మిల్లర్ల మాయాజాలం  | Sakshi
Sakshi News home page

మిల్లర్ల మాయాజాలం 

Published Tue, Dec 31 2019 9:27 AM

Millers Fraud In Grain Purchases - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రభుత్వం ధాన్యం మద్దతు ధర పెంచింది. కళ్లాల్లోనే కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చింది. అందుకు తగ్గట్టుగా రవాణా చార్జీలను సైతం భరిస్తామని ప్రకటించింది. నిధులు కూడా అందుబాటులో ఉంచింది. ఇన్ని సదుపాయాలు కలి్పంచినా కొనుగోళ్లు మాత్రం అనుకున్నంత వేగంగా జరగడం లేదు. దీని వెనుక కారణాలు గమనిస్తే మిల్లర్ల మాయాజాలం కనిపిస్తోంది. ఒడిశా నుంచి ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ ధాన్యంగా కొనుగోలు కేంద్రాల వద్ద నమోదు చేయిస్తున్నారు. తమ సొంత మీటర్లతో తేమ శాతం ఎక్కువ ఉందని చూపించి రైతుల నుంచి ధాన్యం తీసుకోవడం లేదు. తాము చెప్పిన ధరకు ఇస్తే కొనుగోలు చేస్తామంటూ మెలిక పెడుతున్నారు. నూకలు ఎక్కువ వస్తున్నాయని 1075 రకం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. అదే ధాన్యాన్ని తక్కువ ధరకు, అదనంగా బరువుతో అదే మిల్లర్లు ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం రెండు అడుగు లు ముందుకు వేస్తే.. మిల్లర్లు మూడు అడుగులు వెనక్కి లాగుతున్నారు. వాతావరణ పరిస్థితులు కూడా కాసింత భయపెట్టేలా ఉండడంతో అన్నదాతలు భయపడుతున్నారు. రైతులు పండగను సంతోషంగా జరుపుకోవాలంటే ధాన్యం కొనుగోళ్లు సత్వరం జరగాలి.

మద్దతు ధర పెంచినా.. 
గతంలో సాధారణ వరి రకం క్వింటా రూ. 1750 ఉన్న ధరను రూ. 1815కు పెంచారు. గ్రేడ్‌ ఎ రకం గతంలో క్వింటా రూ. 1770ఉండగా ఇప్పుడది రూ. 1835కి పెంచారు. గతంలో కొనుగోలు కేంద్రం నుంచి మిల్లు వరకు మాత్ర మే రవాణా చార్జీలు చెల్లించేవారు. అది కూడా పూర్తిగా చెల్లించలేదు. ఐదేళ్లకు సంబంధించి రూ. 84కోట్లు చెల్లించకుండా గత ప్రభుత్వం చేతులేత్తేసింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పాత రవాణా బకాయిలను చెల్లించేందుకు వైఎ స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ముందుకొచ్చింది. రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల వరకు, కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుల వరకు రవాణా చార్జీలను కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రకటించింది. రైతుల వద్దనే నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. కొనుగోలు చేసిన ధాన్యానికి ఎప్పటికప్పుడు చెల్లింపులు చేసేందుకు నిధులు కూడా అందుబాటులో ఉంచింది. ఆశించిన స్థాయిలో కొనుగోలు జరగడం లేదు. మిల్లర్లు పాత అలవాట్లు మార్చుకోకపోవడంతో ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. నూక శాతం విషయంలో ప్రభుత్వం ఆంక్షలేవీ పెట్టకపోయినా మిల్లర్లు రైతులను ట్రాప్‌ చేసి ప్రభుత్వం ప్రక టించిన మద్దతు ధర కన్నా తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. రూ. 1100కు, 1200కు సాధారణ రకాలను ఇలా కొనుగోలు చేస్తున్నారు.

మిల్లర్ల దందా.. 
ఓ వైపు ఇక్కడి రైతులను మోసగిస్తున్న కొందరు మిల్లర్లు మరో వైపు ఒడిశా నుంచి ధాన్యం తీసుకువచ్చి వాటినే కొనుగోలు చేసినట్టు మాయ చేస్తున్నారు. సోమవారం పోలాకి మండలంలో విజిలెన్స్‌ అధికారులు జరిపిన దాడుల్లో ఒడిశా నుంచి తీసుకొచ్చి నిల్వచేసిన ధాన్యం గుట్టు రట్టు అయింది. రైతుల నుం కొనుగోలు చేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న తేమ శాతం మీటర్లతోనే కొలవాలి. కానీ కొందరు మిల్లర్లు తమకు అనుకూలమైన మీటర్లను ఏర్పాటు చేసుకుని తేమ శాతం ఎక్కువ ఉందని చూపించి అభ్యంతరాలు పెడుతున్నారు. జిల్లాలో రైస్‌ మిల్లుల వద్ద అధిక సంఖ్యలో ధాన్యం లోడులు కనిపిస్తున్నాయి. పిరమిడ్ల మాదిరిగా కుప్పలేసి ఉన్నాయి. ఒకవైపు రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు జరగకుండా, మరోవైపు మిల్లుల వద్ద అధిక సంఖ్యలో ధాన్యం ఉన్నాయంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు.  వాటిలో చాలా వరకు ఒడిశా నుంచి తీసుకొచ్చినవేనని తేటతెల్లమవుతుంది. మరోవైపు ధా న్యం కొనుగోలులో వెనుకబాటుకు సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌)బియ్యంను సివిల్‌ సప్లయిస్‌ అధికారులు తీసుకోవడం లేదని, తమ వద్ద ఉన్న ధాన్యం ఆడించడం ద్వారా బియ్యాన్ని తీసుకుంటేనే కొత్తగా పీపీసీ కేంద్రాల నుంచి ధాన్యం తీసుకోగలమంటూ సాకు చూపిస్తున్నారు. వాస్తవంగా అటు ఎఫ్‌సీఐ, ఇటు సివిల్‌ సప్లయిస్‌ అధికారులు ఎప్పటికప్పుడు సీఎంఆర్‌ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకు తగ్గ గోదాములు అందుబాటులో ఉన్నాయి.

కలెక్టర్‌ హెచ్చరిక  
గత కొన్ని రోజులగా జిల్లాలో మందకొడిగా జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్‌ జె.నివాస్‌ ఆరా తీశారు. క్షేత్రస్థాయి నుంచి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. మిల్లర్ల సమస్యను తెలుసుకుంటూనే వారి అక్రమ బాగోతాన్ని కూడా ఆధారాలతో సేకరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తేమ శాతం మీటర్లను కాదని తమ సొంత మీటర్లతో తేమ శాతం కొలుస్తున్నారని,  అందులో ఎక్కువ చూపించి రైతుల నుంచి తక్కువ ధరకు, అదనపు బరువుతో కొనుగోలు చేస్తున్నారని గుర్తించారు. అంతేకాకుండా 1075 రకంలో నూకలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి పీపీసీల వద్ద తీసుకోకుండా నేరుగా రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని గమనించారు. ఒడిశా ధాన్యాన్ని తీసుకొచ్చి పీపీసీల వద్ద మా యాజాలం చేస్తున్న విషయాన్ని ఆరా తీశారు. వీటిన్నింటిని దృష్టిలో ఉంచుకుని సోమవారం మిల్లర్లతో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ జె.నివాస్‌ బహిర్గతం చేశారు. జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసునని, రైతులకు అన్యాయం చేయవద్దని సీరియస్‌గా హెచ్చరించారు.

 

Advertisement
Advertisement