
పది రోజులు ఎక్కడీ మగాడు ?
‘‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా యూపీఏ ప్రభుత్వం ప్రకటన చేసి పది రోజులైంది. ఇంతకాలం నిద్రావస్థలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆయన ఒక్కడే సమైక్యాంధ్ర కోసం మాట్లాడిన మగాడని పలువురు అనటం విడ్డూరం. పది రోజులేమయ్యాడు ఈ మగాడు?’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ధ్వజమెత్తారు.
సాక్షి, ఖమ్మం: ‘‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా యూపీఏ ప్రభుత్వం ప్రకటన చేసి పది రోజులైంది. ఇంతకాలం నిద్రావస్థలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆయన ఒక్కడే సమైక్యాంధ్ర కోసం మాట్లాడిన మగాడని పలువురు అనటం విడ్డూరం. పది రోజులేమయ్యాడు ఈ మగాడు?’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. రాఘవులు శనివారం ఖమ్మం జిల్లా పార్టీ ప్లీనరీ సమావేశంలో మాట్లాడారు. సీడబ్ల్యూసీ సమావేశం, కాంగ్రెస్ వార్‌రూం సమీక్ష, సోనియాగాంధీ చర్చల్లో ఉన్న సీఎం అప్పుడు వారు చెప్పినట్లు తల ఊపి ఇప్పుడు ఉనికి కోసమే ప్రకటనలు చేస్తున్నారని రాఘవులు విమర్శించారు. ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం కుట్రలో భాగమేనన్నారు. ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి రాహుల్‌గాంధీని ప్రధానిని చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు, ఓట్లు, సీట్లు తప్ప మరేది కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం లేదని తూర్పారబట్టారు.
జార్ఖండ్‌లో ముక్తి మోర్చా, బీహార్‌లో నితీష్‌కుమార్‌లతో చర్చలు జరపటం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయటం కాంగ్రెస్ స్వార్థ ప్రయోజనాలకోసమే అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు తాము అడ్డుకాదని ఉత్తరం రాసిన టీడీపీ, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు నక్కజిత్తుల వ్యవహారం చేస్తూ ఏ ఎండకాగొడుగు పడుతున్నారని విమర్శించారు. అన్ని పార్టీలు రాష్ట్ర విభజనకు అనుకూలమే అని ప్రకటించాయని.. సీపీఎం నాడు, నేడు విభజనను వ్యతిరేకిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కావాలని అన్న చిరంజీవి, రూ. 4 లక్షల కోట్లు ఇస్తే చాలని చంద్రబాబు చెప్పటాన్ని బట్టి వారు సమైక్యవాదులో కాదో అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు.
ఆయా అంశాలపై స్పష్టతనివ్వాలి...
తెలంగాణ విభజన జరిగితే హైదరాబాద్‌లో ఉండే ఉద్యోగులు, వ్యాపారుల పరిస్థితి ఏమిటి? నీటి పంపిణీ ఏవిధంగా చేస్తారు? పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తే ముంపుకు గురయ్యే గిరిజనుల పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు కట్టటం వల్ల గిరిజనులు ముంపుకు గురికాకుండా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడినంత మాత్రాన దళితుల, గిరిజనుల, కార్మికుల సమస్యలు పరిష్కారం కావని, వాటి పరిష్కారం కోసం మళ్లీ పోరాటాలు చేయాల్సిందేనన్నారు. భద్రాచలం డివిజన్‌పై ఎవరికి అనుకూలమైన విధంగా వారు మాట్లాడుతున్నారని, రాష్ట్రం ఏర్పడినా భద్రాచలం ఖమ్మం జిల్లాలోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం, ఏర్పాటు అవుతున్న తర్వాత కూడా టీఆర్‌ఎస్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోందని రాఘవులు తప్పుపట్టారు. ఇరు ప్రాంతాల నాయకులు చేస్తున్న రాజకీయాల మూలంగా ఉద్యోగులు, విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. చిన్న రాష్ట్రాలు ఏర్పడితే ముందుగా లాభపడేది భారతీయ జనతా పార్టీ అని చెప్పారు.