అన్న చేతి ముద్ద

Midday Meals Scheme New Menu Start in Prakasam - Sakshi

పౌష్టికాహార లోపం నివారణే లక్ష్యంగా ‘జగనన్న గోరుముద్ద’ ప్రారంభం

విద్యార్థి ఇష్టపడేలా రుచికరమైన మధ్యాహ్న భోజన మెనూ

వారానికి మూడు రోజులు చిక్కీ హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

ఒంగోలు: చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కన్నా మధ్యాహ్న భోజనం (జగనన్న గోరుముద్ద) తినేవారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. దీనివల్ల పౌష్టికలోపం చిన్నారుల్లో కనబడుతోంది. ఈ నేపథ్యంలో పిల్లలు భోజనం పట్ల ఇష్టాన్ని కనబరిచేలా మెనూలో మార్పులు తీసుకువచ్చారు. అంతే కాకుండా చిక్కీ (వేరుశనగ ఉండ లేదా చెక్క)ను భోజనంతో పాటు పిల్లలకు ఇస్తే వారిలో పౌష్టికాహార లోపాన్ని నివారించగలమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావించారు. దీంతో బడ్జెట్‌ భారం అయినా భరించేందుకు సిద్ధం చేశారు. అందులో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో నూతన మెనూతో మధ్యాహ్నభోజనం వడ్డించారు. శుచి, శుభ్రతతోపాటు రుచికరమైన భోజనం ‘‘రా...రమ్మని’’ పిలుస్తుందంటూ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

చిక్కీకి అదనంగా నిధులు  
సంక్రాంతి సెలవులకు ముందు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రోజుకు రూ. 4.48 చెల్లించేవారు. కానీ తాజాగా వంటచేసేవారికి రూ. 43 పైసలు అదనంగా పెంచారు. అంతే కాకుండా వారానికి మూడు రోజులు చిక్కీ వండి వడ్డించేందుకుగాను రూ. 1.69 పైసలు అదనంగా కేటాయించారు. వారానికి మూడు రోజులు మాత్రమే చిక్కీ ఇస్తున్నందువల్ల ఒక చిక్కీ కోసం కేటాయిస్తున్న రు3.38 కేటాయించాలి. దీంతో విద్యార్థి కోసం కేటాయించే మొత్తం రూ. 6.60కు చేరుకుంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థికి సంక్రాంతి సెలవులకు పూర్వం రూ. 6.71 చెల్లించేవారు. ఇప్పుడు చిక్కీ వండి వడ్డించేందుకుగాను 40 పైసలు, చిక్కీకోసం రోజుకు రూ. 1.69 చొప్పున రెండో రోజులకు ఒక చిక్కీకి గాను రూ. 3.38 చెల్లించనున్నట్లు ఉత్తర్వులు జారీచేశారు. 

పెరిగిన భారం ఇలా
జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 1,21,550 మంది విద్యార్థులు నమోదయ్యారు. అయితే వారిలో 97798 మంది పాఠశాలకు హాజరుకాగా వారిలో 81489 మంది మధ్యాహ్నభోజనం తీసుకున్నారు. అదే విధంగా ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి 68324 మంది విద్యార్థులు నమోదు కాగా వారిలో 37477 మంది హాజరయ్యారు. వారిలో 31717 మంది తిన్నారు. 9,10 తరగతులకు సంబంధించి 40,008 మంది ఉండగా వారిలో 24,493 మంది మంగళవారం పాఠశాలలకు హాజరయ్యారు. వారిలో 19580 మంది భోజనం చేశారు. మొత్తంగా 2,29882 మందికిగాను 1,59,768 మంది పాఠశాలలకు హాజరుకాగా వారిలో 1,32,786 మంది భోజనం చేశారు. సంక్రాంతి సెలవులకు ముందు హాజరైన విద్యార్థుల్లో భోజనం చేసేవారి శాతం 88 శాతంగా ఉండేది. కానీ మంగళవారం పాఠశాలలు పునఃప్రారంభమైన రోజు 91.47 శాతం మంది భోజనం తీసుకున్నారు. మెనూ ఎలా ఉంటుందో అనుకుంటూ ఇంటినుంచి భోజనం తెచ్చుకుంటున్న విద్యార్థులు సైతం రేపటినుంచి తాము సైతం అంటూ పేర్కొంటున్నారు. దీని ప్రకారం ప్రతిరోజూ ఒక్కో ప్రాథమిక పాఠశాలోని విద్యార్థికి రూ. 2.12, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు రూ. 2.09 చొప్పున పెంచారు. ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకోసం 47.3 శాతం నిధులు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకోసం 31.14 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కేటాయిస్తుంది.

మధ్యాహ్న భోజన మెనూ పరిశీలన
తాజా మెనూతో ప్రారంభమైన జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం)ను పరిశీలనలో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారి వి.యస్‌ సుబ్బారావు మంగళవారం ఆలకూరపాడు పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. పిల్లలతోపాటు తాను సైతం భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక పలు మండలాల్లో మండల విద్యాశాఖ అధికారులు, ఆయా పాఠశాలల యాజమాన్య కమిటీలు కూడా భోజనాన్ని తనిఖీచేసి శుచితోపాటు రుచి కూడా పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.  

మా ఇంటిలో కూడా ఇంత చక్కటి అన్నం దొరకదేమో
మా ఇంటిలో కూడా మా పిల్లలకు ఇంత చక్కటి మెనూతో అన్నం పెట్టలేమేమో. విద్యతో పాటు, నాణ్యమైన భోజనాన్ని ప్రతి రోజూ అందిస్తూ తీపి కూడా మా పిల్లలకు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు.కె. రాజేశ్వరి, విద్యార్థి తల్లి,మున్నంవారిపాలెం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top