వ్యాపారి ఇంట్లో భారీ చోరీ
రసూల్‌పురా,న్యూస్‌లైన్: నగరంలో ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా దొంగలు పంజా విసురుతున్నారు. తాళాలు వేసివున్న ఇళ్లను టార్గెట్ చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ వ్యాపారి ఇంట్లో కిటికీగ్రిల్స్ తొలగించి రూ.13 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన కార్ఖనా పోలీసుస్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించింది. అదనపు సీఐ నాగయ్య వివరాల ప్రకారం..పీఆండ్‌టీ కాలనీ ఫ్లాట్‌నెం.2 లో నివసించే కె.సుమన్ వ్యాపారి. సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు.
దీన్ని గమనించిన దొంగలు నేరుగా ఇంటి తాళం పగులగొట్టకుండా కిటికీగ్రిల్స్ తొలగించి పడకగదిలోకి చొరబడ్డారు. కప్‌బోర్డులోని డ్రాలో ఉన్న రూ.13 లక్షల నగదు, సుమారు రూ. 2 లక్షలు విలువజేసే బంగారు నగలను అపహరించారు. మంగళవారం ఉదయం పెంట్‌హౌస్‌లో ఉండే పనిమనిషి కిటికీగ్రిల్స్ తొలగించి ఉండడాన్ని గమనించి వెంటనే ఫ్లాట్ యజమానికి సమాచారమిచ్చారు. ఆయన ఇంటికి చేరుకొని చోరీ జరిగిందని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.