘పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఆలస్యం మూలంగా కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదల నిలిపివేసింది. మరో వారం రోజుల్లో నిధులు విడుదలయ్యే అవకాశం వుంది. ఆర్‌డబ్ల్యూఎస్ సిబ్బంది ద్వారా పథకం నిర్వహణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని’ గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ విజయప్రకాశ్ ‘సాక్షి’కి వెల్లడించారు. మరోవైపు బిల్లుల మంజూరులో ముడుపుల బాగోతం దాగి వుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ‘ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. తాజాగా నిధులు విడుదలయ్యే అవకాశం వున్నా కొందరు అధికారులు తమ వాటా తేల్చాలంటూ పట్టుబడుతున్నారు. దీంతో బకాయిల విడుదల, వేతనాల చెల్లింపులో ఆలస్యం జరుగుతోందని’ కార్మికులు ఆరోపిస్తున్నారు.