మీ మంత్రి.. మీ ఇంటికి.. 

Minister Mekapati Gautam Reddy Is Touring The Constituency Level In An Innovative Way To Solve The Problems - Sakshi

నేరుగా ప్రజల ముంగిటికి అధికార గణంతో మంత్రి గౌతమ్‌రెడ్డి 

హెల్ప్‌లైన్‌కు  ఫిర్యాదు చేసిన వారి ఇంటికి మంత్రి

అక్కడికక్కడే తక్షణ పరిష్కారాలు 

ప్రతి ఫిర్యాదుపై సత్వర స్పందన

సమస్యల పరిష్కారంలో గ్రామ వలంటీర్ల భాగస్వామ్యం

ఎంజీఆర్‌ హెల్ప్‌లైన్‌ ఫిర్యాదులపై మంత్రి నిరంతర సమీక్ష

పెంచలయ్య అన్నా మీ సమస్య ఏంటి.. ఎంజీఆర్‌ హెల్ప్‌లైన్‌కు మీ ఫిర్యాదు అందింది. మీ సమస్యలు చెబితే అన్నింటినీ విని పరిష్కరిస్తాను. 
 –  మేకపాటి గౌతమ్‌రెడ్డి, మంత్రి 
అయ్యా మా ఇల్లు పూర్తిగా పాడైపోయింది. పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఇబ్బందులు పడుతున్నాం. వర్షాలు వస్తే మరింత ఇబ్బందిగా ఉంటుంది. మా గూడును మీరే చూసి న్యాయం చేయండయ్యా.                             – పెంచలయ్య, వెన్నవాడ ఎస్సీ కాలనీ
 వెంటనే మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆ ఇంటిని పరిశీలించారు. డీఈ  నటరాజన్‌ ఇంటి పరిస్థితి చూశారుగా వెంటనే ఇంటికి వర్క్‌ ఆర్డర్‌ సిద్ధం చేయించండి. కొద్ది రోజుల్లోనే పనులు మొదలు కావాలి. ఇక పెంచలన్న ఇబ్బంది పడకూడదని మంత్రి అధికారులకు  ఆదేశాలు ఇచ్చారు.

సాక్షి, నెల్లూరు:  రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సమస్యల పరిష్కార దిశగా వినూత్న రీతిలో నియోజక వర్గంలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా బిజీగా ఉంటూ రాష్ట్రమంతా పర్యటనలు, రాజధానిలో సమీక్షలు ఇలా హడావుడిగా ఉన్న క్రమంతో తాను ప్రాతినిథ్యం వహించే ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇటీవలే ఎంజీఆర్‌ (మేపాటి గౌతమ్‌రెడ్డి) హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. హెల్ప్‌లైన్‌కు నియోజకవర్గంలో స్థానిక సమస్యలు మొదలుకొని వ్యక్తిగత సమస్యల వరకు అన్నింటిని ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు స్వభావాన్ని బట్టి వెంటనే పరిష్కరిస్తున్నారు. భూ వివాదాలు మినహా మిగిలిన అన్ని సమస్యలను గంటల వ్యవధిలోనే పరిష్కరించే దిశగా కసరత్తు చేస్తున్నారు. హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేస్తే వెంటనే ఫిర్యాదు రిజిస్టర్‌ అయి మంత్రి కార్యాలయ సిబ్బంది సంబంధిత అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లి పరిష్కారం అయ్యే వరకు దానిని పరిశీలిస్తారు. ఈ క్రమంలో ప్రధానంగా విద్యుత్, రోడ్డు, పారిశుధ్యం, ఇంటి సమస్యలు, పశు వైద్య తదితర సమస్యలు వెంటనే పరిష్కారం కాగా భూ వివాదాలు మాత్రం రెవెన్యూ అధికారుల ద్వారా పరిష్కరించడానికి కసరత్తు చేస్తున్నారు.

అక్కడికక్కడే పరిష్కారాలు 
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గురువారం ఆత్మకూరు నియోజకవర్గంలోని పర్యటించారు. వాశిలి, వెన్నవాడలోని ఎస్సీ కాలనీల నుంచి హెల్ప్‌లైన్‌కు శిథిలావస్థకు చేరిన ఇళ్లతో ఇబ్బంది పడుతున్నామని ఫిర్యాదులు అందాయి. ఈక్రమంలో మంత్రి నేరుగా ఆయా గ్రామాలకు వెళ్లి ఫిర్యాదు చేసిన వారితో మాట్లాడి వారి ఇబ్బందులను  క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంత్రితో పాటు రెవెన్యూతో సహా అన్ని విభాగాల అధికారుల బృందాన్ని తీసుకెళ్లి వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. గురువారం వాశిలి, వెన్నవాడ గ్రామాలతో పాటు ఆత్మకూరులోని నెల్లూరుపాళెంలో ఉన్న ముస్లిం కాలనీలో మంచి నీటి సమస్య ఎక్కువగా ఉందని స్థానిక మహిళలు చెప్పడంతో నేరుగా వాళ్లింటికి వెళ్లి నీటి ఎద్దడి లేకుండా చూడడంతో పాటు ప్రత్యేకంగా ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఇక ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పడు స్థానిక గ్రామ రచ్చబండ వద్ద కూర్చొని గ్రామంలోని ఇతర సమస్యలపై ప్రజలను అడిగి తెలసుకుంటున్నారు. అధికార యంత్రాంగం అంతా కూడా మంత్రితో ఉండటంతో సమస్యలు వేగంగా పరిష్కారం అవుతున్నాయి.  

వలంటీర్లను వారధిగా.. 
హెల్ప్‌లైన్‌కు వచ్చే ఫిర్యాదుల పరిష్కరంలో వలంటీర్లను వారధిగా వినియోగిస్తున్నారు. సంబంధిత వలంటీరుకు ఆయా వార్డులు, గ్రామాల్లోని సమస్యల వివరాలను తెలిపి అధికారుల పరిష్కరించే దిశగా వలంటీర్లు భాగస్వాములై పని చేసేలా చేస్తున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హెల్ప్‌లైన్‌కు ఇప్పటి వరకు 153 ఫిర్యాదులు అందాయి. వీటిలో 70 శాతం ఫిర్యాదులు భూసంబంధిత వివాదాలు, ఇప్పటి వరకు వీటిలో 45 ఫిర్యాదులను పరిష్కరించారు. 

పనిచేయడం మా బాధ్యత 
ఎన్నో ఆశలతో ఓట్లు వేసిన ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించడం మా బాధ్యత. హడావుడిగా రెండు రోజులు వచ్చి నాలుగు గ్రామాలు తిరిగి వెళ్లితే ప్రయోజనం ఏమీ ఉండదు. సమస్యలు యథాతథంగానే ఉంటాయి. ప్రజలు కూడా రెండు సార్లు అడిగి ఇక వదిలేస్తారు. మన పనితీరు అలా ఉండకూడదు. ప్రతి సంక్షేమ పథకం ప్రతి లబ్ధిదారుడుకి అందాలి. రాష్ట్రంలో నా నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం కోసమే ఫిర్యాదుదారుల ఇళ్లకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తున్నాను. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ.  
– మేకపాటి గౌతమ్‌రెడ్డి, మంత్రి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top