‘వారధి’పై ఆశలు ఏటిపాలు | Sakshi
Sakshi News home page

‘వారధి’పై ఆశలు ఏటిపాలు

Published Tue, Mar 4 2014 3:01 AM

mp harsha kumar is unfit for mp candidate

 అమలాపురం, న్యూస్‌లైన్ : కోనసీమ ప్రాంతానికి పదేళ్లుగా లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించిన అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్‌ను ‘ఇదిగో.. నేను  ఈ ప్రాంతానికి ఈ మేలు చేశాను’ అని నిర్దిష్టంగా చెప్పుకోలేని వైఫల్యం వెన్నాడుతోంది. బోడసకుర్రు-పాశర్లపూడిల మధ్య వైనతేయ పాయపై నిర్మిస్తున్న వంతెనను ఆదరాబాదరాగానైనా ప్రారంభింపజేసి, ఆ వైఫల్యాన్ని అధిగమించాలనుకున్న ఆయన ఆశలపై పురపోరు నోటిఫికేషన్ నీళ్లు చల్లింది. మంగళవారం జరగాల్సిన వంతెన ప్రారంభోత్సం మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నిలిచిపోయింది.
 
 216 జాతీయ రహదారిలో భాగంగా నిర్మిస్తున్న ఈ వంతెన పూర్తయితే తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి కృష్ణా జిల్లా పామర్రు వరకు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. అయితే వంతెన పూర్తిస్థాయిలో సిద్ధం కాకున్నా సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే  కేంద్ర ఉపరితల రవాణాశాఖ సహాయ మంత్రి సర్వే సత్యనారాయణతో ప్రారంభింపజేయాలని ఎంపీ హర్షకుమార్ ఆరాటపడ్డారు. రెండు వైపులా అప్రోచ్‌రోడ్లు, వంతెనపై సిమెంట్ రోడ్డు, పాశర్లపూడి వైపు 400 అడుగుల మేర వంతెనకు ఇరువైపులా రెయిలింగ్ నిర్మాణాలు ఇంకా పూర్తి కావలసి ఉంది. ఒకవైపు పనులు జరుగుతుండగానే.. మరోవైపు ప్రారంభోత్సవ శిలాఫలకం ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఉదయం పది గంటలకు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం, వెంటనే కోడ్ అమలులోకి రావడంతో వంతెన ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయడం అనివార్యమవుతోంది. త్వరలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ కూడ విడుదల కానుండడంతో.. ఇక కొత్త ప్రభుత్వ హయాంలోనే ఈ వంతెన ప్రారంభానికి నోచుకోనుంది.
 
 ఆరంభం నుంచి ప్రారంభం వరకూ వివాదాలే..
 ఈ వంతెన నిర్మాణం ఆది నుంచీ అవాంతరాలు, వివాదాలతోనే సాగింది. వంతెన డిజైన్ మార్చాలనే నిర్మాణం వల్ల వరదల సమయంలో గండ్లు పడే ప్రమాదముందనే ఆరోపణలు వినిపించాయి. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు. నిర్ణీత షెడ్యూలు ప్రకారం 2010 ఏప్రిల్ 25కు పూరి ్తకావాల్సిన నిర్మాణం నత్తనడకన సాగుతూ నాలుగేళ్లు ఆలస్యమైంది. నాలుగుసార్లు గడువు పెంచి గత ఏడాది సెప్టెంబరు నెలాఖరుకు పూర్తి చేయకుంటే నిర్మాణ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని  స్వయంగా కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఆదేశించినా ఫలితం లేక పోయింది. నిర్మాణం ఆరంభంలోనే పి-4 పియర్ నదిలోకి ఒరిగిపోయింది. కెంటలెడ్జ్ పద్ధతిలో దీనిని సరిదిద్దగా మరోసారి 23 పియర్ ఒరిగిపోయింది. రెండు, మూడు పియర్ల  నుంచి మూడు గర్డర్లు పడిపోయాయి. వంతెన నిర్మాణంలో సాంకేతిక లోపాల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని, అదనంగా రూ.20 కోట్లు ఇవ్వాలని నిర్మాణ సంస్థ గామన్ ఇండియా పేచీకి దిగడం వల్ల కూడా పనులు ఆలస్యమయ్యాయి.  వంతెనకు సామాజికవర్గాల వారీగా తమ నేతల పేర్లు పెట్టాలంటూ కోనసీమలోని పలు పార్టీలకు చెందిన నాయకులు డిమాండ్ చేయడం మరో వివాదానికి దారి తీస్తోంది.
 
 ఎంపీ వర్గీయుల దింపుడు కళ్లం ఆశలు
 అమలాపురం, న్యూస్‌లైన్ : వంతెన నిర్మించిన ఘనతను ఖాతాలో వేసుకోవాలనుకున్న ఎంపీ హర్షకుమార్ ఆశలకు ఎన్నికల కోడ్ గండి కొట్టినా.. ఆయన వర్గీయుల్లో ఇంకా దింపుడు కళ్లం ఆశలు మిగిలే ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా.. వంతెన ప్రారంభోత్సవానికి వచ్చిన ఢోకా లేదని, ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం ఆ కార్యక్రమం జరిగి తీరుతుందని వారు ప్రచారం చేస్తున్నారు. అనధికారికంగా కొబ్బరికాయ కొట్టయినా ఈ వంతెన నిర్మాణం ఘనతను తమ నాయకుడి ఖాతాలో వేసి తీరాలనుకుంటున్నట్టు సమాచారం. వారి ప్రయత్నాలకు ఎంపీ కూడా అభ్యంతరం చెప్పనట్టు తెలుస్తోంది. కాగా వంతెన ప్రారంభోత్సవానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ వస్తే అడ్డుకుని తీరుతామని కోనసీమ జేఏసీ ప్రకటించింది.
 
  సోమవారం అమలాపురం కాటన్ అతిథి గృహంలో చైర్మన్ వి.ఎస్.దివాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన బిల్లును లోక్‌సభలో పెట్టిన సమయంలో సీమాంధ్ర ఎంపీలపై  దాడి చేసిన వారిలో సర్వే కూడా ఉన్నారని, అలాంటి నేతతో వంతెనను ప్రారంభింపజేయడం అనుచితమని జేఏసీ అభిప్రాయపడుతోంది. సర్వే గనుక ప్రారంభించడానికి వస్తే మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు అమలాపురం గడియారస్తంభం సెంటర్ నుంచి బోడసకుర్రు వరకు నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. జేఏసీ కన్వీనర్ బండారు రామ్మోహనరావు, ప్రతినిధులు డాక్టర్ ఎస్.ఆర్.ఎస్.కొల్లూరి, యిళ్ల భక్తవత్సలం, మానే వెంకటేశ్వరరావు, అత్కూరి శరభరాజు, కరాటం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement