జీతం ఎగవేసిన సర్కార్‌ అల్లాడుతున్న చిరుద్యోగులు

No salaries to the Employees From Sate Govt - Sakshi

వేలాదిమంది ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు బంద్‌

ఎన్నికల ముందు రాజకీయ, స్వార్థ ప్రయోజనాల కోసం వందల కోట్ల నిధులు మళ్లించిన చంద్రబాబు

ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు చెల్లించలేక దుర్భరంగా మారిన  చిరుద్యోగుల జీవితాలు

1.25 లక్షల మంది రెగ్యులర్‌ ఉద్యోగుల ఫిబ్రవరి జీతాలూ నిలిపేసిన ప్రభుత్వం

ఉద్యోగుల జీపీఎఫ్‌ డబ్బుల ఉపసంహరణ పైనా ఆంక్షలు

సాక్షి, అమరావతి: వేలాది మంది చిరు ఉద్యోగుల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్, హోంగార్డులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంస్థలు, గురుకులాలు, సర్వశిక్ష అభియాన్, మోడల్‌ స్కూల్స్‌ ఉద్యోగులకు నాలుగు నెలల నుంచి వేతనాలను చెల్లించకుండా నిలుపుదల చేయించారు. ఎన్నికల ముందు తన రాజకీయ, స్వార్ధ ఆర్థిక ప్రయోజనాల కోసం వందల కోట్ల నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి మళ్లించేశారు. నాలుగు నెలల నుంచి వేతనాలు అందకపో వడంతో ఆ కుటుంబాల జీవనం దుర్భరంగా తయారయ్యింది. మేము ఏమి తినాలి..ఎలా బతకాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లా పాపలతో పస్తులుండలేక వేతనాల కోసం ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోందని వాపోతున్నారు. చివరకు ఆర్థిక శాఖలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకూ వేతనాలు ఇవ్వకుండా నిలుపుదల చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

నాలుగు నెలలుగా వేతనాల్లేవు..
రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యాసంస్థలు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, సర్వశిక్ష అభియాన్, మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా నాలుగు నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం వేతనాలు నిలిపేసింది. చివరకు పాఠశాలల పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకానికి కూడా నిధులు ఇవ్వకుండా బిల్లులను పెండింగ్‌లో పెట్టింది. ఎన్టీఆర్‌ వైద్య సేవలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం లేదు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) బిల్లులను కూడా చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అధికారులకు ఇప్పుడు అద్దె వాహనాలే ఉన్నాయి. స్వయం ఉపాధి కింద యువత బ్యాంకుల ద్వారా కార్లను కొనుక్కుని ప్రభుత్వ శాఖల్లో అద్దెకు తిప్పుతున్నారు. వీరికి కూడా నాలుగు నెలల నుంచి నెలనెలా చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకుండా నిలుపుదల చేశారు.

పోలీసులకు టీఏ, డీఏలు బంద్‌
రాష్ట్రంలో వేల సంఖ్యలో పనిచేస్తున్న పోలీసులకు గత ఎనిమిది నెలల నుంచి డీఏ, టీఏలను నిలుపుదల చేశారు. ఇటీవల ఆ ఎనిమిది నెలల టీఏ, డీఏలను విడుదల చేసినట్లే చేసి తిరిగి ఐదు నెలల డీఏ, టీఏ సొమ్ము రూ.70 కోట్లు ఖజానాకు తీసేసుకున్నారు.

కేంద్ర నిధులు రూ.5 వేల కోట్లు మళ్లింపు
కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం కేంద్రం విడుదల చేసిన రూ.5,000 కోట్ల నిధులను ఆయా పథకాలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించేసింది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను కూడా ఇతర అవసరాలకు మళ్లించేసింది. ఉప ప్రణాళిక పనులకు, అవసరాలకు నిధులను విడుదల చేయకుండా ఇతర అవసరాలకు ఆ నిధులను వినియోగిస్తున్నారు. 

రెగ్యులర్‌ ఉద్యోగులకు ఫిబ్రవరి జీతం బంద్‌
కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే.. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 1.25 లక్షల మంది రెగ్యులర్‌ ఉద్యోగుల ఫిబ్రవరి వేతనాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు. సకాలంలో వేతన బిల్లులను సమర్పించలేదనే సాంకేతిక కారణం చూపుతున్నారు. దీనిపై ఉద్యోగులు సమగ్ర ఆర్థిక నిర్వహణ సంస్థ (సీఎఫ్‌ఎంఎస్‌)ను ప్రశ్నిస్తే.. ఆ నిధులను ఇతర అవసరాలకు వినియోగించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారంటూ అధికారులు చెబుతున్నారని ఒక ఉద్యోగి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పరిషత్‌ సీఈవోతో సహా అక్కడ పనిచేసే ఉద్యోగులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా, మండల పరిషత్‌ల ఉద్యోగులకు వేతనాలు అందకపోవడం గమనార్హం. మార్చి గడిచినా రెగ్యులర్‌ ఉద్యోగులకు కూడా ఇంకా ఫిబ్రవరి వేతనాలు చెల్లించలేదంటే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి తీరు ఎలా ఉందో అర్దం అవుతోందని ఆ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. 

రూ.30 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌
ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎంపిక చేసిన రాజకీయ పరమైన, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు చెందిన బిల్లులను మాత్రమే చెల్లిస్తున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, వారి నేతలకు చెందిన బిల్లుల చెల్లింపునకు మాత్రమే ఆర్థిక శాఖకు సీఎం అనుమతి ఇస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి.  సాధారణంగా చెల్లించాల్సిన అన్ని రకాలు కలిపి కొన్ని లక్షల బిల్లులకు చెందిన రూ.30 వేల కోట్ల బిల్లులను చెల్లించవద్దంటూ ముఖ్యమంత్రి నిలుపుదల చేయించినట్లు సమాచారం. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌కు విలువ లేకుండా సీఎం చెప్పినట్లుగా ఆర్థిక శాఖ అధికారులు నడుచుకోవడాన్ని అధికార యంత్రాంగం తప్పుపడుతోంది.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిరోజూ ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడుతూ తనకు కావాల్సిన వారికి, తనకు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలకు మాత్రమే నిధులు విడుదల చేయించడం గమనార్హం. కోడ్‌ ఉన్నందున అధికారులతో ఎటువంటి సమీక్షలు నిర్వహించరాదని తెలిసినా.. ముఖ్యమంత్రి శుక్రవారం ఆర్థిక శాఖలోని ముగ్గురు అధికారులను తన ఇంటికి పిలిపించుకుని సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశమయ్యింది సీఎంవో, ఆర్థిక శాఖలోని ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని,  దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎందుకు స్పందించడం లేదో అర్ధం కావడం లేదని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు.  

కాన్పు కోసం మంగళసూత్రం తాకట్టు
దేవదాయ శాఖలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. దీంతో ఒక ఉద్యోగి తన భార్య కాన్పునకు డబ్బులేకపోవడంతో ఆమె మంగళ సూత్రం తాకట్టు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది.

పిల్లల పాలు, ఫీజులకు డబ్బుల్లేవు
రెగ్యులర్‌ పోలీసులతో సమానంగా పనిచేస్తున్న హోంగార్డుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. వారికి ఇచ్చే వేతనాలే చాలా తక్కువ. అలాంటి వారికి మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో ఇంటి అద్దె, పాలు, పిల్లల ఫీజులు వంటి నెలనెలా చేయాల్సిన చెల్లింపులకు డబ్బులేక నానా అవస్థలు పడుతున్నారు.పిల్లల పెళ్లిళ్లు ఇతర సొంత అవసరాల కోసం ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్‌ నిధులను ఉపసంహరించుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతివ్వడం లేదు. కంట్రిట్యూటరీ పెన్షన్‌ పథకం (సీపీఎస్‌) కింద ఉద్యోగుల వాటాను వారి వేతనాల నుంచి మినహాయించుకున్న ప్రభుత్వం.. ఆ సొమ్మును సంబంధిత నిధికి జమ చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించేసింది. 2017–18కు సంబంధించిన రూ.200.23 కోట్లను సీపీఎస్‌ నిధికి ప్రభుత్వం జమ చేయలేదని ‘కాగ్‌’ పేర్కొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top