
అమలాపురంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగిన రైతులను పక్కకు ఈడ్చికెళుతున్న పోలీసులు
ప్రభుత్వానికి కోనసీమ జిల్లా రైతుల అల్టిమేటం
సాక్షి, అమలాపురం/పిఠాపురం: ‘రైతులను పట్టించుకోండి. పండించిన పంటకు ఇవ్వాల్సిన సొమ్మును 48 గంటల్లో ఇవ్వడి. రైతు పరిస్థితి అస్సలు బాలేదు. పురుగుల మందు తాగి చావాల్సిన దుస్థితి వచ్చింది. మీరే మమల్ని చంపేస్తున్నారు’ అంటూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం నల్లచెరువు గ్రామానికి చెందిన రైతు వర్రే నాగబాబు రెండు చేతులూ జోడిస్తూ వేడుకున్నారు. జిల్లాలో ఇలాంటి రైతులు వేలాదిగా ఉన్నారు. మే 9 నుంచి ధాన్యం బకాయిల చెల్లింపులు ఒకపైసా కూడా ఇవ్వలేదు. రబీ రైతులకు ఇంకా రూ.248.65కోట్ల వరకూ ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉంది. రబీ ధాన్యం అమ్మినా కూటమి ప్రభుత్వం సొమ్ము చెల్లించకపోవడంతో రైతులు రోడ్డున పడ్డారు.
అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసేందుకు వచ్చిన ఉప్పలగుప్తం, అమలాపురం, అయినవిల్లి, అల్లవరం మండలాల రైతులు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకున్నా వెనక్కి తగ్గలేదు. ధాన్యం సొమ్ము వెంటనే విడుదల చేయాలని, లేకుంటే తాము ఖరీఫ్ సాగు చేయలేమని, సాగు సమ్మె చేస్తామని హెచ్చరించారు.
అదేవిధంగా పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(పాడా) కార్యాలయం వద్ద కూడా ధాన్యం డబ్బులు చెల్లించాలని రైతులు ధర్నా చేశారు. రైతులు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా, సిబ్బంది తీసుకోలేదు. సమస్యను వివరిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.