వ్యవసాయూభివృద్ధికి చెరువులే ఆధారమని, చెరువులు జలకళతో నిండినిప్పుడే బంగారు పంటలు పండుతాయని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.
కరీంనగర్‌రూరల్/తిమ్మాపూర్ : వ్యవసాయూభివృద్ధికి చెరువులే ఆధారమని, చెరువులు జలకళతో నిండినిప్పుడే బంగారు పంటలు పండుతాయని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా జిల్లాలో 900 చెరువులను రూ.2వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఆదివారం ఆయన కరీంనగర్ మండలం బొమ్మకల్, తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామాల్లో చెరువుల్లో పూడికతీత పనులను జెడ్పీ చైర్‌పర్సర్ తుల ఉమ, కలెక్టర్ నీతూకుమారిప్రసాద్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమరుు బాలకిషన్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో చెరువుల్లో పూడిక పేరుకపోయిందన్నారు.
మిషన్ కాకతీయ కింద పూడిక తొలగింపుతో చెరువులన్నీ జలకళను సంతరించుకుంటాయని చెప్పారు. రైతులు స్వచ్చందంగా మట్టిని తీసుకెళ్లి పొలాల్లో పోసుకుంటే భూసారం పెరిగి పంటల దిగుబడి పెరుగుతుందన్నారు. గతంలో ప్రాజెక్టులు, బోర్లు, బావులు లేవని, చెరువుల కిందనే వ్యవసాయం సాగేదన్నారు. మూడేళ్లలో చెరువులన్నింటిని పునరుద్ధరించడం జరుగుతుందన్నారు. వచ్చే ఏడాది వేసవి నుంచి కరెంటు కోతలు ఉండవని, వ్యవసాయూనికి పగటిపూటనే తొమ్మిది గంటల కరెంటు ఇస్తామని తెలిపారు. ఆసరా పింఛన్లు, ఆహారభద్రత కార్డులు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
పింఛన్లు, కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని, అర్హతలుంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ... గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాజకీయ విభేదాలు విడిచిపెట్టి గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. చెరువుల పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మట్టిని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మిషన్ కాకతీయ ఎస్‌ఈ సురేష్‌కుమార్, కరీంనగర్, తిమ్మాపూర్ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.