పిల్లిని చంకలో పెట్టుకుని..ఊరంతా వెతికిన పోలీసులు | Medarametla Is A Manufacturing Hub Of Banned Gutka Products | Sakshi
Sakshi News home page

పిల్లిని చంకలో పెట్టుకుని..ఊరంతా వెతికిన పోలీసులు

Aug 24 2019 7:44 AM | Updated on Aug 25 2019 7:05 AM

Medarametla Is A Manufacturing Hub Of Banned Gutka Products - Sakshi

విలేకరులకు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్, పక్కన ఇతర పోలీసు అధికారులు 

టీడీపీ ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ నాయకులు ఇసుక, మట్టిని కూడా వదలకుండా అక్రమంగా విక్రయించి జేబులు నింపుకున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలు నిషేధిత ఖైనీ తయారీని సైతం వదల్లేదు. వాటిని తయారు చేసే అక్రమార్కులు రాష్ట్రం నలుమూలలకు సరఫరా చేసి అందిన కాడికి దండుకున్నారు. అక్రమార్కులకు టీడీపీ నాయకులు తమ అండదండలు అందించి ఇప్పటికీ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఇటీవల వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక నిషేధిత గుట్కాలపై పోలీసులు కన్నెర్ర చేశారు. అన్ని ప్రాంతాల్లోని షాపుల్లో తనిఖీలు చేపట్టి జిల్లా వ్యాప్తంగా పలువురు వ్యాపారులను కటకటాల వెనక్కి నెట్టారు. చివరకు జిల్లా కేంద్రం ఒంగోలుకు కూతవేటు దూరంలో ఖైనీల తయారీ కేంద్రాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. పోలీసుల తీరు పిల్లిని చంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్లు ఉంది.

సాక్షి, మేదరమెట్ల: పారిశ్రామిక కేంద్రంగా వేలాది మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్న మేదరమెట్ల.. అక్రమ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా కూడా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. నిషేధిత పొగాకు ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మేదరమెట్ల రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకుంటోంది. స్పెషల్‌ బ్రాంచి పోలీసులు సమాచారం మేరకు మేదరమెట్ల పోలీసులు నిషేధిత ఖైనీ ఉత్పత్తుల తయారీ కేంద్రం గుట్టురట్టు చేశారు. ఈ వ్యవహారం అంతా ఓ టీడీపీ నేత గోడౌన్‌లో మూడేళ్ల నుంచి గుట్ట చప్పుడు కాకుండా నడుస్తున్నట్లు గుర్తించారు. చివరకు రూ.3 కోట్ల విలువైన ఖనీ తయారీ ముడి సరుకు, యంత్రాలను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌ శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన బలగాని ప్రసాద్‌ కొరిశపాడు మండలం మేదరమెట్లలోని పోకూరి హనుమంతురావుకు చెందిన మౌనిక పొగాకు గోడౌన్‌ను రెండేళ్ల కిందట అద్దెకు తీసుకున్నాడు. దాన్ని నిఖిత పొగాకు కంపెనీగా పేరు మార్చుకొని నిషేధిత ఖైనీ తయారు చేసే కేంద్రంగా మార్చాడు.


ఖైనీ తయారీకి వినియోగిస్తున్న ముడిసరుకు, యంత్రాలు

ఈ క్రమంలో గోడౌన్‌లో పొగాకు కంపెనీ పేరుతో ముడి సరుకులను తెచ్చి ఖైనీ ప్యాకెట్లు తయారు చేసి రాష్ట్రం నలుమూలలకు విక్రయిస్తున్నారు. స్పెషల్‌ బ్రాంచి హెడ్‌కానిస్టేబుల్‌ జిలానీ సమాచారంతో ఎస్పీ ఆదేశాల మేరకు అద్దంకి సీఐ అశోకవర్థన్, మేదరమెట్ల ఎస్‌ఐ బాలకృష్ణలు తమ సిబ్బందితో ఖైనీ తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించేందుకు వెళ్లారు. అప్పటికే నిర్వాహకుడు కేంద్రాలకు తాళం వేసి పరారైనట్లు తెలుసుకున్నారు. గోడౌన్‌ షట్టర్ల తాళాలు పగులగొట్టి పరిశీలించగా రూ.3 కోట్ల విలువైన ఖైనీ తయారీకి వినియోగించే ముడు సరుకు, యంత్రాలను పోలీసులు గుర్తించి సీజ్‌ చేశారు. గోడౌన్‌ యజమాని పోకూరి హనుమంతురావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పక్కాగా కూపీలాగి ఖైనీ తయారీ కేంద్రాన్ని గుర్తించడంలో సహకరించిన ఎస్‌బీ హెడ్‌కానిస్టేబుల్‌ జిలానీ, సీఐ, ఎస్‌ఐలను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్‌బీ డీఎస్పీ శ్రీరాంబాబు, సీఐ శ్రీకాంత్‌బాబు, దర్శి డీఎస్పీ ప్రభాకర్‌రావు, ఫుడ్‌సేఫ్టీ అధికారులు నాగశేషయ్య, సీహెచ్‌ లక్మీనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement