పోలీసులపై మట్కా మాఫియా దాడి

Matka mafia attack on Police At Ananthapur - Sakshi

ఇంట్లో బంధించి కర్రలతో చితకబాదిన వైనం 

పోలీసులు వచ్చిన బొలేరో వాహనానికి నిప్పు 

సీఐతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు 

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘటన 

నిందితులంతా జేసీ అనుచరులే..

తాడిపత్రి/అనంతపురం సెంట్రల్‌: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మట్కా మాఫియా రెచ్చిపోయింది. జేసీ అనుచరుడైన మట్కా నిర్వాహకుడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపైనే ఏకంగా దాడికి దిగి చితకబాదారు. ఇంట్లో బంధించి కర్రలతో ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. పోలీసులు వచ్చిన వాహనానికి సైతం నిప్పు పెట్టి తగలబెట్టారు. ఈ ఘటనలో సీఐతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఇటీవల తాడిపత్రిలోని పడమటి గేరికి చెందిన మట్కా నిర్వాహకుడు కట్లపొడి సాధిక్‌ను, వైఎస్సార్‌ జిల్లా ఎర్రముక్కపల్లెకు చెందిన మట్కా రామయ్య, ప్రొద్దుటూరుకు చెందిన పూజల చౌడయ్య, లక్ష్మయ్య, జమ్మలమడుగు పట్టణానికి చెందిన వెంకటదశావరెడ్డి, ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తికి చెందిన శ్రీనివాసులతో పాటు మరికొందర్ని కడప పోలీసులు ఈనెల 21న అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో మట్కా నిర్వాహకుడైన సాధిక్‌.. తమ డాన్‌ రషీద్‌ పేరును వెల్లడించాడు. రషీద్‌ టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు.

ఈ నేపథ్యంలో రషీద్‌ను విచారించేందుకు వైఎస్సార్‌ జిల్లా కడపకు చెందిన సీఐ హమీద్‌ఖాన్‌.. కానిస్టేబుళ్లు నరేంద్రరెడ్డి, సిద్ధారెడ్డి, ప్రసాద్, డ్రైవర్‌ ప్రదీప్‌తో కలిసి ఆదివారం సాయంత్రం తాడిపత్రికి చేరుకున్నారు. స్థానిక విజయనగర్‌కాలనీలోని అతని ఇంటి వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు దాదాపు 20 మంది పోలీసులపై దాడికి తెగబడ్డారు. ఇంట్లో బంధించి కర్రలతో చితకబాదారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న పోలీసు వాహనం(బొలేరో)కు నిప్పంటించారు. ఈ దాడిలో సీఐ హమీద్‌తో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. తీవ్రంగా గాయపడ్డ పోలీసులను తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే సీఐ హమీద్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయన్ని అనంతపురంలోని సవేరా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

స్థానిక పోలీసులపై నమ్మకం లేదా?
సాధారణంగా ఒక జిల్లాకు చెందిన పోలీసులు మరో జిల్లాకు చెందిన నిందితులను అదుపులోకి తీసుకోవాలన్నా, వారిని విచారించాలన్నా స్థానిక పోలీసులకు సమాచారమిస్తారు. అయితే రషీద్‌.. జేసీ ప్రభాకర్‌కు సన్నిహితుడని తెలియడంతో స్థానిక పోలీసులకు సీఐ హమీద్‌ తాము వస్తున్నట్లు సమాచారమివ్వలేదని తెలిసింది. ఒకవేళ ముందే సమాచారమిస్తే.. వారు తప్పించుకునే అవకాశం ఉందనే అనుమానంతో నేరుగా రషీద్‌ ఇంటికి కడప పోలీసులు వెళ్లారు.
 
పోలీసులకే రక్షణ లేకపోతే ఎలా?
ప్రజలను రక్షించాల్సిన పోలీసులకే రక్షణ లేకుండా పోతే.. ఇక సామాన్యుల పరిస్థితేమిటని తాడిపత్రి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుల దాడిలో గాయపడిన సీఐ హమీద్‌ఖాన్‌ తదితరులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జేసీ సోదరులు అరాచకాలకు పాల్పడటమే కాకుండా.. పోలీసులపైకి సైతం తమ అనుచరులను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. గతంలో జేసీ దివాకర్‌రెడ్డి పోలీస్‌ ఉన్నతాధికారులను దూషించారని.. అప్పుడే తగిన చర్యలు తీసుకొని ఉంటే పోలీసులకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అనంతరం నిందితులను అరెస్టు చేయాలంటూ పెద్దారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత రమేష్‌రెడ్డి తదితరులు స్థానిక పోలీస్‌స్టేషన్‌ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. అడిషనల్‌ ఎస్పీ చౌడేశ్వరి ఘటనాస్థలికి చేరుకొని నిందితులను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో వైఎస్సార్‌సీపీ నేతలు ధర్నా విరమించారు.  

నిందితులపై చర్యలు తీసుకుంటాం: ఎస్పీ
పోలీసులపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ తెలిపారు. సీఐ హమీద్‌ఖాన్, కానిస్టేబుల్‌ నరేంద్రరెడ్డిని తాడిపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం జిల్లా కేంద్రంలోని సవేరా ఆస్పత్రికి తీసుకొచ్చారు. హమీద్‌ఖాన్‌ తలకు బలమైన గాయాలవ్వడం.. కళ్లు వాయడంతో ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. క్షతగాత్రులను ఎస్పీ అశోక్‌కుమార్‌ పరామర్శించారు. అనంతరం ఎస్పీ మీడియా మాట్లాడుతూ.. స్థానిక పోలీసులకు సమాచారమివ్వకుండా సీఐ తన సిబ్బందితో కలిసి విచారణకు వెళ్లారన్నారు. అయితే పోలీసులపైనే దాడి జరగడం విచారకరమన్నారు. మట్కాను నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

రషీద్‌కు అధికార పార్టీ అండ..!
మట్కా డాన్‌ కేవీ రషీద్‌ కేరళకు చెందిన తన తండ్రి నుంచి వారసత్వంగా మట్కా నిర్వహణ తీసుకున్నాడు. జేసీ ప్రభాకర్‌రెడ్డి అండదండలతో యథేచ్ఛగా మట్కా నిర్వహిస్తున్నాడు. తాడిపత్రితో పాటు కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో తన మట్కా సామ్రాజ్యాన్ని విస్తరిం చాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రధాన అనుచ రుడు కావడంతో స్థానిక పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించేవారు. దీంతో అతను మట్కాలో కోట్లాది రూపాయలు ఆర్జించాడు. అతనిపై ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top