ప్రత్యేక హోదా లేదు.. నిధులూ తేలేదు | Neither does the special status of funds | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా లేదు.. నిధులూ తేలేదు

Jan 23 2015 3:06 AM | Updated on Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదా లేదు.. నిధులూ తేలేదు - Sakshi

ప్రత్యేక హోదా లేదు.. నిధులూ తేలేదు

అభివృద్ధిపై ప్రచారం చేసుకోవడంలో ముందుండే రాష్ట్ర ప్రభుత్వం.. విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న ....

విభజన నిధులు రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం
రెవెన్యూ లోటుపై రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు నమ్మని కేంద్రం
హామీలు అమలు చేయాలని కేంద్రానికి సీఎస్ లేఖ

 
హైదరాబాద్: అభివృద్ధిపై ప్రచారం చేసుకోవడంలో ముందుండే రాష్ట్ర ప్రభుత్వం.. విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న నిధులు తెచ్చుకోవడంలో మాత్రం పూర్తిగా వెనుకబడింది. విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీల అమలుపై నోరుమెదపని చంద్రబాబు సర్కార్.. రావాల్సిన నిధులు రాబట్టడంలోనూ వైఫల్యం చెందింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. అయితే దానికి బదులుగా కొన్ని పథకాలకు గ్రాంటు రూపంలో కొంత, రుణం రూపంలో మరికొంత ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆ వర్గాలు చెప్పాయి. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి రూ. 24,350 కోట్ల రూపాయల సాయం అందించాలని రాష్ట్రం కోరింది. దీనిపై కూడా కేంద్రం పలు ప్రశ్నలు సంధించించి. వ్యయ వివరాలు పంపాలని కోరింది. ఆ వివరాలు పంపితే ఆయా ప్రాంతాల్లో జిల్లాకు కేవలం రూ. 75 కోట్లు మాత్రమే వస్తాయని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కేంద్రం నుంచి అందాల్సిన నిధులు, అమలు చేయాల్సిన విభజన హామీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిపెట్టకుండా.. ఎక్కువగా విదేశీ పర్యటనలతోనే కాలక్షేపం చేయడం వల్ల నిధులు రాబట్టడంలో వెనుకబడిపోయాయని ఉన్నతాధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


ప్రణాళికేతర రెవెన్యూ లోటుపై రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలను నమ్మని కేంద్రం కొర్రీల మీద కొర్రీలు వేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర అధికారులకు కేంద్రానికి సమాధానాలు చెప్పడమే సరిపోతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం పది నెలల కాలానికి రూ. 12,000 కోట్ల రెవెన్యూ లోటు, కేంద్ర అమ్మకం పన్ను పరిహారంగా రూ. 1,500 కోట్లు.. మొత్తం రూ. 13,500 కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు స్పందిస్తూ.. 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలు మాత్రమే రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే రాజధాని నిర్మాణానికి సహాయం విషయంలో కూడా సమగ్రమైన నివేదిక ఇస్తేనే నిధులు ఇస్తామని కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే. ఇక పారిశ్రామిక రాయితీలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సమానంగా ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిధుల దుబారాపై కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉత్పాదక వ్యయానికి నిధులు తగ్గించి రెవెన్యూ వ్యయానికి భారీగా వెచ్చించడమే కేంద్ర అసంతృప్తికి కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఏడు నెలలైనా పైసారాలేదు: సీఎస్

 విభజన జరిగి ఏడు నెలలు గడిచినా ఇప్పటి వరకూ కేంద్రం నుంచి గ్రాంటుగా గానీ, రెవెన్యూ లోటు భర్తీకి సంబంధించిగానీ రాష్ట్రానికి పైసా రాలేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఆర్.పి.వాఠల్‌కు లేఖ రాశారు. విభజన చట్టం సెక్షన్ 46 (2)లో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని పేర్కొన్నారని ఆ లేఖలో సీఎస్ గుర్తు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement