‘అమ్మ ఒడి’కి తల్లి | "Mother, Mother odiki | Sakshi
Sakshi News home page

‘అమ్మ ఒడి’కి తల్లి

Jan 12 2015 7:02 AM | Updated on Sep 2 2017 7:36 PM

నాలుగు రోజులుగా బి.కొత్తకోట మండలంలోని శంకరాపురంలో రోడ్డుపై పడి ఉన్న 95 ఏళ్ల వృద్ధురాలి కథనంపై చిత్తూరు అమ్మ ఒడి సేవాశ్రమ నిర్వాహకులు స్పందించారు.

  • చిత్తూరు ఆశ్రమానికి తరలించిన నిర్వాహకులు
  • లభించని వృద్ధురాలి వివరాలు
  • బి.కొత్తకోట: నాలుగు రోజులుగా బి.కొత్తకోట మండలంలోని శంకరాపురంలో రోడ్డుపై పడి ఉన్న 95 ఏళ్ల వృద్ధురాలి కథనంపై చిత్తూరు అమ్మ ఒడి సేవాశ్రమ నిర్వాహకులు స్పందించారు. ఆదివారం వృద్ధురాలి దీనావస్థపై సాక్షిలో ప్రచురితమైన కథనం పలువురిని కలచివేసింది. ఆదివారం సాయంత్రం అమ్మ ఒడి సేవాశ్రమ వ్యవస్థాపకులు పి.పద్మనాభనాయుడు సిబ్బందితో కలిసి అంబులెన్స్‌లో శంకరాపురం చేరుకున్నారు. వృద్ధురాలితో మాట్లాడే ప్రయత్నం చేశారు. తడారిన గొంతులోంచి మాట పెగలకపోయినా బలవంతంగా అరిచింది.

    అంబులెన్స్‌లోకి చేర్చేం దుకు పైకి లేపబోతే వదలండంటూ సిబ్బంది చేతులను విదిలించింది. ఆస్పత్రికి తీసుకెళతామని చెబుతుంటే శరీరంలోని శక్తినంతటినీ కూడదీసుకుని రానంటూ మొండికేసింది. స్ట్రెచ్చర్‌పై పడుకోబెట్టి అంబులెన్స్‌లోకి ఎక్కిస్తుండగా ఒక దశలో కేకలు పెట్టింది. పాపం ఆ వృద్ధురాలు ఏం చెప్పాలని ప్రయత్నిస్తుందో, ఆమె గోడు ఎవరికీ అర్థం కాలేదు. చివరకు అంబులెన్స్‌లో చిత్తూరుకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ ప్రసాద్, అమ్మ ఒడి కో-ఆర్డినేటర్ ఎన్.షబీనాబేగం, సిబ్బంది కే.మణివణ్ణన్, ఆర్.ప్రకాష్, కేవీ.లోకేష్ ఉన్నారు.
     
    మేం చూసుకుంటాం..

    వృద్ధురాలికి ఏ ఇబ్బందీ లేకుండా తాము చూసుకుంటామని అమ్మ ఒడి వ్యవస్థాపకులు పి.పద్మనాభనాయుడు విలేకరులకు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితుల్లోని 66 మందిని ఆశ్రమంలో ఉంచామని, ఈమె 67 అని అన్నారు.
     
    లభించని వివరాలు..

    శంకరాపురంలో వదిలేసిన వృద్ధురాలి వివరాలు ఇప్పటికీ తెలియరాలేదు. శనివారం ఆమెది అనంతపురం జిల్లా తనకల్లుగా ప్రచారం జరిగింది. ఆదివారం ఏఎస్‌ఐ ప్రసాద్ వృద్ధురాలిని వివరాలు అడగ్గా కర్ణాటకలోని చేలూరు ప్రాంతమని ఒకసారి, కోటూరు అని మరోసారి చెప్పింది. దీంతో కచ్చితంగా ఏ ప్రాంతానికి చెందిందో తేలలేదు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement