
సాక్షి, నిడదవోలు : 2009 పునర్విభజనలో ఏర్పడిన కొత్త నియోజకవర్గం ఇది. డెల్టా ముఖద్వారం నిడదవోలు పట్టణం గతంలో కొవ్వూరు నియోజకవర్గంలో ఉండేది. దీనిని కేంద్రంగా చేసుకుని పెనుగొండ నియోజకవర్గంలోని పెరవలి, తణుకు నియోజకవర్గంలోని ఉండ్రాజవరం మండలాలను కలిపి ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆవిర్భవించి పదేళ్లయినా ఈ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉంది. పదేళ్లపాటు ఇక్కడ అధికారం చెలాయించిన టీడీపీ నేతలు ఈ ప్రాంత పురోగతికి చేసింది శూన్యమనే చెప్పాలి.
ఘన చరిత్ర
పురాతన పట్టణం నిడదవోలు. నిరవజ్జపురం, నిరవజ్జప్రోలు అనే పేర్లతో పూర్వం ఇది ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణాన్ని మొదట చాళుక్యులు పాలించారు. అనంతరం వీరు కాకతీయులతో వియ్యం అందుకోవడంతో వారు కొంతకాలం పాలించారు. వీరి కాలంలో శిల్ప కళ అభివృద్ధి చెందింది. గతంలో తవ్వకాలలో బయటపడిన సుందర విగ్రహాలు కాకతీయ చరిత్రకు నిదర్శనం.
ఆధ్యాత్మిక శోభ
ఈ పట్టణం పురాతన ఆలయాలకు ప్రసిద్ధి. చినకాశిరేవులో సుమారు 30 ఆలయాలు ఉన్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం కోట సత్తెమ్మ ఆలయం ఇక్కడే కొలువైంది. రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తారు. ఏడాదికి రూ.కోటి పైనే ఆదాయం వస్తుంది. చర్చిపేటలో వందేళ్ల చరిత్ర గల కృపాధార లూథరన్ దేవాలయం, కురేషియా పెద మసీదులు ఇక్కడి ప్రజల మతసామరస్యానికి ప్రతీకలు.
భౌగోళిక స్వరూపం
నియోజకవర్గం 282.92 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. తూర్పున∙గోదావరి, పడమట గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం, ఉత్తరాన కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం, దక్షిణాన తాడేపల్లిగూడెం మండలం ఉన్నాయి. నిడదవోలు పురపాలక సంఘం ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది.
వ్యవసాయ ఆధారితం
డెల్టా ముఖద్వారం కావడంతో ఇక్కడ వ్యవసాయమే ప్రధాన ఆధారం. ప్రస్తుతం 36,500 ఎకరాల్లో వరి, 1500 ఎకరాల్లో అరటి, కంది, పసుపు, జామ, కోకో, ఆకుకూరలు, పూల తోటలు సాగవుతున్నాయి.
టీడీపీని గెలిపించినా..
నియోజకవర్గం ఏర్పడ్డాక రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో బూరుగుపల్లి శేషారావు టీడీపీ తరఫున, జి.శ్రీనివాసనాయుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. స్వల్ప ఆధిక్యంతో శేషారావు గెలిచారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ బూరుగుపల్లి శేషారావు వైపే ప్రజలు మొగ్గుచూపారు. పదేళ్లపాటు ఇక్కడ ప్రజాప్రతినిధిగా కొనసాగిన శేషారావు నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యం. పైగా అవినీతి ఆరోపణల్లో పీకల్లోతు కూరుకుపోయిన ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
పునర్విభజనకు ముందు..
పునర్విభజనకు ముందు నిడదవోలు మండలం, పట్టణం కొవ్వూరు నియోజకవర్గంలో ఉండేవి. 1999లో జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉండేవి. ఆ సయమంలో 15 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యాయి. ఈ సమయంలో కొవ్వూరు నియోజవర్గం నుంచి పోటీ చేసిన ప్రస్తుత వైఎస్సార్ సీపీ రాష్ట్ర సలహామండలి సభ్యులు జీఎస్ రావు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రాజకీయాల్లో జీఎస్ రావు నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల్లో బలమైన నాయకుడిగా ఉన్నారు. వైఎస్సార్ సీపీని విజయ తీరాల వైపు నడిపిస్తున్నారు.
ప్రధాన సమస్యలు
. పట్టణంలో తాడేపల్లిగూడెం వెళ్లే రోడ్డులోని రైల్వే గేటు ప్రధాన సమస్య. ఆర్వోబీ లేకపోవడంతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఆర్వోబీ నిర్మాణానికి జనవరిలో శంకుస్థాపన చేసినా.. పనులు ప్రారంభం కాలేదు. . పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై బ్రిటిష్ హయాంలో నిర్మించిన పురాతన వంతెన గతేడాది కుప్పకూలింది. ఫలితంగా చిన కాశిరేవు, కైలాసభూమికి వెళ్లడానికి భక్తుల అవస్థలు వర్ణనాతీతం.
. సమిశ్రగూడెం పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై బ్రిటిష్ హయాంలో నిర్మించిన పురాతన వంతెనకు కాలం చెల్లింది. మరో బ్రిడ్జి నిర్మాణానికి పంపిన ప్రతిపాదనలు అటకెక్కాయి.
. పట్టణ ప్రజలకు గోదావరి నీళ్లు తాగే అదృష్టం లేకపోయింది. కళ్ళ ముందు గోదావరి జలాలు వెళుతున్నా.. పాలకుల తీరు వల్లే ఈ దుస్థితి నెలకొంది.
∙ పట్టణంలో ఆటో నగర్ ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చి నెరవేర్చలేదు.
∙ పెరవలి మండలంలో గత ఎన్నికల్లో టీడీపీ నేతలు ఇచ్చిన బస్టాండ్ నిర్మాణం హామీ కూడా అటకెక్కింది.
బలమైన శక్తిగా వైఎస్సార్ సీపీ
ప్రస్తుతం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలమైన శక్తిగా ఎదిగింది. జనాదరణ పొందుతూ ముందుకు దూసుకుపోతోంది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి.శ్రీనివాసనాయుడు పార్టీ కార్యక్రమాలతో ఇప్పటికే ప్రజలతో మమేకమయ్యారు. అన్ని వర్గాలను కలుపుకుంటూ బలమైన క్యాడర్‌తో ప్రచారంలో ముందున్నారు. శ్రీనివాసనాయుడు 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వైఎస్సార్‌కు అత్యంత ఆప్తులైన జీఎస్‌రావు తనయుడు కావడంతో ప్రజల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సారి విజయావకాశాలు ఆయనకే ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ ప్రతిష్ట మసకబారింది. ఆ పార్టీని అంతర్గత విభేదాలు వేధిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావుపై అవినీతి ఆరోపణలు రావడం, ఆయన గత రెండుసార్లు నియోజకవర్గానికి చేసిందేమీ లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
మండలాలు నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి
జనాభా : 2,60,928
పురుషులు 1,30,602
స్త్రీలు 1,30,326
ఓటర్లు : 1,94,270
పురుషులు 95,983
స్త్రీలు 98,270
ఇతరులు 17