బెట్టింగ్‌ ప్రేరేపణే నా భర్తను బలిగొంది..

My husband Suicide in IPL Cricket Betting - Sakshi

చిల్లకల్లు స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సూసైడ్‌ నోట్‌

గండ్రాయి (జగ్గయ్యపేట) : ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగే తన భర్తను బలి తీసుకొందని, తన కుటుంబాన్ని రోడ్డున పడేసిందని మండలంలోని గండ్రాయి గ్రామానికి చెందిన దొండపాటి కరుణ చిల్లకల్లు పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి. దొండపాటి నరసింహారావు గ్రామంలోని వ్యవసాయ ఉత్పత్తుల కమీషన్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవల రైతుల నుంచి మిర్చి, పత్తి కొనుగోలు చేసిన రైతులకు ఇవ్వవలసిన రూ.3.70 లక్షలు తన ఖాతాలో ఉంచుకొన్నాడు. ఈ క్రమంలో గత నెల 29న ఐపీఎల్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా గ్రామానికి చెందిన పి అనిల్, జీ వెంకటేశ్వరరావు, ఎం. రాంబాబు, ఎం. సతీష్, వత్సవాయి మండలం పెద్దమోదుగుపల్లి గ్రామానికి చెందిన కళ్యాణ జగన్‌మోహన్, కనగాల గణపతి ప్రేరేపించి ఆ నగదును బెట్టింగ్‌ల్లో పెట్టించారు.

బెట్టింగ్‌లో నష్టపోవటంతోనే ఆత్మహత్య..
రైతులకు చెల్లించాల్సిన డబ్బులు బెట్టింగ్‌ల్లో నష్టపోవటంతో ఏ విధంగా ఇవ్వాలో తెలియక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అప్పుల బాధ తాళలేక ఈ నెల ఒకటిన ఆత్మహత్య చేసుకొన్నట్లు కుటుంబ సభ్యులు భావించగా, మూడు రోజుల క్రితం ఇంట్లోని సామానులను సర్దుతుండగా నరసింహారావు రాసిన సూసైడ్‌ నోట్‌ లభించింది. ఈ నోట్‌లో పైన తెలిపిన వారి ప్రోద్బలం, ప్రేరణతో రైతులకు చెల్లించాల్సిన డబ్బులు బెట్టింగ్‌ల్లో పెట్టి నష్టపోయానని, తన చావుకు వారే కారణమని, ఆ డబ్బులు వసూలు చేసి రైతులకు చెల్లించాలని నరసింహారావు ఆ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. దీంతో భార్య చిల్లకల్లు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఉన్న ఇల్లు, భూమిని సైతం గతంలోనే విక్రయించటం జరిగిందని, తన భర్త మరణంతో కుటుంబానికి అండ, ఆసరా లేకుండాపోయిందని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకొంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top