ఈ ఉద్యోగం నాకొద్దు!

Mistakes in Voter Lists TDp Leaders Threats to BLOs - Sakshi

ఓటరు జాబితాల్లో లొసుగులు

ఉద్యోగులపై అధికార పార్టీ         నేతల ఒత్తిళ్లు

వివరాలు బయటకు చెబితే బెదిరింపులు

నలిగిపోతున్న బీఎల్‌ఓలు

అనంతపురం, ఆత్మకూరు: ఓటరు జాబితా పరిశీలన.. సవరణ.. మార్పులు.. చేర్పులు.. ఈ ప్రక్రియ చిరుద్యోగులకు ప్రాణసంకటంగా మారింది. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు వినాల్సి వస్తుండటం.. ప్రతిపక్ష పార్టీకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉద్యోగం వదులుకోవడం నయమనుకునే పరిస్థితి తలెత్తుతోంది. ఇందుకు ఆదివారం ఆత్మకూరు మండలంలో చోటు చేసుకున్న ఉదంతమే తాజా ఉదాహరణ. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషన్‌ శని, ఆదివారాల్లో బూత్‌ స్థాయిల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసింది. ఆత్మకూరు మండలం బి.యాలేరు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన బూత్‌ స్థాయి ప్రత్యేక శిబిరంలో ఆదివారం ఓటరు జాబితాతో వీఆర్వో డంకన్న సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్‌సీపీకి బలమైన ఓటు బ్యాంక్‌ ఉన్న గ్రామం కావడంతో ఓటరు జాబితాలో పలువురిని తప్పించేలా అధికార పార్టీ నాయకులు పావులు కదిపారు. ఈ నేపథ్యంలోనే వీఆర్వో డంకన్నపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకెళ్లి తమ పనిచక్కబెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

దీంతో తమ అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోలింగ్‌బూత్‌ వద్దకు చేరుకుని జాబితా పరిశీలనకు అడిగారు. జాబితా వారి చేతిలో పడితే తొలగింపులు బయటపడతాయని భయపడిన వీఆర్వో డొంకతిరుగుడు సమాధానాలతో దాటవేసే ప్రయత్నం చేశారు. ఓటరు నమోదు కోసం తాము దరఖాస్తులు ఇచ్చినా ఎందుకు చేర్చలేదంటూ పలువురు నిలదీశారు. అనర్హులను ఓటర్లుగా చేర్చారంటూ మండిపడ్డారు. దీంతో డంకన్న అసహనానికి లోనయ్యారు. ‘మీరు చెబితే నేను చేయాలా? చేసిది లేదు. అంటూ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి, వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో పలువురు అతడిని చుట్టుముట్టి తమకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోతే ఎలా అంటూ అడ్డుకున్నారు. ఆ సమయంలో తనకు ఈ ఉద్యోగం వద్దని, వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటూ చెప్పి బైక్‌ను వెనక్కు తిప్పుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాప్తాడు నియోజకవర్గంలో చిరుద్యోగులపై టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు ఈ ఘటన పరాకాష్టగా నిలుస్తోంది. మంత్రి సునీత ప్రోద్బలం, టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు రూపొందించిన ఓటరు జాబితా బయటపెడితే గ్రామస్తులు తమను గ్రామాల్లో తిరగనివ్వరనే భయం చిరుద్యోగులను వెన్నాడుతోంది. అందుకే జాబితాను బయటపెట్టలేని స్థితిలో ఇలా పలాయనం చిత్తగిస్తున్నట్లు తెలుస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top