మేరీమాత ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు | Merimata strengthening the arrangements for festivals | Sakshi
Sakshi News home page

మేరీమాత ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

Nov 29 2013 12:53 AM | Updated on Sep 2 2017 1:04 AM

గుణదల మేరీమాత ఆలయంలో ఫిబ్రవరిలో మేరీమాత ఉత్సవాలు నిర్వహించనున్నట్లు విజయవాడ కథోలిక పీఠం రెక్టర్ ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప తెలిపారు.

విజయవాడ, న్యూస్‌లైన్ : గుణదల మేరీమాత ఆలయంలో ఫిబ్రవరిలో మేరీమాత ఉత్సవాలు నిర్వహించనున్నట్లు విజయవాడ కథోలిక పీఠం రెక్టర్ ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప తెలిపారు. గుణదలమాత ఆలయ ఆవరణలోని కమ్యూనిటీ హాలులో గురువారం సాయంత్రం ఉత్సవాలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చిన్నప్ప మాట్లాడుతూ ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో ఉత్సవాలు నిర్వహిస్తామని, రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

పటిష్టమైన ప్రణాళికతో తిరునాళ్లను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా కొండ ఎగువ భాగం నుంచి పలు ప్రదేశాల్లో తాత్కాలిక నీటి ట్యాంకులు సిద్ధం చేస్తామని చెప్పారు. భక్తులు క్రమపద్ధతిలో మేరీమాతను దర్శించుకునేందుకు బారికేడ్లు ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు.

ఆయా శాఖల అధికారులతో సంప్రదించి విద్యుత్, వైద్యం, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కథోలిక పీఠం కోశాధికారి ఫాదర్ ఎం.గాబ్రియేల్, ఎస్‌ఎస్‌సీ డెరైక్టర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, యూత్ సెంటర్ డెరైక్టర్ ఫాదర్ దేవకుమార్, ఫాదర్ కిషోర్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement