మాంటిస్సోరి కోటేశ్వరమ్మ కన్నుమూత  | Montessori Koteswaramma Is No More | Sakshi
Sakshi News home page

మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత్రి కన్నుమూత

Jun 30 2019 11:08 AM | Updated on Jul 1 2019 3:38 AM

Montessori Koteswaramma Is No More - Sakshi

లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ మాంటిస్సోరి విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు, అభ్యుదయవాది, స్త్రీ విద్య, మహిళా సాధికారతకు విశేష కృషి చేసిన డాక్టర్‌ వి.కోటేశ్వరమ్మ (94) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయవాడ సమీపంలోని గోశాలలో కోనేరు వెంకయ్య, మీనాక్షి దంపతులకు 1925, మార్చి 5న కోటేశ్వరమ్మ జన్మించారు. తెలుగు సాహిత్యంలో డాక్టరేట్‌ చేసి నెల్లూరు, విజయవాడల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. మహిళలు చదువుకుంటేనే పురుషులతో సమానంగా రాణిస్తారన్న నమ్మకంతో 1955లో చిల్డ్రన్స్‌ మాంటిస్సోరి స్కూల్‌ను స్థాపించారు. ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను ఒప్పించి మరీ బాలికలను పాఠశాలలో చేర్పించేవారు. పది మందితో ప్రారంభమైన ఆ పాఠశాల క్రమంగా ప్రా«థమికోన్నత, ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలలుగా ఎదిగింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎడ్యుకేషన్, బయోటెక్నాలజీ, ఫిజియోథెరపీ వంటి కోర్సులూ ప్రారంభమయ్యాయి.

ఆమె విద్యా సంస్థల్లో చదివిన లక్షలాది మంది మహిళలు దేశ, విదేశాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారు. తన సేవలకు గుర్తింపుగా కోటేశ్వరమ్మ పలు అవార్డులు పొందారు. 1971లో బెస్ట్‌ టీచర్‌గా జాతీయ స్థాయి అవార్డు, 2017లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. మహిళా విద్యా సంస్థలను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు 2015లో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్ట్స్‌లో స్థానం పొందారు. కాగా.. కోటేశ్వరమ్మ భర్త వి.వి.కృష్ణారావు ఆంధ్రా లయోలా కళాశాల అధ్యాపకులుగా పనిచేశారు. ఆయన కొన్నేళ్ల కిందట మృతి చెందారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె డాక్టర్‌ శశిబాల విజయవాడలోనే ప్రసూతి వైద్యురాలిగా పనిచేస్తున్నారు. చిన్న కుమార్తె షీలారంజని అమెరికాలో ఉంటున్నారు. ప్రస్తుతం మాంటిస్సోరి విద్యా సంస్థలను మనుమడు అవిరినేని రాజీవ్‌ నిర్వహిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement