కరెన్సీ కటకట!

Money Shortage in Kurnool ATMs - Sakshi

ఎవరైనా డిపాజిట్‌ చేస్తేనే ఇతరులకు చెల్లింపు  

ఆర్‌బీఐ నుంచి నగదు సరఫరా బంద్‌

ఎస్‌బీఐ కరెన్సీ చెస్ట్‌ల మూత జిల్లాలో ఆర్థిక సంక్షోభం

కర్నూలు(అగ్రికల్చర్‌): నగదు కొరత అన్ని వర్గాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ నగదు సరఫరాను పూర్తిగా తగ్గించింది. ప్రభుత్వ పథకాల అత్యవసరాలకు మినహా డబ్బు రావడం లేదు. ఎవరైనా  డిపాజిట్‌ చేస్తే తప్ప ఇతరులకు చెల్లింపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. డిపాజిట్‌ చేసే వాళ్లు లేకపోవడం, చెల్లింపులు ఎక్కువగాఉండటంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది.  ఈ నేపథ్యంలో  బ్యాంకర్లతో ఖాతాదారులు గొడవలకు దిగుతున్నారు. నగదు సమస్యతో ఆంధ్రా, ఎస్‌బీఐ తదితర బ్యాంకులకు చెందిన ఏటీఎంలు మూత పడ్డాయి.  జిల్లాలో ఎస్‌బీఐకి దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఒక ఆర్‌బీఐ కరెన్సీ చెస్ట్‌ ఉండేది. ఆలూరు, పత్తికొండ, డోన్, బనగానపల్లె, కోవెలకుంట్ల, బేతంచెర్ల, ఆళ్లగడ్డ ఆత్మకూరు, నందికొట్కూరు, శ్రీశైలం కరెన్సీ చెస్ట్‌లు మూతపడ్డాయి.

ప్రభుత్వం నాలుగో విడత రుణమాఫీ నిధులను రైతుల ఖాతాలకు జమ చేస్తోంది. కష్టాల్లో కూరుకపోయిన రైతులు నగదును విత్‌డ్రా చేసుకునేందుకు పోతే డబ్బు లేదని వెనక్కిపంపుతున్నారు. నగదు సమస్యతో 70 శాతం నుంచి 80 శాతం వరకు చెల్లింపులు ఆగిపోయాయి. ఉద్యోగులకు మార్చి నెల వేతనాలు ఏప్రిల్‌ మొదటి వారంలోనే బ్యాంకు ఖాతాలకు జమ అయినప్పటికీ నగదు కొరత కారణంగా తీసుకోలేని పరిస్ధితి ఏర్పడింది. ఏటీఎంల్లో డబ్బులు పెట్టడం బాగా తగ్గిపోయింది. పెట్టినా రెండు గంటల్లోనే ఖాళీ అవుతున్నాయి. బ్యాంకులకు పోతే నగదు లేదు... తర్వాత రండనే సమాధానం వస్తోంది. జిల్లాలో నగదు సమస్యలను ఎప్పటికప్పుడు ఎల్‌డీఎం.. రిజర్వు బ్యాంకు దృష్టికి తీసుకెళ్తున్నా ఫలితం ఉండడం లేదు.  పెద్ద నోట్లు రద్దు తర్వాత ఆర్‌బీఐ నుంచి నగదు రావడం 70 శాతం తగ్గిపోయింది.

‘పసుపు–కుంకుమ’కు డబ్బుల్లేవ్‌..
సాధారణ ఎన్నికల నేపథ్యంలో నగదు నిల్వలన్నీ రాజకీయ పార్టీలు, నాయకులకు వెళ్లిపోయాయి. దీంతో పోలింగ్‌కు ముందు నగదు సమస్య ఏర్పడింది. పోలింగ్‌ తర్వాత పసుపు–కుంకుమ రూపంలో నగదు కొరత ఉత్పన్నమైంది. పోలింగ్‌కు ముందు రాజకీయ పార్టీల నేతలు నగదును బ్లాక్‌ చేయడంతో కరెన్సీ కొరత ఏర్పడింది.  మొదటి, రెండో విడత పసుపు–కుంకుమ చెక్‌లకు నగదు చెల్లించేందుకు ఆర్‌బీఐ నుంచి ప్రత్యేకంగా నగదు వచ్చింది. అందువల్ల ఇబ్బంది కలుగలేదు. మూడో విడత చెక్కులకు నగదు సమస్య మరింత ఎక్కువైంది.   

ఏటీఎంల మూత...
పెద్దనోట్లు రద్దు నాటి పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. జిల్లాలో ప్రధాన బ్యాంకులైన ఎస్‌బీఐ, ఆంధ్రబ్యాంకుతో సహా ఏ బ్యాంకులోనూ డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచికి అనుసంధానంగా దాదాపు 57 ఏటీఎంలు ఉన్నాయి. ఒక్కో ఏటీఎంలో రోజుకు రూ.20 లక్షలు పెడుతారు. ఇందుకు రూ.11.40 కోట్లు అవసరం అవుతాయి. బ్యాంకుకు డిపాజిట్‌ల రూపంలో రోజుకు రూ.2 కోట్లు కూడా రావడంలేదు. దీంతో ఏటీఎంల నిర్వహణ ప్రశ్నార్థకం అవుతోంది.  కెనరా బ్యాంకు, ఏపీజీబీ, ఇండియన్‌ బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ ఇండియా  తదితర బ్యాంకులు నగదు సమస్యతో సతమతం అవుతున్నాయి. మామూలుగా అయితే బ్యాంకుల్లో 100 కోట్లకు పైగా నగదు ఉండాలి. జిల్లాలోని 445 బ్రాంచీల్లోను రూ.10 కోట్లు నగదు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 485 ఏటీఎంలు ఉండగా 50 శాతం మూత పడ్డాయి.  

డిజిటల్‌ లావాదేవీలు నామమాత్రమే...
పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలకు ప్రధాన్యం ఏర్పడింది. డిజిటల్‌ లావాదేవీలను ప్రొత్సహించాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ నగదు సరఫరాను తగ్గించేసి.. ఏకంగా కరెన్సీ చెస్ట్‌లనే జిల్లాకు ఒకటి, రెండు మినహా అన్నిటిని మూసేసింది. డిజిటల్‌ లావాదేవీలు నామమాత్రం కావడం... నగదు లావాదేవీలు ఎక్కువగా ఉండటం, నగదు ప్లో తగ్గిపోవడంతో సమస్యలు పెరుగుతున్నాయి. జిల్లాలో జన్‌ధన్‌ ఖాతాలు 6.93 లక్షలు, ఎస్‌బీ ఖాతాలు 40 లక్షలకు పైగా ఉన్నాయి. డిజిటల్‌ లావాదేవీలు 5 శాతం కూడా లేకపోడం గమానార్హం. బ్యాంకు ఖాతాలకు ఆన్‌లైన్‌ సదుపాయం లేకపోవడంతో ఇది సాధ్యం కాని పనిగా మారిపోయింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top