ఇంతింతై వృద్ధి చెందిన అనస్థీషియా

National Level Scientific Performance In Visakhapatnam - Sakshi

శస్త్రచికిత్సలో మత్తుమందు కీలకం

రక్షణ, శాస్త్రీయతకు ప్రాధాన్యం

కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.అర్జున

అంకోసాలో ప్రారంభమైన జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): శస్త్రచికిత్సలో ఎంతో కీలకమైన అనస్థీషియాలో అత్యాధునిక వైద్యవిధానాలు అందుబాటులోకి వచ్చాయని కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.అర్జున తెలిపారు. ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ అనస్థీషియాలజిస్ట్‌ విశాఖ పట్నం సిటీ బ్రాంచ్, కేజీహెచ్‌ అనస్థీషియా విభా గం, ఆంధ్ర వైద్య కళాశాల సంయుక్తంగా జిల్లా పరిషత్‌ వద్దనున్న అంకోసా సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ‘సురక్షిత మత్తువైద్యం’ వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. గతంతో పోల్చితే మత్తువైద్యంలో ఎంతో మార్పు వచ్చిందని చెప్పారు.

మత్తు వైద్యుడు తప్పనిసరి
అప్పుడే పుట్టిన శిశువు నుంచి వందేళ్ల వయసున్న వ్యక్తి వరకూ చేసే ఎటువంటి శస్త్ర చికిత్సకైనా మత్తు వైద్యుని అవసరం తప్పనిసరి అని సొసైటీ ప్రతినిధి డాక్టర్‌ కుచేలబాబు అన్నారు. గతంలో కంటే ప్రస్తుతం మత్తు వైద్యంలో రక్షణతో కూడిన శాస్త్రీయత పెరిగిందన్నారు. శస్త్ర చికిత్స చేయాల్సిన వ్యక్తి పూర్తి సమాచారాన్ని ముందుగా మత్తు వైద్యుడు సేకరించి, శస్త్రచికిత్స చేసే వైద్యునికి చేదోడువాదోడుగా ఆపరేషన్‌ థియేటర్‌లో ఉంటారని తెలిపారు. ఈ ప్రదర్శన ఈ నెల 9వ తేదీ వరకూ రోజూ మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుందని తెలిపారు.

ప్రత్యక్షంగా తెలియజేసేందుకే..
కేజీహెచ్‌ అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్‌ ఎ.సత్యనారాయణ మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పాటు సామాన్య ప్రజలకు అత్యాధునిక వైద్య పద్ధతులను ప్రత్యక్షంగా తెలియజేయడమే ప్రదర్శన ముఖ్యోద్దేశం అన్నారు. ప్రారంభోత్సవంలో డాక్టర్‌ శశిప్రభ, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.పద్మావతి తదితర వైద్యులు పాల్గొన్నారు.

అచ్చంగా ఆపరేషన్‌ థియేటర్‌లా..
శస్త్ర చికిత్స సమయంలో రోగి హార్ట్‌బీట్, రక్తంలో ప్రాణవాయువు నియంత్రణ, రక్తపోటు వంటి అంశాలను మత్తు వైద్యుడు ఏవిధంగా పరిశీలిస్తారో ఇక్కడి నిపుణులు వివరిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా కృత్రిమ ఆపరేషన్‌ థియేటర్‌ ఏర్పాటు చేశారు. ఈ గదిలోకి వెళ్తే మనం  ఆస్పత్రిలో ఉన్న ఆపరేషన్‌ థియేటర్‌లోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. గుండె శస్త్ర చికిత్సలు చేసే సమయంలో తీసుకునే జాగ్రత్తలను ప్రత్యక్షంగా తెలియజేస్తున్నారు. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే రోగికి ఆ సమయంలో ఎటువంటి ఆధునిక వైద్య సేవలు అందిస్తారో వివరంగా చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top