ఇళ్లను మించిపోయిన తెలుపు రేషన్‌ కార్డులు

More Ration Cards Then Families In Vizianagaram - Sakshi

గత ప్రభుత్వ నిర్వాకంతో పెరిగిన కార్డుల సంఖ్య

జిల్లాలోని గృహాల కంటే తెలుపు రంగు కార్డులే ఎక్కువ

సాక్షి, బలిజిపేట (విజయనగరం): ప్రజా సాధికారిత సర్వే.. ఇంటింటా సర్వే... మరుగుదొడ్ల నిర్మాణ సమయంలో గ్రామాలు, పట్టణాలలో సర్వేలు... ఇలా ఎన్ని సర్వేలు నిర్వహించినా ఇళ్ల కంటే తెలుపు రంగు రేషన్‌కార్డులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో రేషన్‌కార్డుల మంజూరులో నియంత్రణ లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో నివాస గృహాలకు మించి రేషన్‌కార్డులు ఉన్నప్పటికీ.. ఎలా పుట్టుకొస్తున్నాయనే దానిపై అధికారులు స్పందించకపోవడం విశేషం. ఇల్లు ఒకటే ఉన్నా కార్డులు మాత్రం ఒకటి కంటే ఎక్కువగా ఉంటున్నాయి.

గత ప్రభుత్వం సంక్షేమ పథకానికి తెలుపు రేషన్‌కార్డు అర్హతగా నిర్ణయించడంతో లెక్కకు మించి తెలుపు రంగు కార్డులు సృష్టించబడ్డాయనే విమర్శలు విని పిస్తున్నాయి. తెలుపు రేషన్‌కార్డు కావాలంటే టీడీపీ ప్రభుత్వంలో 1100 నంబర్‌కు డయల్‌ చేసి చెప్పాల్సి రావడంతో స్థానికంగా అధికారుల ప్రమేయం లేకుండా పోయింది. అనర్హుడుకి కార్డు వచ్చినా దానిని తొలగించేందుకు అధికారులకు ఎటువంటి అధికారం లేకుండా పోయింది. దీంతో పదేసి ఎకరాలున్నవారికి కూడా తెలుపు కార్డులు మంజూరయ్యాయి. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వారి తల్లిదండ్రుల పేరు మీద కార్డులు పొందడం విశేషం. కార్డుదారులు మృతిచెందినా వారి కార్డులు తొలగించకపోవడం తదితర కారణాల వల్ల కార్డులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి.

తెలుపు రేషన్‌కార్డుకు అర్హులు..
గ్రామంలోనే నివాసముండాలి. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. ఇన్‌కమ్‌టాక్స్‌ పరిధిలోకి రాకూడదు. పెద్దపెద్ద వాహనాలు ఉండకూడదనే నిబంధనలున్నాయి. ఇన్ని నిబంధనలున్నా కార్డులు విపరీతంగా మంజూరయ్యాయి. అందుకు కారణం స్థానికంగా ఉండే అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే అని చెప్పుకోవచ్చు.

సంక్షేమ పథకాలకు తప్పనిసరి
ఇల్లు, పింఛన్, కార్పొరేషన్‌ రుణాలు పొందాలన్నా.. ఇతరత్రా ఎటువంటి సంక్షేమ పథకం అయినా పొందాలంటే తెలుపు రంగు రేషన్‌కార్డు ఉండాల్సిందే. దీంతో ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నవారు కూడా అప్పటికప్పుడు కార్డులో ఉన్న పేర్లు తొలగించుకుని కొత్తగా రేషన్‌కార్డులు పొందారు. ఒక దశలో భార్యాభర్తలు వేర్వేరుగా ఉన్నట్లు కూడా 1100కు డయల్‌ చేసి తెలుపు కార్డులు పొందిన సంఘటనలున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సన్న, చిన్నకారు రైతులకే కాకుండా భూస్వాములకు సైతం తెలుపు రేషన్‌ కార్డులు కేటాయింపులు జరగడం విశేషం.

అదనంగా ఉండవు 
రేషన్‌కార్డుకు ఆధార్‌ లింక్‌ అవుతుంది కనుక అదనపు కార్డులు అనేవి ఎక్కడా ఉండవు. కుటుంబాల సంఖ్య పెరిగినందున కార్డులు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌ విధానం అయినందున ఎక్కడా పొరపాట్లు జరిగే అవకాశాలు లేవు.
– సుబ్బరాజు, డీఎస్‌ఓ, విజయనగరం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top