ఓటెత్తిన నందబాలగ

Nandabalaga ZP High School Conducted Elections For  Student leader - Sakshi

సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : ఓటుహక్కు వినియోగించేందుకు బారులు తీరారు. ఓటర్ల జాబితా చూసి ఎన్నికల అధికారి ఓట్లు అందించారు. బ్యాలెట్‌ పేపర్‌పై ఓటు వేయడంతో ప్రక్రియ ముగిసింది.. ఇటీవలే ఎన్నికలు ముగిశాక.. మళ్లీ ఈ ఎన్నికలేమిటా?.. అనుకుంటున్నారు కదూ.. ఇవి సార్వత్రిక ఎన్నికలు కావు.. వాటిని తలపించేలా నిర్వహించిన విద్యార్థి నాయకుని ఎన్నికలు. తెర్లాం మండలం నందబలగ జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థి నాయకున్ని ఎన్నుకొనేందుకు శుక్రవారం హెచ్‌ఎం విజయభాస్కర్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు  ఎన్నికలను నిర్వహించారు. రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగానే నందబలగ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థి నాయకున్ని ఎన్నుకొనేందుకు ఎన్నికలు జరిగాయి.

ప్రతి తరగతి నుంచి ఒకరిని, పాఠశాలకు సంబంధించి ఒక నాయకుడిని ఎన్నుకొనేందుకు సాధారణ ఎన్నికల మాదిరిగానే అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు వేయించడం, నామినేషన్ల ఉప సంహరణ, ఓటర్ల జాబితా (హాజరు రిజిస్టర్‌)ల ప్రచురణ, అభ్యర్థులకు గుర్తులను కేటాయించడం, బ్యాలెట్‌ పేపరు తయారు, బెండకాయ మార్క్‌తో అభ్యర్థుల గుర్తుపై బ్యాలెట్‌పై ఓటుముద్ర వేయడం వంటి ప్రక్రియలన్నీ విద్యార్థులతో చేయించారు. ఇదంతా పంచాయతీ, మండల పరిషత్‌ ఎన్నికల మాదిరిగా నిర్వహించడంతో విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ తరగతి, పాఠశాల నాయకులను ఎన్నుకున్నారు. ఓటింగ్‌ ప్రక్రియ ముగిసిన తరువాత ఓట్లను లెక్కించి విజేతల వివరాలు ప్రకటించి, విద్యార్థి నాయకులతో ప్రమాణం చేయిస్తామని పాఠశాల హెచ్‌ఎం విజయభాస్కర్‌ తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు ఎన్నికల విధానం, ఓటు వేయడం వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు ఏటా తమ పాఠశాలలో విద్యార్థి నాయకులను ఇదే పద్ధతిలో ఎన్నుకుంటామని ఆయన తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులంతా తమ సహకారం అందిస్తున్నారని హెచ్‌ఎం తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top