పది లక్షల ఇళ్లు!

More than 3 lakh houses have been granted in two months with the initiative of the CM YS Jagan - Sakshi

త్వరలో కేంద్రానికి డీపీఆర్‌ పంపనున్న అధికారులు 

ముఖ్యమంత్రి చొరవతో రెండు నెలల్లో 3.83 లక్షలకుపైగా ఇళ్లు మంజూరు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ సొంత గూడు  కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం మేరకు వడివడిగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించి గృహ నిర్మాణశాఖ అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపకల్పనలో నిమగ్నమయ్యారు. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపి ప్రధాని ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని కోరనున్నారు. పీఎంఏవై ద్వారా రాష్ట్రానికి 10 లక్షల ఇళ్లు మంజూరవుతాయని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ పేదల ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో అక్టోబర్‌లో 1,24,624, నవంబర్‌లో 2,58,648 మొత్తం కలిపి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 3,83,272 ఇళ్లు రాష్ట్రానికి మంజూరు చేసిన విషయం తెలిసిందే. 

7.86 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఉన్నట్లు గుర్తింపు
రాష్ట్రంలో 7.86 లక్షల మంది లబ్ధిదారులకు సొంత ఇళ్ల స్థలాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ వెంటనే పక్కా ఇళ్లు మంజూరు చేసేలా గృహ నిర్మాణశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇళ్ల స్థలాలు లేని వారిని గుర్తించి ఉగాది నాటికి పంపిణీ చేసి దశలవారీగా నాలుగేళ్లలో నిర్మించి ఇవ్వనున్నారు. ఏడాదికి ఎన్ని ఇళ్లు మంజూరు చేయాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇళ్ల స్థలాల కోసం ఇప్పటికే గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వ భూమి లభ్యత లేని చోట ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి భూమి కొనుగోలు చేసేందుకు గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్త సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, భూసేకరణ, అభివృద్ధి కోసం దాదాపు రూ.11 వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top